ఇటీవల సుప్రీంకోర్టు వీధి కుక్కలకు టీకాలు, స్టెరిలైజేషన్ వేయాలని ఆదేశించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే కేంద్ర ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది.
దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లో కనీసం 70 శాతం శునకాలకు టీకాలు, స్టెరిలైజేషన్ తప్పనిసరి చేసింది. అనంతరం మళ్లీ వాటిని ఉన్నచోటే విడిచిపెట్టాలని ఆదేశించింది. ఇంతకుముందు కేంద్రం ఈ నిబంధనలను కొన్ని ప్రాంతాలకు మాత్రమే పరిమితం చేసింది. కానీ ఇప్పుడు అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు ఈ ఆదేశాలు జారీ చేసింది. అంతేకాదు ప్రతి రాష్ట్రం కూడా ఈ నిబంధనలు అమలు చేస్తున్నట్లు నెలవారీ రిపోర్టును సమర్పించాలని ఆదేశించింది.
అంతేకాదు కేంద్ర ప్రభుత్వం.. రాష్ట్రాలకు, కేంద్రపాలిత ప్రాంతాలకు వీధి కుక్కలకు సంబంధించి సబ్సిడీని కూడా ప్రకటించింది. ఒక్కో శునకానికి రూ.800, అలాగే ఒక్కో పిల్లికి రూ.600 చొప్పున అందించనుంది. అలాగే అన్ని నగరాల్లో వీధి కుక్కలకు ఆహారం అందించే కేంద్రాలు, రేబిస్ కంట్రోల్ యూనిట్స్, షెల్టర్ హోమ్స్ అందించేందుకు కూడా ప్రత్యేకంగా నిధుల విడుదల చేస్తామని తెలిపింది. చిన్న షెల్టర్ల కోసం రూ.15 లక్షలు, పెద్ద షెల్టర్ల కోసం రూ.27 లక్షల వరకు నిధులు కేటాయించనుంది. జంతు ఆస్పత్రులు, సంరక్షణ కేంద్రాల కోసం కేంద్రం ఒకేసారి రూ.2 కోట్ల నిధులు మంజూరు చేయనుంది.
































