తెలంగాణ రాష్ట్రంలో కిడ్నీ, క్యాన్సర్ వంటి ప్రాణాంతక వ్యాధులు ప్రజలను తీవ్రంగా వేధిస్తున్నాయి. వయసుతో సంబంధం లేకుండా వేలాది మంది జనం ఈ రోగాల బారిన పడుతుండడం ప్రజారోగ్యానికి సంబంధించి షాకింగ్ విషయాలను వెల్లడిస్తోంది.
ముఖ్యంగా ఆరోగ్యశ్రీ ట్రస్ట్ నివేదిక ప్రకారం.. గత ఐదేళ్ల కాలంలో ప్రైవేట్ ఆసుపత్రుల్లో ఆరోగ్యశ్రీ ద్వారా చికిత్స పొందిన సూపర్ స్పెషాలిటీ కేసుల గణాంకాలు రాష్ట్రంలో వ్యాధుల తీవ్రతను స్పష్టం చేస్తున్నాయి.
గత ఐదేళ్ల కాలంలో 10 లక్షల మందికిపైగా వివిధ సూపర్ స్పెషాలిటీ చికిత్సలు పొందగా.. అందులో అత్యధికంగా 3,63,197 కేసులు కిడ్నీ సంబంధిత సమస్యలే ఉన్నాయి. ఆ తర్వాత స్థానంలో 3,06,702 కేసులతో క్యాన్సర్ రోగులు ఉన్నారు. వీటితో పాటు, ఎముకల సంబంధిత వ్యాధులు 1,93,852 కేసులతో మూడో స్థానంలో, గుండె సంబంధ సమస్యలు 1,45,814 కేసులతో నాలుగో స్థానంలో ఉన్నాయి. ఆరోగ్య నిపుణుల అభిప్రాయం ప్రకారం.. ప్రైవేట్ ఆసుపత్రుల్లో ఆరోగ్యశ్రీ కింద నమోదుకాని కేసులు, ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఉచిత చికిత్సలు పొందిన వారిని కలుపుకుంటే రాష్ట్రంలో ఇంతకు రెట్టింపు జనం ఈ వ్యాధుల బారిన పడుతున్నట్లు స్పష్టమవుతోంది. జీవనశైలిలో మార్పులు, కాలుష్యం, ఆరోగ్య అవగాహన లోపమే ఈ వ్యాధుల పెరుగుదలకు ప్రధాన కారణాలని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.
గత ఐదేళ్ల కాలంలో రాష్ట్ర ప్రభుత్వం ఆరోగ్యశ్రీ స్కీమ్ కింద 20 కీలక సూపర్ స్పెషాలిటీ సేవలకు గాను ప్రైవేట్ ఆసుపత్రులకు మొత్తం రూ. 3,110 కోట్లు చెల్లించినట్లు గణాంకాలు వెల్లడిస్తున్నాయి. ఈ మొత్తంలో కిడ్నీ వ్యాధులు, క్యాన్సర్, గుండె సంబంధిత చికిత్సలకే ఎక్కువ శాతం నిధులు కేటాయించారు. అత్యధికంగా కార్డియాలజీ కోసం రూ. 629.74 కోట్లు, పాలిట్రామా కోసం రూ. 551.44 కోట్లు ఖర్చు చేశారు. కిడ్నీ చికిత్సల కోసం నెఫ్రాలజీకి రూ. 322.98 కోట్లు, జెనిటో యూరినరీ సర్జరీస్ కోసం రూ. 356.89 కోట్లు చెల్లించినట్లు తెలిసింది. రేడియేషన్ ఆంకాలజీకి రూ. 232.88 కోట్లు, మెడికల్ ఆంకాలజీకి రూ. 117.46 కోట్లు, సర్జికల్ ఆంకాలజీకి రూ. 85.58 కోట్లు వెచ్చించారు.
మారుతున్న అలవాట్లు, జీవనశైలి కారణంగా అన్ని వయసుల వారిలో కిడ్నీ వ్యాధులు పెరుగుతుండడంతో లక్షల మందికి డయాలసిస్ అవసరం ఏర్పడింది. నిమ్స్ సీనియర్ నెఫ్రాలజిస్ట్ డాక్టర్ భూషణ్ రాజ్ వెల్లడించిన వివరాల ప్రకారం.. 20 ఏళ్ల కిందటి వరకు 50 ఏళ్లు దాటినవారిలోనే కనిపించే కిడ్నీ సమస్యలు ప్రస్తుతం వయసుతో సంబంధం లేకుండా రావడానికి డయాబెటిక్, హైపర్ టెన్షన్‌తో పాటు డాక్టర్ల సూచనలు లేకుండా యాంటీ బయాటిక్స్, పెయిన్ కిల్లర్స్ మందులను ఇష్టారీతిన వాడటం కూడా ప్రధాన కారణమని తెలుస్తోంది. ఈ విషయంలో ప్రజల్లో అవగాహన పెరగాల్సిన అవసరం ఉందన్నారు.
ఈ సమస్య తీవ్రతను దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో ప్రతి 25 కిలోమీటర్లకు ఒక డయాలసిస్ సెంటర్ ఏర్పాటు చేయాలని ప్రభుత్వం భావిస్తోంది. ప్రస్తుతం ఉన్న సుమారు 104 డయాలసిస్ సెంటర్లకు అదనంగా మరో 70 కేంద్రాలను అందుబాటులోకి తీసుకురావడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి. క్యాన్సర్ నిర్ధారణ, కీమోథెరపీ, రేడియోథెరపీ వంటి చికిత్సలు కూడా జిల్లా కేంద్రాల్లో అందుబాటులోకి తీసుకురావాలని ప్రభుత్వం భావిస్తోంది. ఇప్పటికే ప్రతి జిల్లాకో క్యాన్సర్ డే కేర్ సెంటర్, ప్రతి 25 నుంచి 30 కిలోమీటర్లకు ఒక ట్రామా కేర్ సెంటర్ ఏర్పాటు చేయాలని నిర్ణయించింది.
































