Sharad Pawar: మహారాష్ట్రలో సీనియర్‌ పవార్‌దే పైచేయి

Sharad Pawar: మహారాష్ట్ర రాజకీయాల్లో శరద్‌ పవార్‌ మరోసారి తన ప్రాధాన్యాన్ని చాటుకొన్నారు. పార్టీ చీలికతో ప్రతికూల పరిస్థితులు ఉన్నప్పటికీ.. తనదైన వ్యూహాలతో మెరుగైన ఫలితాలు సాధించారు.


ముంబయి: ఎన్సీపీ, శివసేన పార్టీల్లో చీలికల కారణంగా మహారాష్ట్ర రాజకీయాలు ఈసారి అందరి దృష్టిని ఆకర్షించాయి. ఈ లోక్‌సభ ఎన్నికలు ఎన్సీపీ నేత శరద్‌ పవార్ (Sharad Pawar) రాజకీయ భవితవ్యాన్ని తేల్చనున్నాయని రాజకీయ పండితులు విశ్లేషించారు. ఎట్టకేలకు కాలం పెట్టిన పరీక్షలో ఆయనే నెగ్గారు. అసలు వర్గం తనదేనని దాదాపు నిరూపించుకున్నారని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. 2019 నాటితో పోలిస్తే రాష్ట్రంలో ఎన్డీయే బలం సగానికి పైగా తగ్గిపోవడంలో ఆయన ప్రధాన భూమిక పోషించారు.

చీలికతో ఎన్సీపీ రాజకీయంగా బలహీనపడ్డప్పటికీ.. కాకలు తిరిగిన నేత శరద్‌ పవార్‌ (Sharad Pawar) తన అనుభవాన్ని రంగరించారు. ఆయన వర్గం ఎన్సీపీ (ఎస్పీ) పోటీ చేసిన 10 సీట్లలో ఎనిమిది స్థానాలను గెలుచుకోవడంలో కీలక పాత్ర పోషించారు. తద్వారా మహారాష్ట్ర రాజకీయాల్లో తన పట్టును నిలుపుకొన్నారు. 83 ఏళ్ల పవార్ అటు జాతీయస్థాయిలో ‘ఇండియా’, ఇటు రాష్ట్రంలో మహా వికాస్‌ అఘాడీ (MVA) కూటమిలో కీలక పాత్రధారిగా ఉన్న విషయం తెలిసిందే. రాజకీయాల్లో 50 ఏళ్లకు పైగా అనుభవం ఉన్న ఈ మాజీ కేంద్ర మంత్రి తన పార్టీ NCP (SP)ని గట్టెక్కించడంలో ఒంటరి పోరాటం చేశారు. కొత్త గుర్తుతో పోటీ చేయాల్సిన పరిస్థితుల్లో తనదైన వ్యూహాలతో అభ్యర్థులను ఆచితూచి ఎంపిక చేశారు. సొంత పార్టీ అభ్యర్థులతో పాటు రాష్ట్రవ్యాప్తంగా కూటమి గెలుపు కోసం శ్రమించారు.

మహారాష్ట్రలో 48 లోక్‌సభ స్థానాలుండగా.. ఎంవీయే పక్షాలతో కలిసి ఎన్సీపీ (ఎస్పీ) 10 స్థానాల్లో పోటీ చేసింది. ఎనిమిదింటిలో గెలుపొందింది. సతారా, రావర్‌లో ఎదురుదెబ్బ తగిలింది. సతారాలో బీజేపీకి గట్టి పోటీనిచ్చింది. తాజా ఫలితాలతో అసలైన ఎన్సీపీ తమదేనని శరద్‌ పవార్‌ నిరూపించుకున్నట్లు రాజకీయ విశ్లేషకుడు ప్రకాశ్‌ అకోల్కర్‌ అభిప్రాయపడ్డారు. అక్టోబర్‌లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న తరుణంలో కార్యకర్తల్లో ఈ ఫలితాలు ఉత్సాహం నింపాయి.

2019లో కాంగ్రెస్‌, ఎన్సీపీ, శివసేన కలిసి ఎంవీయే కూటమిగా ఏర్పడి అధికారంలోకి వచ్చాయి. 2022లో శివసేనలో తిరుగుబాటుతో పరిస్థితులు మారిపోయాయి. ఏక్‌నాథ్‌ శిందే వేరుకుంపటి పెట్టుకొని భాజపాతో కలిసి సీఎం కుర్చీ కైవసం చేసుకున్నారు. మరోవైపు గత ఏడాది అజిత్‌ పవార్‌ ఎన్సీపీని చీల్చి ప్రభుత్వంలో భాగస్వామ్య పక్షంగా చేరారు. మాజీ కేంద్రమంత్రి ప్రఫుల్‌ పటేల్‌ సైతం శరద్‌ పవార్‌ను కాదని చీలిక వర్గంలో చేరడం అప్పట్లో అందరినీ ఆశ్చర్యంలో ముంచెత్తింది. దాదాపు 40మంది ఎమ్మెల్యేలు, కొందరు ఎమ్మెల్సీలు అజిత్‌ క్యాంపులో చేరి పెద్ద దెబ్బే కొట్టారు. పైగా అసలైన పార్టీ తమదేనంటూ కోర్టు మెట్లెక్కారు. ఈక్రమంలో అజిత్‌, ఆయన వర్గం ఎన్ని విమర్శలు చేసినా శరద్‌ పవార్‌ మాత్రం పెద్దగా స్పందించలేదు. స్వయంగా చెల్లి వరుసైన శరద్‌ పవార్‌ కూతురు సుప్రియా సూలేపై, అజిత్‌ పవార్‌ ఆయన సతీమణి సునేత్రాను బారామతిలో బరిలోకి దింపారు.

ప్రభుత్వంలో భాగస్వామ్య పక్షంగా ఉన్నప్పటికీ.. అజిత్‌ పవార్‌ వర్గం కేవలం ఐదు స్థానాల్లో మాత్రమే పోటీ చేసి ఒక్క సీటులో గెలుపొందింది. అజిత్‌ సతీమణి సునేత్ర సైతం ఓడిపోవడం గమనార్హం. మొత్తానికి మహారాష్ట్రలో ఎన్డీయే అంచనాలు తలకిందులయ్యాయి. మొత్తం 48 స్థానాలకుగాను 2019 నాటితో పోలిస్తే రాష్ట్రంలో ఆ కూటమి బలం సగానికి పైగా తగ్గిపోయింది. ఎంవీయే పోటీచేసిన కాంగ్రెస్, శివసేన (ఉద్ధవ్‌), ఎన్సీపీ (శరద్‌ పవార్‌) 30 స్థానాల్లో విజయం సాధించాయి. ఎన్డీయే కూటమి 17 స్థానాల్లో గెలుపొందింది.