ఓయ్.. రిక్షా, శంకర్ విలాస్ సెంటర్ కి వస్తావా

ఏమిటీ ప్రశ్నలనేగా మీ సందేహం..గర్తపురి ఎలియాస్ గుంటూరు అనడంతోనే ఠక్కున గుర్తుకు వచ్చే సెంటర్ శంకర్ విలాస్ సెంటర్. ఇద్దరు మిత్రులు కలవాలన్నా, చుట్టుపక్కల ఊళ్ల నుంచి వచ్చే చుట్టపక్కాలకి, దూరాభారం నుంచి వచ్చే సన్నిహితులు, మిత్రులు, అపరిచితులకు ఓ బండ గుర్తు చెప్పాలన్నా ముందు గుర్తుకు వచ్చే పేరు శంకర్ విలాస్. ఇప్పుడంటే అరక్కోణం, కుంభకోణం, మద్రాసు, అరకు కాఫీలు వచ్చాయి గాని ఓ 20, 25 ఏళ్ల కిందట గుంటూరులో నురగలు గక్కే వేడి వేడి కాఫీని మిలమిలా మెరిసే ఓ ఇత్తడి గ్లాసు, దానికింద గుంట గిన్నె లాంటి సాసర్ లో (తమిళ సాంప్రదాయ కప్పు, సాసర్) ఇచ్చే ఏకైక హోటల్ అది. ఫిల్టర్ కాఫీకీ పెట్టింది పేరు. ఒక్క కాఫీ కప్పుతో — ప్రపంచం ఆసాంతం- కళ్ల ముందుండేది.


పొద్దునైనా సాయంత్రమైనా ఈ హోటల్ కి వచ్చే వాళ్లూ ఓ పేపర్ కొని చంకలో పెట్టుకోవడం ఆనవాయితీ. ఎగిసిపడే ఆవిర్లు చిమ్మే కాఫీని ఆస్వాదించడం రివాజు.

ఒక్క గుంటూరు వాసులకే కాదు యావత్తు రాష్ట్ర ప్రజల గుండెల్లో అంతగా సుస్థిరంగా నిలిచిపోయిన ప్లేస్ గుంటూరు శంకర్ విలాస్ సెంటర్. అంతగా మమేకమైన కూడలి అది. పాత గుంటూరు, కొత్త గుంటూరును కలిపే ఒకానొక చారిత్రక తీపిగుర్తు శంకర్ విలాస్ సెంటర్.ఇప్పుడక్కడ ఆ హోటల్ ఆనవాళ్లు కనుమరుగవుతున్నా ప్రజలు మాత్రం ఆ సెంటర్ ను మరువలేకున్నారు. ఓవైపు బ్రాడీపేట మరోవైపు అరండల్ పేట. ఈ రెండు పేటల నడుమ శంకర్ విలాస్. బ్రాడీపేట నాలుగో లైను మొదట్లో ఈ హోటల్ ఉండేది. ఇప్పుడది ఆ పక్కకు జరిగి పోయింది.పాత శంకర్ విలాస్ ఉన్న ప్రాంతంలో బాటా షో రూం వెలిసింది. సుదీర్ఘ చరిత్ర ఉన్న ఈ సెంటర్ ఇప్పుడు కాలగర్భంలో కలిసిపోనుంది. గుంటూరులో ఓ తీపి గురుతు చరిత్ర కాబోతోంది. గుంటూరు బస్టాండ్ వద్ద ఆటో ఎక్కి ఓవర్ బ్రిడ్జి దిగడంతోనే కనిపించే కూడలి శంకర్ విలాస్ సెంటర్. స్వాతంత్య్రానికి పూర్వమే కేరళ నుంచి గుంటూరు వచ్చిన శంకరన్ అనే ఆయన 1953 ప్రాంతంలో ఈ హోటల్ పెట్టారు. ఆ తర్వాత అది గుంటూరు వాసుల గుండెల్లో పదిలమైంది. చిరస్థాయిగా నిలిచిపోయింది.రాజకీయాలకు రచ్చబండ…ఆ హోటల్లో ఇడ్లీ సాంబర్ తిని కాఫీ తాగందే రోజు సాగని జనం బోలెడంత మంది ఉన్నారంటే అతిశయోక్తి కాదు. రాష్ట్రంలో జరిగే రాజకీయాలకు అదో రచ్చబండ. ఈ సెంటర్లో జరిగే చర్చలు రాబోయే రాజకీయ పరిణామాలకు సంకేతాలు. ఇప్పుడు లేవు గాని ఒకప్పుడు విజయవాడ నుంచి సాయంకాలం దినపత్రిక ఎడిషన్లు వచ్చేవి. సాయంత్రం ఏ ఐదారు గంటలకో అవి వస్తే తలా ఒకటి కొని రాత్రి 9 గంటల వరకు చర్చోపచర్చలు సాగించే వారు. గురువారం సాయంత్రం వచ్చిందంటే విజయవాడ నుంచి వచ్చే వారపత్రికల కోసం ఇక్కడ జనం క్యూ కట్టేవారు. ఆ పత్రికల్లో ప్రముఖ రచయితలు యండమూరి, మల్లాది, వాసిరెడ్డి సీతాదేవి, యద్దనపూడి సులోచనా రాణి వారు రాసే సీరియల్స్ ఆ వీక్లీలలో ఉండేవి. ప్రత్యేకించి యండమూరి వీరేంద్రనాథ్ రాసిన సీరియల్ నవల తులసీదళం అచ్చేసే ఆంధ్రభూమి వీక్లీ కోసం జనం ఎంతగా ఎదురు చూసే వారో ఆ సెంటర్ ను చూసిన వారికి అర్థమవుతుంది. అంతటి రద్దీ ప్రాంతమది.

