ప్రభుత్వ ఉద్యోగుల సంచలన నిర్ణయం.. డీఏ, పీఆర్‌సీ, రిటైర్మెంట్‌ బెనిఫిట్స్‌ కోసం

ప్రభుత్వ ఉద్యోగంలో ఉన్నామని చెప్పుకోవడం తప్ప తమ సమస్యలు పరిష్కరించుకోలేని పరిస్థితి ప్రభుత్వ ఉద్యోగులది. దేశంలో ఎక్కడైనా కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులతోపాటు రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు, పింఛన్‌దారులకు ఇదే సమస్యలు ఉన్నాయి.


తమకు సంబంధించిన కరువు భత్యం, పీఆర్‌సీ, హెల్త్‌ కార్డుల కోసం పోరాటం చేయవలసి వస్తోంది. తాజాగా ఏపీ ప్రభుత్వ ఉద్యోగులు ప్రభుత్వంపై పరోక్షంగా ఆగ్రహం వ్యక్తం చేశారు. తమ సమస్యలు వెంటనే పరిష్కరించాలని డిమాండ్‌ చేశారు.

పశ్చిమగోదావరి జిల్లా సంఘం అడ్ హక్ కమిటీని బుధవారం భీమవరంలో ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఏపీ ఎన్‌జీవో సంఘం రాష్ట్ర అధ్యక్షుడు ఎ. విద్యాసాగర్ కీలక ప్రసంగం చేశారు. కూటమి ప్రభుత్వం తమ సమస్యలపై స్పందించడం లేదని పరోక్షంగా వ్యాఖ్యలు చేశారు. డీఏతోపాటు పీఆర్‌సీ, హెల్త్‌ కార్డుల సమస్యలు పరిష్కరించాలని డిమాండ్‌ చేశారు. పేరుకుపోయిన ఉద్యోగుల డిమాండ్‌లను ఒక్కొక్కటిగా పరిష్కరించడానికి తాము బాధ్యత తీసుకున్నట్లు చెప్పారు. కూటమి ప్రభుత్వం వచ్చాక జీపీఎఫ్, ఏపీజీఎల్ఐ, రిటైర్ అయిన ఉద్యోగులకు సుమారు రూ.11,000 కోట్ల బకాయిలు ఇప్పించినట్లు వెల్లడించారు.

సీపీఎస్‌ ఉద్యోగులకు పెండింగ్ బకాయిలు సుమారు రూ.3,200 కోట్లు ప్రాన్ అకౌంట్స్‌లో జమ చేసేలా కృషి చేసినట్లు ఏపీ ఎన్‌జీవో సంఘం రాష్ట్ర అధ్యక్షుడు విద్యాసాగర్ తెలిపారు. అపరిష్కృతంగా ఉన్న నాలుగు డీఏలలో ఒక డీఏను, పెన్షనర్లకు డీఆర్‌ని ఇప్పించినట్లు గుర్తుచేశారు. ఉద్యోగులకు పెన్షనర్లకు హెల్త్ కార్డులపై మెరుగైన వైద్యం అందించాలని.. పదవీ విరమణ చేసిన ఉద్యోగుల బకాయిలు వెంటనే చెల్లించాలని డిమాండ్‌ చేశారు.

మిగిలిన కాంట్రాక్టు ఉద్యోగులు 7000 మందిని రెగ్యులరైజ్ చేయాలని ఏపీ ఎన్‌జీఓ సంఘ రాష్ట్ర అధ్యక్షుడు విద్యాసాగర్ కోరారు. 12వ వేతన సవరణ సంఘం కమిటీ ఏర్పాటు చేయాలని.. పెండింగ్ డీఏలు తక్షణమే మంజూరు చేయాలని డిమాండ్ చేశారు. ఉద్యోగ, ఉపాధ్యాయులు, పెన్షనర్లు మెడికల్ రీయింబర్స్‌మెంట్ విధానం అమలు చేస్తున్నారని.. హెల్త్ కార్డ్స్ సరిగా వినియోగంలోకి రాకపోవడంతో తాము తీవ్రంగా నష్టపోతున్నట్లు వాపోయారు.

2004కి ముందు నియమితులైన ఉద్యోగులకు పాత పెన్షన్ విధానం కొనసాగించే విషయం ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లినట్లు ఏపీఎన్‌జీవో సంఘం రాష్ట్ర అధ్యక్షుడు విద్యాసాగర్ తెలిపారు. కాంట్రాక్టు ఉద్యోగులను క్రమబద్ధీకరణ చేయాలని.. గ్రామ, వార్డు సచివాలయాల ఉద్యోగులకు నోషనల్ ఇంక్రిమెంట్లు ఇవ్వాలని, పెన్షనర్లకు గత ప్రభుత్వం తొలగించిన అడిషనల్ క్వాంటామ్ ఆఫ్ పెన్షన్‌ పునరుద్ధరణ చేయాలని విజ్ఞప్తి చేశారు. ఔట్ సోర్సింగ్ ఉద్యోగులకు హెచ్ఆర్ పాలసీని అమలు చేయాలని కోరారు.

👉 ఈ ఆర్టికల్ ని మీ వాట్సప్ / టెలిగ్రామ్ / పేస్ బుక్ / ట్విట్టర్ లలో షేర్ చేయండి .... థాంక్యూ.