Self Confidence : పిల్లల్లో ఆత్మవిశ్వాసాన్ని ఎలా నింపాలి.. ఈ చిట్కాలను చూడండి.

పిల్లలకు ఆత్మవిశ్వాసం చాలా ముఖ్యం. దానిని ఎలా సాధించాలనే దానిపై తల్లిదండ్రులు ఆందోళన చెందుతుంటారు. అయితే.. ప్రధానంగా పిల్లలకు కావలసింది క్రమశిక్షణ, కష్టాలు, డబ్బు లేకున్నా పరిస్థితులను ఎదుర్కొవడం, సంస్కారం ఇలా అన్నీ నేర్పించాలి.
ఇందులో ప్రధానంగా ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించుకోవడం నేర్పాలి. పిల్లల్లో ఆత్మవిశ్వాసాన్ని నింపే కొన్ని అంశాలు ఇక్కడ ఉన్నాయి
సానుకూల పదాలను మాత్రమే వాడండి : పిల్లల ముందు ప్రతికూల పదాలను ఎప్పుడూ వాడకండి, ఎందుకంటే అవి పిల్లలపై ప్రతికూల ప్రభావాన్ని చూపుతాయి. పిల్లలను అతిగా కట్టడి చేయవద్దు లేదా భయపెట్టవద్దు. పరీక్ష సమయంలో మళ్లీ మళ్లీ చదువుకోవాలని, చదువుకోకుంటే ఫెయిల్ అవుతారంటూ భయాందోళనలకు గురి చేయవద్దు. కార్యక్రమాలు, సమావేశాల సమయంలో పిల్లలను వేదికపైకి పంపాలి. చీకట్లో నడవడం నేర్పించాలి. ఆంక్షలు విధించకూడదు.
పిల్లలను మరీ గారాబం చేయవద్దు : పిల్లలు చెప్పే మాటలకు తల ఊపడం అవస్థలను తెచ్చిపెడుతుంది. అంటే పిల్లలు అడిగినవన్నీ ఇవ్వడం మానేయాలి. ఎందుకంటే భవిష్యత్తులో ఇదే అలవాటు అవుతుంది. ప్రతిసారీ వారు అడిగినవి ఇవ్వడం వల్ల.. మన ఇవ్వలేని పరిస్థితుల్లో వారు ఇబ్బంది పడతారు. పిల్లలు ఓపిక నేర్చుకునేలా మనకు అవి వద్దు అని వారికి నచ్చజెప్పాలి. అవసరానికి మించి గారాబం ప్రమాదం.


పిల్లలకు స్వేచ్ఛ ఇవ్వండి : ఉదయం అమ్మ చేసిన అల్పాహారం గురించి కొన్ని సార్లు పిల్లలు చిరాకు పడతారు. ఇది లేదా అది లేదా అని కోరుకోవడం పిల్లల సాధారణ స్వభావం. వారికి కావలసిన చిరుతిండిని తయారు చేసి ఆనందంగా తిననీయండి. బయట తినుబండాలను ప్రోత్సహించవద్దు. ఇంట్లో ఆహారం శ్రేష్టత గురించి వివరించండి.

వారి చిన్న చిన్న గొడవలను పరిష్కరించుకోనివ్వండి : పాఠశాలలో పిల్లలు వారి స్నేహితులతో గొడవపడతారు. ఇది సర్వసాధారణం. అయితే..
ఇలాంటి పరిస్థితుల్లో పిల్లల్నే తగువు తీర్చుకోమ్మనడం ఉత్తమం. వారి స్నేహాన్ని చక్కదిద్దుకోవడానికి తెలివైన మాటలు చెప్పండి. భవిష్యత్తులో స్నేహితులు, బంధువులతో సత్సంధాలను కొనసాగించడానికి ఇది వారికి సహాయపడుతుంది.