కార్తీకమాసం.. ఈ నెల శివకేశవులకు అత్యంత ప్రీతికరమైనది చెప్తుంటారు. శైవక్షేత్రాన్ని ఒక్కసారి సందర్శించి, దీపం వెలిగించి, శివుడిని దర్శించుకుంటే చాలంటారు.
ఏడాదంతా దీపం వెలిగించకపోయినా కార్తీకమాసంలో ఏదైనా ఒక్కరోజు 365 వత్తులతో దీపం పెట్టినా సరిపోతుందని పండితులు చెప్తుంటారు. అంతటి పుణ్య ఫలాన్నిచ్చే, పవిత్రంగా భావించే కార్తీకమాసంలో.. తెలుగురాష్ట్రాల్లో ఘోర ప్రమాదాలు జరిగాయి.
అక్టోబర్ 24వ తేదీన హైదరాబాద్ నుంచి బెంగళూరుకు ప్రయాణికులతో వెళ్తున్న వేమూరి కావేరీ ట్రావెల్స్ బస్సు ఒక బైకును ఈడ్చుకుంటూ వెళ్లడంతో.. మంటలు చెలరేగి 19 మంది సజీవదహనమయ్యారు. మృతదేహాలు లభ్యమైన తీరు గుండెల్ని పిండేసింది. బిడ్డను కాపాడుకునేందుకు ఓ తల్లి అలానే పట్టుకుని మంటల్లో కాలిపోయిన సన్నివేశం ఇంకా కళ్లముందే కదలాడుతోంది. ఆ ఘటన నుండి పూర్తిగా తేరుకోకుండానే.. కాశీబుగ్గలో మరో విషాదం.
కార్తీక శనివారం, పైగా ఏకాదశి కావడంతో నవంబర్ 1వ తేదీన కాశీబుగ్గలో ఉన్న వేంకటేశ్వరస్వామి ఆలయానికి వెళ్లిన భక్తుల మధ్య తొక్కిసలాట జరిగి.. 9 మంది మరణించారు. 2-3 వేల మందికి మాత్రమే కెపాసిటీ ఉన్న ఆలయానికి ఒక్కసారిగా 15 వేల నుంచి 20 వేల మంది రావడంతో ఈ దారుణం జరిగింది. అయ్యో.. దేవుడా! ఇలా జరిగిందేంటనుకునేలోపే మరో ఘోరం.
నవంబర్ 3వ తేదీ తెల్లవారుజామున తాండూరు నుంచి హైదరాబాద్ కు ప్రయాణికులతో వస్తున్న ఆర్టీసీ ఎక్స్ ప్రెస్ బస్సును కంకర లోడుతో ఎదురుగా వచ్చిన టిప్పర్ మితిమీరిన వేగంతో ఢీ కొట్టి.. బస్సును చీల్చుకుంటూ వెళ్లింది. టిప్పర్లో ఉన్న కంకర బస్సులో పడటంతో.. ప్రయాణికుల ప్రాణాలు గాల్లో కలిసిపోయాయి. ఎవరైనా వచ్చి కాపాడకపోతారా అని కంకరలో కూరుకుపోయిన కొందరి ఎదురుచూపులకు సంబంధించిన ఫొటోలు నెట్టింట వైరల్ అయ్యాయి. 19 మంది చనిపోగా.. తల్లిదండ్రుల్ని కోల్పోయిన పిల్లలు, పిల్లల్ని కోల్పోయిన తల్లిదండ్రుల ఆర్తనాదాలు మిన్నంటాయి. దేవుడా.. నువ్వసలు ఉన్నావా అని ముగ్గురు అక్కచెల్లెళ్లు సాయిప్రియ, నందిని, తనూషల తల్లిదండ్రులు విలపించిన తీరు.. తెలుగు రాష్ట్రాల ప్రజలచేత కంటతడి పెట్టించాయి. వారి అంత్యక్రియల వీడియోలు నెట్టింట వైరల్ గా మారగా.. దేవుడు ఎందుకిలా మనుషులతో ఆడుకుంటున్నాడంటూ కామెంట్స్ చేస్తున్నారు.
పవిత్రంగా భావించే కార్తీకమాసంలో 10 రోజుల వ్యవధిలో మూడు ఘోర ప్రమాదాలు. దీనికి బ్రహ్మంగారి కాలజ్ఞానానికి లింక్ పెడుతున్నారు కొందరు. ఇంకొందరు జ్యోతిష్యానికి లింక్ పెట్టి మాట్లాడుతున్నారు. దేవగురు అయిన బృహస్పతి అక్టోబర్ 19వ తేదీన మిథున రాశి నుంచి కర్కాటక రాశిలోకి ప్రవేశించిందంటున్నారు. ప్రపంచంలో బీభత్సకర పరిస్థితులు అంటే.. కార్గిల్ యుద్ధం, రెండో ప్రపంచ యుద్ధం, రెండు దేశాల మధ్య యుద్ధవాతావరణం నెలకొన్న పరిస్థితులు బృహస్పతి అతిచార సంచారం జరిగినపుడే సంభవించాయంటున్నారు.
రాబోయే 8 సంవత్సరాలపాటు బృహస్పతి అతిచార సంచారం కొనసాగుతుందన్నారు. దీనివల్ల గ్రహగతులు సరిగ్గా లేకపోవడం వల్ల భారీ రోడ్డుప్రమాదాలు, తొక్కిసలాటలు, ప్రకృతి వైపరీత్యాలు, వాహన ప్రమాదాలు జరిగి పదుల సంఖ్యలో ప్రజలు మరణిస్తున్నారని జ్యోతిష్యులు విశ్లేషిస్తున్నారు. 8 సంవత్సరాలపాటు ఇలాంటి ఘటనలు పునరావృతం అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయన్నారు. దేశాలు, రాష్ట్రాల మధ్య అంతర్యుద్ధాలు, మతోన్మాదం వంటి ఘటనలు కూడా చూస్తామన్నారు.
వీరబ్రహ్మేంద్రస్వామి కాలజ్ఞానంలో ఇలాంటి పరిస్థితులు వస్తాయని చెప్పారంటున్నారు పండితులు. కేవలం కార్తీకమాసంలోనే కాదు.. ఈ ఏడాది డిసెంబరులోగా ఇలాంటి దారుణమైన, ఘోరమైన ప్రమాదాలు జరిగే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని చెప్తున్నారు. నవంబర్ చివరి నుంచి శుక్రమూఢం ప్రారంభమవుతుండగా.. నెలన్నరపాటు ఇది ఉంటుందన్నారు. ప్రయాణికులు, రద్దీప్రాంతాలకు వెళ్లేవారు జాగ్రత్తగా ఉండాలని, ప్రభుత్వాలు సైతం జాగ్రత్త చర్యలు తీసుకోవాలని సూచించారు. శబరిమల వెళ్లే స్వాములు మరింత జాగ్రత్తగా ఉండాలని సూచించారు. ముఖ్యంగా 12 ఏళ్ల లోపు పిల్లలపై బృహస్పతి ప్రభావం మాత్రమే ఉంటుందని, ప్రస్తుతం అతిచార సంచారం ఉండటంతో వారంతా జాగ్రత్తగా ఉండాలని చెప్తున్నారు.
































