వ్యక్తిగతంగా మాట్లాడితే జగన్‌ అడుగు కూడా బయటపెట్టలేరు: షర్మిల

www.mannamweb.com


వైకాపా ప్రభుత్వంలో అక్రమాలు, హత్యలు, కల్తీ మద్యంపై ప్రశ్నించడం వ్యక్తిగత విషయమా?మండిపడ్డ ఏపీసీసీ అధ్యక్షురాలు

ఈనాడు, అమరావతి: తాను వ్యక్తిగతంగా మాట్లాడితే జగన్‌ ఇంట్లో నుంచి అడుగు కూడా బయటపెట్టలేరని కాంగ్రెస్‌ రాష్ట్ర అధ్యక్షురాలు షర్మిల ధ్వజమెత్తారు.

నాతో వారికి వ్యక్తిగత విభేదాలు (పర్సనల్‌ ఇష్యూస్‌) ఉన్నాయనేది వారి భావన మాత్రమేనని.. అందుకే తాను మాట్లాడేది కూడా వ్యక్తిగత అంశంగా అనుకుంటున్నారని ఆమె పేర్కొన్నారు. విజయవాడలోని ఆంధ్రరత్న భవన్‌లో షర్మిల బుధవారం విలేకర్లతో మాట్లాడారు. ‘పచ్చ కామెర్ల రోగికి లోకమంతా పచ్చగా ఉంటుందన్నట్లు ఉంది మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ తీరు. అందుకే నేను మాట్లాడేది వ్యక్తిగతం అనుకుంటున్నారు. వైకాపా పాలనలో ఐదేళ్లూ రాష్ట్రం మొత్తాన్ని దోచేశారు. రుషికొండలో కొండ లేకుండా చేశారు. మీ నిర్లక్ష్యం, అవినీతి గురించి, మద్య నిషేధ]మని చెప్పి కల్తీ మద్యం అమ్మడం గురించి మాట్లాడితే అది నా వ్యక్తిగతమా? రూ.1,750 కోట్ల లంచాలు, వివేకా హత్య, గంగవరం పోర్టులో ప్రభుత్వ వాటా అదానీకి కారుచౌకగా విక్రయించడం, సోషల్‌ మీడియాలో సైతాన్‌ సైన్యం అరాచకాలపై మాట్లాడితే పర్సనల్‌ ఎలా అవుతాయో వైకాపా నేతలే చెప్పాలి. సెకి ఒప్పందాలపై మేం వితండవాదం చేయాల్సిన అవసరం లేదు. మీరు తప్పు చేశారు కనుకే భయపడుతున్నారు’ అని మండిపడ్డారు.

సెకి ఒప్పందాలపై ఎందుకు చర్యలు తీసుకోవట్లేదు?

‘సెకి ఒప్పందంలో జగన్‌ అవినీతిపై అన్ని ఆధారాలూ దగ్గర పెట్టుకుని కూటమి ప్రభుత్వం ఎందుకు మౌనంగా ఉంటోంది? జగన్‌ ప్రభుత్వంలో కాకినాడ పోర్టునే కాదు.. కృష్ణపట్నం పోర్టునూ బలవంతంగా రాయించుకున్నారు. గంగవరం పోర్టును పూర్తిగా అమ్మేశారు. వీటిపై సమగ్ర విచారణ జరిపించి చర్యలు తీసుకోవాలి. సెకితో ఒప్పందాలపై లోతుగా పరిశీలన చేయాలని కేంద్ర విద్యుత్తు నియంత్రణ సంస్థకు లేఖ రాస్తున్నాం. సెకి ఒప్పందంపై కేసు నమోదు చేసి, విచారణ చేపట్టాలని ఏసీబీ అధికారులకు గురువారం ఫిర్యాదు చేస్తాం’ అని షర్మిల వెల్లడించారు. రాష్ట్రంలో కాంగ్రెస్‌ సీనియర్‌ నేతలు నిరుత్సాహంతో ఉన్నారన్న ప్రచారంలో నిజం లేదన్నారు. మాజీ ఎమ్మెల్యే మస్తాన్‌ వలి, కాంగ్రెస్‌ రాష్ట్ర ఉపాధ్యక్షుడు కె.శివాజీ, విజయవాడ నగర అధ్యక్షుడు నరహరశెట్టి నరసింహారావు పాల్గొన్నారు.

జగన్‌ అతి తెలివితేటలు ప్రదర్శిస్తున్నారు

‘జగన్‌ రూ.1,750 కోట్ల లంచాలు తీసుకున్నారని అమెరికా కోర్టులో కేసు నమోదైంది. ఇంత జరిగినా కూటమి ప్రభుత్వం ఎందుకు చర్యలు తీసుకోవట్లేదు? కేసులో నా పేరు లేదని జగన్‌ అతి తెలివిగా మాట్లాడుతున్నారు. నా పేరు ఎవరైనా చెప్పారా అంటున్నారు. అప్పుడు చీఫ్‌ మినిస్టర్‌ అంటే జగన్‌ కాదా? ఆయనది అతితెలివా? వెర్రితనమా? ఇలాగే మాట్లాడితే ఇలాంటి వెర్రివాడా ఐదేళ్లు రాష్ట్రాన్ని పాలించింది.. అని ప్రజలు అనుకునే ప్రమాదం ఉంది. సౌరవిద్యుత్తు ఛార్జీలు క్రమంగా తగ్గుతుంటే 25 ఏళ్లకు జగన్‌ ప్రభుత్వం ఎందుకు ఒప్పందం చేసుకుంది? చంద్రబాబు చేసిన విద్యుత్తు కొనుగోలు ఒప్పందాలను జగన్‌ అధికారంలోకి వచ్చాక రద్దు చేశారు. దీర్ఘకాలిక ఒప్పందాలు ఉండకూడదని చెప్పిన జగన్‌.. మరి 25 ఏళ్లకు సెకితో ఒప్పందం చేసుకోవడంలో ఉద్దేశమేంటి?’ అని షర్మిల ప్రశ్నించారు.