ప్రభుత్వ ఉద్యోగుల సంచలన నిర్ణయం.. పీఆర్‌సీ, పెండింగ్‌ డీఏలపై భారీ ఉద్యమం

భారతదేశంలోనే తెలంగాణలో ప్రభుత్వ ఉద్యోగుల సమస్యలు భారీగా పేరుకుపోయాయి. ఊహించని రీతిలో సమస్యలు పెండింగ్‌లో ఉండడమే కాకుండా చెల్లించాల్సిన వాటిని కూడా చెల్లించకపోవడంతో తెలంగాణ ప్రభుత్వంపై ఉద్యోగులు కన్నెర్ర చేస్తున్నారు.


దేశంలోనే అత్యధికంగా ఐదు డీఏలు పెండింగ్‌లో ఉండగా.. వేతన సవరణ సంఘం, బిల్లులు పెండింగ్‌ వంటి ప్రధాన సమస్యలు పరిష్కరించకుండా ప్రభుత్వం మీనమేషాలు వేస్తోంది. చర్చలు, కమిటీల పేరుతో కాలయాపన చేస్తున్న కాంగ్రెస్‌ ప్రభుత్వంపై ప్రభుత్వ ఉద్యోగులు పోరుబాటకు సిద్ధమయ్యారు. ప్రభుత్వ తీరుపై తీవ్ర అసహనంలో ఉన్న ఉద్యోగులు సమావేశమై భారీ కార్యాచరణ సిద్ధమయ్యారు.

హైదరాబాద్‌ నాంపల్లిలోని టీఎన్‌జీఓ కేంద్ర కార్యాలయంలో మంగళవారం తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగుల జేఏసీ సమావేశమైంది. ఉద్యోగ సంఘాల ప్రతినిధులు హాజరై సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకున్నారు. సమస్యల పరిష్కారంపై ఇప్పటివరకు వేచి చూశామని.. ఇకపై ఊరుకునేది లేదని స్పష్టం చేశారు. వేల కోట్లకు సంబంధించిన పనులు పెండింగ్‌లో ఉన్నాయని తెలిపారు. ఐదు డీఏలు విడుదల చేయడం లేదని ప్రభుత్వంపై మండిపడ్డారు.

జేఏసీ సమావేశం అనంతరం తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగుల జేఏసీ చైర్మన్‌ మారం జగదీశ్వర్‌ కీలక వ్యాఖ్యలు చేశారు. రేవంత్ రెడ్డి నిర్లక్ష్య వైఖరికి నిరసనగా అక్టోబర్ 12వ తేదీన ఛలో హైదరాబాద్ కార్యక్రమం చేపడుతున్నట్లు ప్రకటించారు. ‘మా నిరసన గళం ప్రభుత్వానికి వినిపిస్తాం. ఇప్పటివరకు వేచి చూశాం. పీఆర్‌సీ కమిటీ ప్రకటించి రెండేళ్లు అవుతున్నా ఇప్పటివరకు కమిటీ రిపోర్ట్ తీసుకోలేదు’ అని జగదీశ్వర్‌ తెలిపారు.

దేశంలో ఎక్కడ లేని విధంగా తెలంగాణలో 5 డీఏలు పెండింగ్‌లో ఉన్నాయని తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగుల జేఏసీ చైర్మన్‌ మారం జగదీశ్వర్‌ గుర్తుచేశారు. ‘ఉద్యోగులకు రూ.వేల కోట్లు పెండింగ్‌లో ఉన్నాయి. ఉద్యోగ సంఘాలకు కొందరు మంత్రులు సమయం కూడా ఇవ్వడం లేదు’ అని తెలిపారు. తమ వెనుక ఏ పార్టీలు లేవు.. తమ సమస్య.. తమ బాధ తాము చెప్పుకుంటున్నట్లు స్పష్టం చేశారు. ‘ఎవరో ఒక ఉద్యోగి ఏసీబీలో దొరికితే అందరిని దొంగలుగా చూస్తున్నారు. ప్రభుత్వ ఉద్యోగులు అంటే ఎవరు పిల్లను ఇచ్చేటట్టు లేరు’ అని ఆవేదన వ్యక్తం చేశారు.

ఉద్యోగులకు హెల్త్ కార్డులు ఇవ్వాలని తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగుల జేఏసీ చైర్మన్‌ మారం జగదీశ్వర్‌ డిమాండ్‌ చేశారు. ఒకటో తేదీన జీతాలు ఇవ్వడం ప్రభుత్వాల హక్కు అని స్పష్టం చేశారు. సెప్టెంబర్ 8 నుంచి 19వ తేదీ వరకు తెలంగాణ వ్యాప్తంగా బస్సుయాత్ర ఉంటుందని ప్రకటించారు. అక్టోబర్ 12వ తేదీ చలో హైదరాబాద్ కార్యక్రమం ఉంటుందని తెలిపారు. తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగుల జేఏసీ జనరల్ సెక్రటరీ ఏలూరి శ్రీనివాస్ మాట్లాడుతూ.. ఉద్యోగులకు సంబంధించి 63 డిమాండ్లు పరిష్కరించాలని విజ్ఞప్తి చేశారు. ప్రభుత్వ ఉద్యోగ సంఘాలు రేవంత్‌ రెడ్డికి అమ్ముడుపోయామని తమను తిడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.

👉 ఈ ఆర్టికల్ ని మీ వాట్సప్ / టెలిగ్రామ్ / పేస్ బుక్ / ట్విట్టర్ లలో షేర్ చేయండి .... థాంక్యూ.