మధ్య తరగతి వర్గానికి అందుబాటులో ఉండేలా వివిధ బీమా కవరేజీలను అందించే ఎస్ బీఐ తాజాగా.. వ్యక్తిగత ప్రమాద బీమా పథకాన్ని (పీఏఐ) మరింత విస్తరించింది.
ఇన్నాళ్లు గరిష్టంగా రూ.20 లక్షల వరకు ఉన్న ప్రమాద బీమాను ఏకంగా రూ.40 లక్షలకు పెంచింది. కానీ వార్షిక ప్రీమియాన్ని మాత్రం రూ.2 వేలు గానే ఉంచింది. దీంతో.. అతితక్కువ ప్రీమియంతో పెద్ద మొత్తంలో బీమా కవరేజీని అందుకునే అవకాశం ఏర్పడింది. ఈ బీమా పథకానికి సంబంధించి తాజాగా ఎస్ బీఐ ఉత్తర్వులు జారీ చేసింది. మరి.. ఈ ఇన్యూరెన్స్ పాలసీ వివరాలు తెలుసుకోవాలంటే.. ఈ కథనం చదివేయండి.
చాలా మంది వ్యక్తిగత ప్రమాద బీమాను తీసుకోవాలి అనుకుంటూ ఉంటారు. దీంతో.. అనుకోని పరిస్థితుల్లో కుటుంబానికి ఆసరాగా ఉంటుందన్నది వారి ఆశ. అలాంటి వారికి అనువుగా కేవలం రోజుకు రూ.6 తో రూ.40 లక్షల ప్రమాద బీమా పథకాన్ని భారతీయ స్టేట్ బ్యాంక్ అమల్లోకి తీసుకు వచ్చింది. అంటే ఏడాదికి కేవలం రూ.2,000 మాత్రమే. కవరేజీని పొందిన తర్వాత అనుకోని ప్రమాదంలో ఖాతాదారుడు మరణిస్తే ఏకమొత్తంగా బీమా మొత్తం రూ.40 లక్షల వరకు అతని కుటుంబ సభ్యులకు అందిస్తారు. ఏదైనా ప్రమాదంలో పూర్తి స్థాయిలో అంగవైకల్యం సంభవిస్తే పాలజీ మొత్తాన్ని అందిస్తారు. లేదా.. ప్రమాదంలో తీవ్ర గాయాల పాలై కొంతమేర అంగవైకల్యం ఏర్పడితే.. బీమా మొత్తంలో కొంత భాగాన్ని చెల్లిస్తారు. ఇది అంగవైకల్యం తీవ్రత ఆధారంగా నిర్ణయిస్తారు.
ఎవరెవరు అర్హత :
ఈ బీమా సాధారణంగా 18 నుంచి 70 సంవత్సరాల మధ్య వయస్సు ఉన్న వ్యక్తులకు అందిస్తారు. ఈ పాలసీని రోడ్డు ప్రమాదాల్లో మరణించినా, శాశ్వత అంగవైకల్యం, పాక్షిక అంగవైకల్యం పాలైనా అందిస్తారు. అలాగే.. కరెంట్ షాక్, వరదలు, భూకంపం, పాము, తేలు కాటు మరణాలకు ప్రమాద బీమా వర్తిస్తుందని ఎస్ బీఐ అధికారులు తెలిపారు. అయితే.. ఈ పాలసీని ఆత్మహత్య, ఆత్మహననం, లేదా మద్యపానం/డ్రగ్స్ మత్తులో జరిగిన గాయాలు లేదా మరణాలకు వర్తించదని ఎస్ బీఐ వివరించింది. అలాగే.. ప్రమాదకర చర్యల్లో పాల్గొని మరణించినా, తీవ్ర గాయాలపాలైనా అంటే.. రేసింగ్, స్కైడైవింగ్ వంటి వాటిలో పాల్గొని గాయాల పాలైనా, మరణం సంభవించినా పథకం అందించరని తెలిపారు.
క్లెయిమ్ ప్రాసెస్:
ఏదైనా ప్రమాదం సంభవించినప్పుడు, బీమా అందించిన వ్యక్తులకు లేదా దగ్గర్లోని ఎస్ బీఐ బ్రాంచీకి తెలియజేయాల్సి ఉంటుంది. క్లెయిమ్ ప్రాసెస్ చేయడానికి, పోలీసులు నివేదికలు, వైద్య పత్రాలు, ప్రమాద సంబంధిత ఆధారాలు అవసరం అవుతాయి. ఒకసారి క్లెయిమ్ ఆమోదించితే, బీమా మొత్తం పథకదారునికి లేదా కుటుంబ సభ్యులకు చెల్లిస్తారు.
ప్రీమియం రూ.100 తో మొదలవుతుందని తెలిపిన అధికారులు.. గరిష్టంగా రూ.2 వేల వరకు ఉందని తెలిపారు. చెల్లించిన ప్రీమియం ఆధారంగా.. రూ.2 లక్షల నుంచి రూ.40 లక్షల వరకు అందిస్తారని చెబుతున్నారు. రూ.100తో రూ.2 లక్షలు, రూ.200తో రూ.4 లక్షలు బీమా అందించనున్నారు. అలా.. వివిధ ప్రీమియంల ప్రకారం.. గరిష్టంగా రూ.2 వేల ప్రీమియంతో రూ.40 లక్షల బీమా పొందవచ్చని వెల్లడిస్తున్నారు.
ఎలా దరఖాస్తు చేయాలి :
ఈ పథకాన్ని పొందాలంటే SBI Life అధికారిక వెబ్ సైట్ లేదా మొబైల్ యాప్ ద్వారా నమోదు చేసుకోవాల్సి ఉంటుంది. ఆఫ్ లైన్ ద్వారా అయితే సమీపంలోని SBI శాఖకు వెళ్లాల్సి ఉంటుంది. లేదా.. తెలిసిన SBI ఏజెంట్ ని సంప్రదించి ఈ బీమా పథకాన్ని పొందాల్సి ఉంటుంది.
ఈ పథకాన్ని ఎందుకు ఎంచుకోవాలి?
ఈ బీమాను ఎంచుకునేందుకు తక్కువ ప్రీమియం మొదటి కారణంగా చెప్పొచ్చు అంటున్నారు అధికారులు. మధ్య తరగతి వర్గానికి అందుబాటు ధరల్లోనే ఉండడంతో ఎక్కువగా డిమాండ్ ఉండే అవకాశాలున్నాయంటున్నారు. అకస్మాతిక మరణం, స్థిర అంగవైకల్యం, పాక్షిక అంగ వైకల్యానికి రక్షణ లభిస్తుండడం ఆకట్టుకునే అంశం. అలాగే.. ఈ బీమాను పొందిన వారికి సరళమైన క్లెయిమ్ ప్రాసెస్ అందించనున్నారు.