గుంటూరు శంకర్ విలాస్ సెంటర్ లోని రైల్వే ఓవర్ బ్రిడ్జి (ఫైల్)

గుంటూరులో తొలి రైల్వే ఓవర్ బ్రిడ్జి కూడా శంకర్ విలాస్ బ్రిడ్జి గానే పేరుగాంచింది. ఈ హోటల్ కు అది కూతవేటు దూరంలో ఉంటుంది. 1958లో అప్పటి ముఖ్యమంత్రి నీలం సంజీవ రెడ్డి చేతులమీదుగా ప్రారంభమైన రెండు లేన్ల రోడ్ ఓవర్ బ్రిడ్జ్ (ROB) దశాబ్దాల సేవ అనంతరం ఇప్పుడు కూల్చివేతకు సిద్ధమవుతోంది. దాని స్థానంలో ₹150 కోట్లతో నాలుగు లేన్ల నూతన ROB నిర్మాణానికి రంగం సిద్ధమవుతోంది. అటువంటి ఈ బ్రిడ్జీని కూల్చడమంటే కేవలం ఓ వంతెనను కూల్చడం కాదు.. అది ఓ చరిత్రను, ఓ చిరకాల గుర్తును చెరిపేస్తున్న సందర్భం.

ఒక్క హోటల్ పేరు మీద ఇంతటి చరిత్రా?శంకర్ విలాస్ సెంటర్ పేరు శంకర్ విలాస్ హోటల్ నుంచే వచ్చింది. ఇది 1953లో బ్రాడీపేట 4వ లైను మొదట్లో నాలుగు రోడ్ల కూడలిలో ఏర్పాటైంది. స్థానికులకు అది కేవలం ఓ హోటల్ మాత్రమే కాదు పదుగురు కలిసి కబుర్లు ఊసులాడుకునే చోటు. చర్చోపచర్చలకు మారుపేరు. రాజకీయ చర్చలకు వేదిక. ఈ పేరు చుట్టూ ఓ సంప్రదాయిక గౌరవం నెలకొంది. అందుకే ఓ సందర్భంలో నేటి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సైతం ‘గుంటూరు అనడంతోనే శంకర్ విలాస్ మనకు గుర్తుకువస్తుంది’ అంటారు. అంతటి ఖ్యాతి ఆ హోటల్ కి, ఆ సెంటర్ కి ఉంది. అటువంటి శంకర్ విలాస్ ఆ తర్వాతి కాలంలో బాగా విస్తరించింది. బ్రాడీపేటలో ఆ పేరిట ఓ లాడ్జీ, మరో శ్రీ ఉదయ్ శంకర్ రెస్టారెంట్ పేరిట భోజన హోటల్ ఏర్పాటైంది. ఈ రెస్టారెంట్ లో తినడమంటే ఓ స్టేటస్ సింబల్. కాలంతో పాటు శంకర్ కుటుంబంలో వచ్చిన మార్పులతో బ్రాడీపేటలో ముందు స్థాపించిన హోటల్ వెనక్కి పోయింది. ఆ ప్లేస్ పై చాలామంది రాజకీయ నాయకులు కన్నుపడినా శంకర్ తాను బతికున్న 1992వరకు దాన్ని కాపాడుకుంటూనే వచ్చారు. శంకర్ తర్వాత రెండు తరాలు ఈ హోటల్ ను నడిపించాయి. 2022, 2023లో ఈ హోటల్ వివాదాల్లో చిక్కుకుంది. వాస్తవ యాజమానులైన శంకర్ కుటుంబం ఈ హోటల్ కు దూరమైంది. శంకర్ కుటుంబ సభ్యురాలు, హోటల్ ను 2023 వరకు నిర్వహించిన రంగనాయకమ్మ ఇప్పుడా హోటల్ ను వదిలేసి హైదరాబాద్ చేరారు. అదే వేరే సంగతి. ROB – చరిత్రలో ఓ మైలురాయిగుంటూరు నగర విస్తరణతో పాటు ట్రాఫిక్ రద్దీ బాగా పెరిగింది. ప్రజల అవసరాలూ పెరిగాయి. దీంతో శంకర్ విలాస్ సెంటర్ ఫ్లై ఓవర్ ను కూల్చి ఆ ప్రాంతంలో కొత్త వంతెనలు కట్టాల్సిన పరిస్థితి వచ్చింది. 1958 ఆగస్టు 8న శంకుస్థాపన అయిన రెండు లేన్ల ROB, 65 ఏళ్ల పాటు గుంటూరు ప్రజలకు సేవలందించింది. నగరాభివృద్ధిలో కీలక పాత్ర పోషించింది. వాస్తవానికి ఈ ఓవర్ బ్రిడ్జి జీవిత కాలం 50 ఏళ్లు. ఆ గడువు ముగిసిన కూడా 15 ఏళ్లు దాటింది. ప్రస్తుత అవసరాలు – అభివృద్ధికి తలుపులు..నగరంలో పెరుగుతున్న వాహనాల రద్దీ, కొత్త ప్రాంతాల అభివృద్ధి, అమరావతి కేంద్రంగా రాష్ట్ర రాజధాని నిర్మాణంతో రాకపోకలు పెరిగాయి. గుంటూరు మున్సిపల్ కార్పొరేషన్, రోడ్లు & భవనాల (R&B) శాఖ, రైల్వే శాఖ కలిసి రెండు దశల్లో RUB (రైల్వే అండర్ బ్రిడ్జ్), కొత్త ROB (రైల్వే ఓవర్ బ్రిడ్జ్) నిర్మాణ ప్రణాళికను ప్రారంభించాయి.రూ.25 కోట్లతో RUB, రూ. 150 కోట్లతో కొత్త ROBని నిర్మించాలని ప్రతిపాదించారు. ఈ రెండూ కట్టాలంటే ఇప్పుడున్న ఓవర్ బ్రిడ్జీకి ఇరువైపులా 120 అడుగుల మేర విస్తీర్ణం కావాలి. అంతా సవ్యంగా సాగితే ఈ ఏడాది ఆఖరుకు ఈ వంతెనలకు శంకుస్థాపన జరుగుతుంది. ఇప్పటికే భూ సేకరణలో భాగంగా కొన్ని భవనాలను కూల్చి వేస్తున్నారు. ఈ కూల్చివేతల్లో ఆనాటి శంకర్ విలాస్ కూడా కనుమరుగయ్యే అవకాశం ఉంది. పాతదాన్ని చెరిపేస్తూ – కొత్తదాన్ని ఆహ్వానిస్తూ..ROB నిర్మాణానికి భూసేకరణ, ఆక్రమణల తొలగింపు, రోడ్ల మరమ్మత్తులు మొదలైన అంశాలపై GMC కమిషనర్ పర్యవేక్షణ చేపట్టారు. బ్రాడిపేట, అరండేల్‌పేట, డోంకా రోడ్డు వంటి ప్రాంతాల్లో అక్రమ నిర్మాణాలు, రాంపుల తొలగింపు వంటి చర్యలు తీసుకుంటున్నారు.

