రుషికొండ ప్యాలెస్‌పై షర్మిల మాట, సిట్టింగ్ జడ్జితో విచారణకు డిమాండ్

www.mannamweb.com


YS Sharmila demand Rushikonda palace: రుషికొండ ప్యాలెస్‌పై షర్మిల మాట, సిట్టింగ్ జడ్జితో విచారణకు డిమాండ్

YS Sharmila demand Rushikonda palace: ఆంధ్రప్రదేశ్‌లో హాట్ టాపిక్‌గా మారింది రుషికొండ భవనాల అంశం. వందల కోట్లు రూపాయలు దుర్వినియోగంపై ఇంటా బయటా విమర్శలు తీవ్రమయ్యా యి. అంతేకాదు నేషనల్ మీడియాలో హెడ్‌లైన్ వార్త అయ్యింది. దీన్ని కప్పి పుచ్చుకునేందుకు వైసీపీ నేతలు చేసిన ప్రయత్నాలు విఫలమయ్యాయి. అడ్డంగా మీడియా ముందు దొరికిపోతున్నారు.

తాజాగా ఈ అంశంపై ఏపీ కాంగ్రెస్ చీఫ్ వైఎస్ షర్మిల రియాక్ట్ అయ్యారు. దీనిపై నేషనల్ న్యూస్ ఏజెన్సీతో మాట్లాడిన ఆమె, ఈ వ్యవహారంపై నిజాలు నిగ్గు తేల్చాలంటే కచ్చితంగా సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. అసలే అప్పుల ఊబిలో రాష్ట్రం ఉందని, ఈ సమయంలో ప్రజల సొమ్ము తో ఖరీదైన భవనాలు అవసరమా అంటూ ప్రశ్నించారు. విచారణ చేయిస్తేనే అసలు నిజాలు వెలుగులోకి వస్తాయన్నారు. దీనికి బాధ్యులైన వారిపై చర్యలు తీసుకోవడానికి వీలవుతుందన్నారు.

రుషికొండపై గతంలో టూరిజానికి సంబంధించి కాటేజీలు ఉండేవి. వాటి నుంచి ఏడాదికి దాదాపు 25 కోట్ల వరకు ఆదాయం వచ్చేది. అయితే అధికారంలోకి వచ్చిన వైసీపీ సర్కార్, హఠాత్తుగా వాటిని కూల్చేసి, స్టార్ హోటల్ కడుతున్నామని ప్రకటించింది. అయితే నిర్మాణాలు చూస్తుంటే స్టార్ హోటల్ కాకుండా గెస్ట్ హౌస్‌లా కనిపించడంతో రాజకీయ పార్టీ నేతలు, మీడియా గగ్గోలు పెట్టింది. పరిస్థితి గమనించి జగన్ సర్కార్, ఈ ప్రాంతానికి ఎవరినీ రాకుండా పోలీసులను మోహరించింది.

మొన్నటి ఎన్నికల్లో ఏపీలో ప్రభుత్వం మారింది. ఆ ప్రాంతం భీమిలి నియోజకవర్గం పరిధిలోకి రావడంతో ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు రుషికొండ భవనాలను పరిశీలించారు. అంతేకాదు తనతోపాటు మీడియా ప్రతినిధులను వెంట బెట్టుకుని వెళ్లారు. దీంతో రుషికొండ భవనాలకు గురించి అసలు విషయం వెలుగులోకి వచ్చింది.

ఈ వ్యవహారంపై జాతీయ ఛానెళ్లు చీల్చిచెండాడుతున్నాయి. చర్చా వేదికలో వైసీపీ నేతలను ఫుట్‌బాల్ ఆడుకున్నారు. ఇది ముమ్మాటికీ ప్రజాధనం దుర్వినియోగం చేయడమేనని వ్యాఖ్యానించాయి. ప్రముఖుల కోసమే కట్టామని వైసీపీ నేతలు చెబుతున్నారు. అంబానీ, అదానీ, బిర్లాల కోసం కట్టారా అంటూ ప్రశ్నల మీద ప్రశ్నలు సంధించాయి. విశాఖలో ప్రముఖులు బస చేయడానికి కనీసం హోటళ్లు లేవా అంటూ ప్రశ్నలను రైజ్ చేశారు.

ఇదే సమయంలో వైసీపీ నేతలు, మద్దతుదారులు కొత్త అంశాలను తెరపైకి తెచ్చారు. అంతేకాదు టీవీ డిబేట్లలో అడ్డగోలుగా అబద్దాలు చెప్పడం మొదలుపెట్టారు. ప్రజావేదిక నిర్మాణానికి 900 కోట్ల రూపాయల ను ఖర్చు చేశారంటూ వ్యాఖ్యానించడం మొదలుపెట్టారు. రాష్ట్రం విభజన తర్వాత ఏపీకి హైదరాబాద్ లేకుండా పోయిందని, విలాసవంతమైన భవనాలు అక్కడే ఉండిపోయాయని అంటున్నారు. అందుకే రుషికొండపై జగన్ సర్కార్, విలాసవంతమైన భవనాలను కట్టించిందని, ఇది ముమ్మాటికీ రాష్ట్రప్రజలకు గర్వకారణమని వైసీపీ నేతల సమర్థించుకునే పని చేశారు.

ఇక సోషల్‌ మీడియాలో నెటిజన్స్ ఓ రేంజ్‌లో వైసీపీని ఆటాడుకుంటున్నారు. పార్లమెంటు కొత్త భవనానికి 970 కోట్ల రూపాయలను ఖర్చు చేశారని, రుషికొండ ప్యాలెస్‌కు 500 కోట్లు వెచ్చిండమేంటని నిలదీస్తున్నా రు. నిద్ర లేవగానే సముద్రాన్ని చూడడం కోసం నిర్మాణం చేసిందని దుయ్యబడుతున్నారు.