సచివాలయ వ్యవస్థలో సమూల మార్పులు

www.mannamweb.com


గ్రామ, వార్డు సచివాలయ శాఖ సమీక్షలో సీఎం

అమరావతి, డిసెంబరు 2(ఆంధ్రజ్యోతి): గ్రామ, వార్డు సచివాలయ వ్యవస్థలో సమూల మార్పులు తీసుకొచ్చి మరింత అర్థవంతంగా, పటిష్ఠంగా వ్యవస్థను తయారుచేసి ప్రజలకు ఉపయోగకరంగా నిలపాలని ముఖ్యమంత్రి చంద్రబాబు భావిస్తున్నారు.

ఇందులో భాగంగా సోమవారం గ్రామ, వార్డు సచివాలయాలపై ముఖ్యమంత్రి నివాసంలో సమీక్ష నిర్వహించారు. గ్రామాలు, పట్టణాల్లో సచివాలయాలు ప్రజలకు మరింత చేరువై, ఏ విధంగా మెరుగైన సేవలు అందించాలనే దానిపై చర్చ ప్రధానంగా సాగింది. సచివాలయాల పునర్వవస్థీకరణ ప్రధాన అజెండాగా జరిగిన మొదటి సమావేశంలో వ్యవస్థ పనితీరు, ప్రజలకు అందుతున్న సేవలపై అధికారులు ప్రజంటేషన్‌ ఇచ్చారు.

పంచాయతీలు ఎక్కువ…సచివాలయాలు తక్కువ

రాష్ట్రంలో గ్రామ పంచాయతీలు 13,291 ఉండగా, గ్రామ సచివాలయాలు మాత్రం 11,162 మాత్రమే ఉన్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 15,004 గ్రామ-వార్డు సచివాలయాలు ఉండగా వీటిలో 1,19,803 మంది ఉద్యోగులను నేరుగా నియమించారు. ఇతర విభాగాలవారిని కూడా కలుపుకుంటే 1,27,175 మంది గ్రామ, వార్డు సచివాలయాల్లో పనిచేస్తున్నారు. వారిలో గ్రామ సచివాలయాల్లో 95,533 మంది, వార్డు సచివాలయాల్లో 31,592 మంది ఉన్నారు. వీరిలో 18 – 27 సంవత్సరాల వయస్సు ఉన్న ఉద్యోగులు 50,284మంది, 28-37 సంవత్సరాల వయసున్న ఉద్యోగులు 54,774 మంది ఉన్నారు. సచివాలయ ఉద్యోగుల్లో పీజీ, పీహెచ్‌డీ, ఇంజనీరింగ్‌, వైద్య విద్య చదివిన వాళ్లు ఉన్నారు. పీజీ, ఆపైన చదివిన ఉద్యోగులు 14 శాతం, వృత్తివిద్యా కోర్సులు చదివినవాళ్లు 31శాతం ఉన్నారు. యువత అధికంగా ఉండే ఈ వ్యవస్థను ఎలా వినియోగించుకోవాలనేది చర్చించారు. రానున్న రోజుల్లో మరింత కసరత్తు జరిపి ప్రభుత్వం ఈ విభాగంపై ముందడుగు వేయనుంది.