హోటల్ శంకర్ విలాస్ యజమానురాలు రంగనాయకమ్మ

శానిటేషన్, వ్యర్థాల నిర్వాహణ, కాలుష్యంపై కూడా చర్యలు చేపడుతున్నారు. వంతెన నిర్మాణ సమయంలో ఎదురయ్యే ట్రాఫిక్ సమస్యల్ని ముందే పసిగట్టి ప్రత్యామ్నాయ ఏర్పాట్లు జరుగుతున్నాయి.

కాలగమనంలో ఓ మలుపు…ఒక వంతెన కూల్చడం అంటే, అది కేవలం ఒక భౌతిక నిర్మాణం కాదు. అది కాల గమనంలో ఓ మలుపు. శంకర్ విలాస్ సెంటర్ ROB కూల్చివేత తో గుంటూరులో ఓ యుగానికి తెరపడినట్టే. కానీ అదే సమయంలో, అభివృద్ధికి కొత్త ద్వారాలు తెరుచుకునే శుభ సూచిక కూడా.అందుకే నగర పౌరులు కొందరు శంకర్ విలాస్ సెంటర్, శంకర్ విలాస్ బ్రిడ్జి పేర్లు రూపు మాయకుండా ఉత్తమ మార్గాన్ని కనిపెట్టేందుకు నడుంకట్టారు. బెటర్ శంకర్ విలాస్ బ్రిడ్జి సాధన సమితీ పేరిట ఓ సంయుక్త కార్యాచరణ కమిటీని ఏర్పాటు చేశారు. ఈ కమిటీ మున్సిపల్ అధికారుల ముందు కొన్ని ప్రతిపాదనలు చేసింది. శంకర్ విలాస్ బ్రిడ్జి పొడవు కుదించకుండా నిర్మించాలని, ముందుగా రైల్ అండర్ బ్రిడ్జి (ఆర్ యూబీ) నిర్మించి రాకపోకలకు అంతరాయం రాకుండా చూడాలని కోరింది. తమ ప్రతిపాదనల కోసం ఏప్రిల్ 10న గుంటూరులో మానవ హారాన్ని తలపెట్టినట్టు ఆర్టీఐ కార్యకర్త ఏ.సాయిబాబా తెలిపారు.