రోడ్డెక్కిన సచివాలయ ఉద్యోగులు

తమ సమస్యలు పరిష్కరించాలని కోరుతూ గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులు మంగళవారం ఏలూరు నగరపాలక సంస్థ ఎదుట నల్ల రిబ్బన్‌లు ధరించి నిరసన వ్యక్తం చేశారు.


హక్కుల సాధన కోసం సెప్టెంబర్‌ 23 నుంచి ఆందోళన కార్యక్రమాలు ప్రారంభిస్తున్నట్లు జేఏసీ వైస్‌ చైర్మన్‌ జీవీఎస్‌ శ్రీనివాస్‌ తెలిపారు. 15 రోజుల గడువు ముగిసినప్పటికీ సమస్యల పరిష్కారం కోసం ఎటువంటి స్పందన లేనందున 23 నుంచి ఆందోళన కార్యక్రమాలు చేపట్టనున్న చెప్పారు. గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగుల న్యాయమైన సమస్యలకు పరిష్కారం లభించని పక్షంలో ఐక్యవేదిక తరపున విజయవాడ వేదికగా మరోసారి రాష్ట్ర స్థాయి కార్యవర్గ సమావేశం నిర్వహించి ఉధృతంగా కార్యాచరణ రూపొందించి ముందుకు వెళ్తామని తెలిపారు.

నిరసన కార్యక్రమాలు ఇలా..

23 నుంచి 25 వరకు రోజూ నల్ల బ్యాడ్జీలు ధరించి విధులకు హాజరు.. 26న మధ్యాహ్న భోజన విరామంలో మండల, మున్సిపల్‌ కార్యాలయాల ముందు ప్ల కార్డుల ప్రదర్శన.. 27న మహాత్మా గాంధీ, బీఆర్‌ అంబేడ్కర్‌ విగ్రహాలకు వినతి పత్రాల సమర్పణ.. 28న విశాఖపట్నం వేదికగా ప్రాంతీయ సభతో పాటు ఆత్మగౌరవ శంఖారావం పేరిట 26 జిల్లాల్లో స్టీరింగ్‌ కమిటీల సమావేశాలు.. 29న సామాజిక పింఛన్‌ పంపిణీ నగదు బ్యాంకుల నుంచి డ్రా చేసిన అనంతరం అధికారిక వాట్సాప్‌ గ్రూపుల నుంచి వైదొలగడం.. అక్టోబర్‌ 4న జిల్లా స్టీరింగ్‌ కమిటీల సన్నాహక సమావేశం.. అక్టోబర్‌ 5న రాజమహేంద్రవరం వేదికగా ప్రాంతీయ సభ.

👉 ఈ ఆర్టికల్ ని మీ వాట్సప్ / టెలిగ్రామ్ / పేస్ బుక్ / ట్విట్టర్ లలో షేర్ చేయండి .... థాంక్యూ.