ప్రముఖనటుడితో పెళ్లి.. అయితే ఆగిపోయింది

www.mannamweb.com


బాలీవుడ్‌ నటుడు సల్మాన్‌ ఖాన్‌ (Salmankhan)తో తన పెళ్లి జరగాల్సిందని నటి సంగీతా బిజ్లానీ (Sangeeta Bijlani) తెలిపారు. అనివార్య కారణాల వల్ల అది ఆగిపోయిన మాట వాస్తవమేనని అన్నారు.

ప్రముఖ మ్యూజిక్‌ రియాల్టీ షో ఇండియన్ ఐడల్‌లో సందడి చేశారు బాలీవుడ్‌ అలనాటి నటి సంగీతా బిజ్లానీ (Sangeeta Bijlani). ఇందులో ఆమె తన వ్యక్తిగత విషయాలు పంచుకున్నారు. సల్మాన్‌ ఖాన్‌తో పెళ్లి గురించి గతంలో జరిగిన ప్రచారంపై ఎన్నో ఏళ్ల తర్వాత ఆమె పెదవి విప్పారు. ‘సల్మాన్‌ ఖాన్‌తో నా పెళ్లి జరగాల్సింది. అనివార్య కారణాల వల్ల అది ఆగిపోయింది. అది నిజమే’ అని కంటెస్టెంట్‌ ప్రశ్నకు సమాధానమిచ్చారు.

‘‘నిజమే. కాకపోతే దీని గురించి నేను మరేమీ చెప్పాలనుకోవడం లేదు’’ అని తెలిపారు. సంగీత వ్యాఖ్యలు షోలో పాల్గొన్న వారందరినీ ఆశ్చర్యానికి గురి చేశాయి. మరోవైపు, ఇదే విషయాన్ని గతంలో సల్మాన్‌ ఖాన్‌ కూడా మాట్లాడారు. తనకు పెళ్లి జరగాల్సిందని.. శుభలేఖలు కూడా ముద్రించిన తర్వాత అది ఆగిపోయిందని ఓ ఇంటర్వ్యూలో చెప్పారు. ఆ అమ్మాయి ఎవరనేది మాత్రం ఆయన చెప్పలేదు.

ఇదే కార్యక్రమంలో సంగీత తన మాజీ భాగస్వామి గురించి మాట్లాడారు. అతడి ప్రవర్తన వల్ల తాను ఇబ్బందిపడినట్లు చెప్పారు. ‘‘ఏదైనా మార్చుకునే అవకాశం వస్తే నా మాజీ భాగస్వామితో జీవితాన్ని మారుస్తా. మొదట్లో మా మధ్య రిలేషన్‌ బాగానే ఉండేది. రాను రాను అతడు కండిషన్స్‌ పెట్టడం మొదలు పెట్టాడు. ఈ దుస్తులు వేసుకోవద్దు. ఆ దుస్తులు వేసుకోవద్దు. డ్రెస్‌కి నెక్‌ మరీ ఇంత డీప్‌ ఎందుకు? అని సతాయించాడు. మొదట్లో ఎలాంటి డ్రెస్సులు వేసుకున్నా ఇబ్బంది పెట్టేవాడు కాదు కానీ తర్వాత అలా లేడు. ఇప్పుడు నాకు నచ్చినట్టు నేను జీవిస్తున్నా’’ అని ఆమె అన్నారు. అయితే అతడు ఎవరనేది మాత్రం సంగీత చెప్పలేదు.

‘యోధ’, ‘విష్ణు దేవా’, ‘ఇజ్జత్‌’, ‘గేమ్‌’ వంటి చిత్రాల్లో సంగీత యాక్ట్‌ చేశారు. ఆమె మోడల్‌గా రాణించిన సమయంలో సల్మాన్‌ ఖాన్‌తో కలిసి పలు వాణిజ్య ప్రకటనల కోసం వర్క్‌ చేశారు. అప్పుడే వీరిద్దరి మధ్య ప్రేమ మొదలైందని వార్తలు వచ్చాయి. పెళ్లి చేసుకుంటారని అందరూ భావించారు.