స్టేట్‌ బోర్డుకు గుడ్‌బై.. సీబీఎస్‌ఈకి షిఫ్ట్‌ అవుతున్న ప్రైవేట్‌ స్కూళ్లు

రాష్ట్రంలోని ప్రైవేట్‌ స్కూళ్ల (Private Schools) యాజమాన్యాల ఆలోచనలు మారుతున్నాయి.


పలు యాజమాన్యాలు స్టేట్‌బోర్డుకు గుడ్‌బై చెబుతున్నాయి. సీబీఎస్‌ఈకి జై (CBSE) కొడుతున్నాయి. స్టేట్‌ బోర్డు గుర్తింపు పొందిన స్కూళ్లు ఇప్పుడు సీబీఎస్‌ఈకి మారుతున్నాయి. ఈ ఐదేండ్ల కాలంలో 113 స్కూళ్లు స్టేట్‌బోర్డ్‌ నుంచి సీబీఎస్‌ఈకి మారాయి. ఏడాదికి సగటున 20 స్కూళ్లు సీబీఎస్‌ఈకి మారుతుండటం గమనార్హం. ఈ బడుల్లో అడ్మిషన్లకు డిమాండ్‌ ఉంటున్నది. పలు టాప్‌ స్కూళ్లల్లో అయితే అడ్మిషన్ల కోసం తల్లిదండ్రులకు తంటాలు తప్పడంలేదు. లక్కీ డ్రాలు, పైస్థాయి పైరవీలు చేయనిదే సీట్లు దొరకడంలేదు. సీబీఎస్‌ఈకి మారిన స్కూళ్లన్నీ తొలుత స్టేట్‌బోర్డు అనుమతి తీసుకున్నవే. మన దగ్గర అఫిలియేషన్‌ తీసుకుని, కొన్నేండ్లకు సీబీఎస్‌ఈకి మారుతున్నాయి.

ఇదీ పరిస్థితి..

  • మన రా్రష్ట్రంలోనే కాదు దేశవ్యాప్తంగా సీబీఎస్‌ఈ స్కూళ్ల సంఖ్య పెరుగుతున్నది. 2020లో ఈ స్కూళ్ల సంఖ్య 22 వేలుంటే, 2025కు వచ్చేసరికి 31వేలు దాటింది. అంటే ఈ ఐదేండ్లల్లోనే 9వేలకు పైగా కొత్త బడులు పెరిగాయి.
  • రాష్ర్టానికి ఇంటర్నేషనల్‌ స్కూళ్లు క్యూ కడుతున్నాయి. రెండేండ్ల క్రితం వరకు ఒక్కటంటే ఒక్క స్కూల్‌ కూడా లేకపోగా, నిరుడు 19 స్కూళ్లుంటే, ఈ విద్యాసంవత్సరంలో వీటి సంఖ్య 22కు పెరిగాయి.
  • రాష్ట్రంలో ఐసీఎస్‌ఈ స్కూళ్ల సంఖ్య కూడా పెరుగుతున్నది. ఈ స్కూళ్లు ఇది వరకు 36 ఉంటే ఇప్పుడు 47కు పెరిగాయి.
    కారణాలివే..
  • రాష్ట్రంలో తల్లిదండ్రుల ఆలోచనలు క్రమంగా మారుతున్నాయి. స్టేట్‌బోర్డు బడులకన్నా.. సీబీఈఎస్‌ సిలబస్‌యే ఉత్తమమన్న భావన నెలకొన్నది. జేఈఈ, నీట్‌ వంటి పరీక్షలను ఎన్సీఈఆర్టీ సిలబస్‌/పుస్తకాలపైనే ఆధారపడి నిర్వహిస్తున్నది. ఇది లాభించే అంశం.
  • సీబీఎస్‌ఈ స్కూళ్లల్లో భాషలకు అధిక ప్రాధాన్యం ఇస్తున్నారు. హిందీ సహా ఇంగ్లిష్‌, ఫ్రెంచ్‌, జర్మన్‌, స్పానిష్‌ వంటి విదేశీ భాషల నైపుణ్యాలు నేర్పిస్తున్నారు. భాషలపై మంచి పట్టు లభిస్తుంది.
  • విస్తారమైన ఆటస్థలాలు, భవనాలు, ఇతర సౌకర్యాలు ఉంటున్నాయి.
  • సీబీఎస్‌ఈ బడుల్లో బట్టికి ప్రాధాన్యత ఇవ్వరు. విశ్లేషణాత్మకంగా ప్రశ్నలు ఉంటాయి. లాజికల్‌, రీజనింగ్‌కు ప్రధాన్యం ఇస్తారు. కాన్సెప్ట్‌ ఆధారిత, అప్లికేషన్‌ ఓరియంటెడ్‌ లర్నింగ్‌కు ప్రాధాన్యం ఉంటుంది. దీంతో తల్లిదండ్రులు ఆసక్తి చూపుతున్నారు.
  • దేశవ్యాప్తంగా ఉద్యోగరీత్యా బదిలీ అయ్యేవారు, బ్యాంకు ఉద్యోగులు, ఇతర కుటుంబాలకు సీబీఎస్‌ఈ స్కూళ్లే ఉత్తమం.
👉 ఈ ఆర్టికల్ ని మీ వాట్సప్ / టెలిగ్రామ్ / పేస్ బుక్ / ట్విట్టర్ లలో షేర్ చేయండి .... థాంక్యూ.