జనవరి నెలంతా సెలవులతో గడిచిపోయింది. రాబోయే ఫిబ్రవరి కూడా సెలవులతో ప్రారంభం అవుతోంది. వచ్చే సోమవారం (ఫిబ్రవరి) 3న తెలంగాణలోని విద్యాసంస్థలకు సెలవు ఇచ్చారు. ఎందుకో తెలుసా?
ఈ ఏడాది (2025) లో కేవలం ఒకేఒక నెల పూర్తి కావస్తోంది… కానీ సెలవులు మాత్రం భారీగా వచ్చాయి. న్యూ ఇయర్ మొదలు సంక్రాంతి సెలవుల వరకు తెలుగు విద్యార్థులకు సెలవులే సెలవులు వచ్చాయి. ఇలా జనవరి మొత్తం ఎక్కువ సెలవులతోనే గడిచింది. అయితే ఇప్పుడు ఫిబ్రవరి కూడా సెలవుతో ఆహ్వానం పలుకుతోంది.
తెలంగాణలోని స్కూల్స్, కాలేజీలకు ఫిబ్రవరి 3న ఐచ్చిక సెలవు (ఆప్షనల్ హాలిడే) గా ప్రకటించింది తెలంగాణ ప్రభుత్వం. అంటే ఈ రోజు రాష్ట్రంలోని కొన్ని విద్యాసంస్థలకు సెలవు వుండనుందన్నమాట. ఆరోజు సెలవు విద్యాసంస్థల యాజమాన్యాలపై ఆధారపడి వుంటుంది… హిందుత్వ, ఆద్యాత్మిక సంస్థల ఆధ్వర్యంలో నడిచే స్కూళ్లుకు సెలవు వుండనుంది.
వసంత పంచమి ప్రత్యేకత ఏమిటి?
చదువుల తల్లి ఆ సరస్వతి మాత జన్మించిన రోజును వసంత పంచమి లేదా శ్రీ పంచమిగా జరుపుకుంటారు హిందువులు. ప్రతి ఏడాది మాఘశుద్ద పంచమిని అమ్మవారి జన్మదినంగా నమ్మి ప్రత్యేక వేడుకలు జరుపుతుంటారు. చిన్నాపెద్ద తేడాలేకుండా ఈ రోజున పుస్తకాలను పూజిస్తే జ్ఞానం లభిస్తుందని నమ్ముతారు.
ఈ రోజున చిన్నపిల్లలతో అక్షరాభ్యాసం చేయిస్తుంటారు. స్కూళ్లు, దేవాలయాల్లో సామూహిక అక్షరాభ్యాసాలు నిర్వహిస్తుంటారు. ఇక బాసర వంటి పుణ్యక్షేత్రాల్లో వసంత పంచమి రోజున తమ పిల్లలకు అక్షరాభ్యాసం చేయించేందుకు భారీగా తరలివస్తుంటారు. అమ్మవారిని దర్శించుకుని ఆమె సన్నిధిలో పలకబలపం పడితే మంచి జ్ఞానం లభిస్తుందని నమ్ముతారు.
ఇలా స్కూల్స్ లో వేడుకలు నిర్వహించడంతో పాటు పిల్లలతో కలిసి తల్లిదండ్రులు దేవాలయాలకు వెళ్ళి అక్షరాభ్యాసం చేయిస్తుంటారు… అందువల్లే వసంత పంచమికి ఆప్షనల్ హాలిడే ఇచ్చింది తెలంగాణ ప్రభుత్వం. అయితే ఈ వసంత పంచమి ఐటీ, కార్పోరేట్ కంపనీల ఉద్యోగులకు కూడా కలిసివస్తోంది. వారు పిల్లలతో కలిసి సరదాగా టూర్ కు వెళ్లేందుకు వరుసగా మూడు రోజుల సెలవు వస్తోంది.
సెలవే కాదు లాంగ్ వీకెండ్ :
హైదరాబాద్ లో చాలా స్కూళ్లకు శని, ఆదివారం రెండ్రోజులు వీకెండ్ సెలవులు వుంటాయి. ఇక వసంత పంచమి సోమవారం వస్తోంది. ఆ రోజు కూడా స్కూల్ కి సెలవు ఇస్తు వరుసగా మూడ్రోజులు సెలవులు వస్తాయి. కాబట్టి ఐటీ, కార్పోరేట్ సంస్థల్లో పనిచేసే ఉద్యోగులు సోమవారం సెలవు పెడితే హాయిగా పిల్లలతో కలిసి టూర్ ప్లాప్ చేసుకోవచ్చు.
ఐటీతో పాటు ఇతర రంగాల్లో పనిచేసే ఉద్యోగులకు శని, ఆదివారం రెండ్రోజులు సెలవు వుంటుంది. ఫిబ్రవరి 3న వసంత పంచమి సందర్భంగా స్కూళ్లకు ఆప్షనల్ హాలిడే వుంది. కాబట్టి ఈ మూడురోజులు పేరెంట్స్ పిల్లలతో కలిసి చిన్న టూర్ కు వెళ్లవచ్చు. లేదంటే హైదరాబాద్ కు చెందినవారు బాసర వంటి పుణ్యక్షేత్రానికి వెళ్లి పుట్టినరోజున ఆ చదువుల తల్లి దర్శనం చేసుకోవచ్చు.
ఫిబ్రవరిలో మొత్తం సెలవులెన్ని :
వచ్చే నెల ఫిబ్రవరి సాధారణంగా నాలుగు ఆదివారాలు సెలవు వుంటుంది. ఇక ప్రత్యేక సెలవుల విషయానికి వస్తే 26న మహా శివరాత్రి వుంది. ఈ పండగను తెలంగాణ ప్రజలు భక్తిశ్రద్దలతో జరుపుకుంటారు కాబట్టి ఆ రోజు జనరల్ హాలిడేగా ప్రకటించారు. ఇక ఫిబ్రవరి 3న వసంత పంచమి, ఫిబ్రవరి 14 షబ్-ఇ-బరాత్ సందర్భంగా అప్షనల్ హాలిడేస్ వున్నాయి.
ఇలా ఫిబ్రవరిలో తెలంగాణలోని విద్యాసంస్థలకు మొత్తం ఎనిమిది హాలిడేస్ వున్నాయి. అయితే రెండో శనివారం కూడా సెలవు వుండాలి…కానీ జనవరిలో ఓ సెలవును అదనంగా ఇచ్చినందుకు ఈ నెలలో రెండో శనివారాన్ని వర్కింగ్ డే గా ప్రకటించారు. ఇలా ఈ నెలలో ఓ సెలవు మిస్ అయ్యింది.
మార్చి, ఏప్రిల్ నెలల్లో విద్యార్థులకు పరీక్షలు వుంటాయి. ఇవి ముగియగానే దాదాపు నెల నెలన్నర వేసవి సెలవులు వుంటాయి. ఈ సెలవుల్లో విద్యార్థులు తెగ ఎంజాయ్ చేస్తారు. పరీక్షల కోసం ఈ రెండుమూడు నెలలు కష్టపడి చదివితే వేసవి సెలవుల్లో సరదాగా గడపవచ్చు.