ఎస్బీఐ అమృత్‌ వృష్టి.. ఆకర్షణీయ వడ్డీతో ప్రత్యేక ఫిక్స్‌డ్‌ డిపాజిట్‌

ప్రభుత్వ రంగ బ్యాంకింగ్‌ దిగ్గజం స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఎస్బీఐ) ఈ నెల 1 నుంచి తమ పాపులర్‌ ఫిక్స్‌డ్‌ డిపాజిట్‌ (ఎఫ్‌డీ) పథకం అమృత్‌ కలశ్‌ను ఆపేసింది.


అయితే మరో ప్రత్యేక ఎఫ్‌డీ అమృత్‌ వృష్టిని కొనసాగిస్తున్నది. ఇందులో డిపాజిట్‌దారులకు మరింత వడ్డీ ఆదాయం లభిస్తుండటం విశేషం. దీని కాలపరిమితి 444 రోజులు. రెగ్యులర్‌ ఇన్వెస్టర్లకు వార్షిక వడ్డీరేటు 7.25 శాతం వర్తిస్తుంది. సీనియర్‌ సిటిజన్లకు మాత్రం 7.75 శాతం వడ్డీ వస్తుంది. ఇక 80 ఏండ్లు దాటినవారికైతే ఇది 7.85 శాతంగా ఉండటం గమనార్హం.

ప్యాట్రన్స్‌, వుయ్‌-కేర్‌

ఎస్బీఐ పరిచయం చేసిన కొత్త టర్మ్‌ డిపాజిట్‌ సదుపాయమే ఈ ‘ప్యాట్రన్స్‌’. 80 ఏండ్లు, ఆపై వయసు కలిగినవారికే ఈ ప్రత్యేక ఎఫ్‌డీ అందుబాటులో ఉంటుంది. దీనిపై వార్షిక వడ్డీరేటు గరిష్ఠంగా 10 శాతం అందుకోవచ్చు. అలాగే ‘వుయ్‌-కేర్‌’ పేరిట 5-10 ఏండ్ల ఎఫ్‌డీలకు సీనియర్‌ సిటిజన్ల కోసం 7.50 శాతం వడ్డీనిస్తున్నది.