– పలుమార్లు జ్యూస్‌లలో విషం కలిపి హత్యాయత్నం
– చివరకు ఆయుర్వేదిక్ డ్రింక్‌లో పాయిజన్ కలిపిన ప్రేయసి
– మూడేళ్ల క్రితం సంఘటన
– దోషిగా తేల్చిన కేరళ కోర్టు
ఆమె కాలేజీలో సీనియర్.. ఒక జూనియర్‌తో ప్రేమలో పడింది. ఆ తర్వాత ఆమెకు ఆర్మీ అధికారితో ఎంగేజ్‌మెంట్ జరిగింది. అయినా తన జూనియర్‌తో ప్రేమాయణం కొనసాగించింది. పెళ్లి దగ్గర పడుతుండటంతో ప్రియుడిని వదిలించుకోవడానికి పలు మార్లు హత్య కోసం విఫలయత్నాలు చేసింది. చివరకు ఆయుర్వేదిక్ డ్రింక్ అని చెప్పి.. విషం కలిపి ఇచ్చి.. చంపేసింది. 2022లో ఈ హత్య జరగగా.. శుక్రవారం కేరళలోని తిరువునంతపురం జిల్లా కోర్టు ఆమెను దోషిగా తేల్చింది. శనివారం ఆమెకు కోర్టు శిక్ష ఖరారు చేయనుంది. పూర్తి వివరాల్లోకి వెళితే.. కన్యాకుమారికి చెందిన గ్రీష్మ, తిరువునంతపురంకు చెందిన షారోజ్‌రాజ్‌లు 2021 నుంచి స్నేహితులుగా ఉండేవారు. ఆమె ఇంగ్లీష్‌లో పీజీ చేస్తుండగా, షారోన్ డిగ్రీ ఫైనల్ ఇయర్ చదువుతున్నాడు. వీరిద్దరి మధ్య సాన్నిహిత్యం కాస్తా ప్రేమగా మారింది.
2022 మార్చిలో గ్రీష్మ తండ్రి ఆమెకు ఒక ఆర్మీ ఆఫీసర్‌తో వివాహం నిశ్చయం చేశాడు. గ్రీష్మ కూడా ఆ పెళ్లికి ఒప్పుకుంది. ఆ తర్వాత కూడా షారోన్ రాజ్‌తో రిలేషన్ కంటిన్యూ చేసింది. పెళ్లి రోజు సమీపిస్తుండటంతో షారోన్‌ను వదిలించుకోవాలని నిర్ణయించుకుంది. అతడిని ఎలా చంపాలనే విషయంలో ఆన్‌లైన్‌లో అనేక మార్గాలను సెర్చ్ చేసింది. పెయిన్ కిల్లర్స్ ఇచ్చి రెండు సార్లు చంపడానికి ప్రయత్నించి విఫలం అయ్యింది. ఒక సారి నిద్ర మాత్రలను నీళ్లలో కలిపి అతడికి ఇచ్చింది. మరోసారి జ్యూస్‌లో కలిపి హత్యాప్రయత్నం చేసింది. షారోన్ తక్కువ జ్యూస్ తాగడం వల్ల చనిపోవడం లేదని భావించి.. ఒక సారి జ్యూస్ డ్రింకింగ్ కాంపిటీషన్ కూడా పెట్టి.. అతనితో భారీ మొత్తంలో జ్యూస్ తాగించింది. కానీ షారోన్‌కు ఏమీ కాలేదు.
మామూలు పద్దతుల్లో మరణం సంభవించడం లేదని భావించి.. వేరే ప్లాన్‌ను అమలు చేసింది. 2022 అక్టోబర్ 14న షారోన్ రాజును తన ఇంటికి ఆహ్వానించింది. ఆయుర్వేదిక్ మెడిసినల్ డ్రింక్ అని చెప్పి.. అందులో గడ్డి మందును కలిపి ఇచ్చింది. అది చేదుగా ఉన్నా.. ఆయుర్వేదిక్ మెడిసిన్ టేస్ట్ అలాగే ఉంటుందని చెప్పి అతను తాగేశారు. ఆ తర్వాత గ్రీష్మ ఇంటి నుంచి వెళ్లిపోయాక వాంతులు మొదలయ్యాయి. వెంటనే అతడిని ఆసుపత్రికి తరలించగా.. అక్టోబర్ 25న మల్టిపుల్ ఆర్గాన్ ఫెయిల్యూర్‌తో మరణించాడు. అయితే ఆసుపత్రిలో ఉన్నప్పుడు గ్రీష్మ తనకు డ్రింక్ ఇచ్చిన విషయం ఒక స్నేహితుడికి షారోన్ చెప్పాడు. దాని ఆధారంగా పోలీసులు కేసు నమోదు చేసి గ్రీష్మను అరెస్టు చేశారు.
గ్రీష్మతో పాటు ఆమెను ప్రోత్సహించారనే ఆరోపణలతో ఆమె తల్లి సింధు, మేనమామ నిర్మలాకుమారన్ నాయర్‌పై కూడా పోలీసులు కేసు నమోదు చేశారు. అయితే కోర్టు విచారణలో సింధు నిర్దోషిగా తేలగా.. మేనమామకు మాత్రం నేరంతో సంబంధం ఉన్నట్లు తేలింది. కాగా, తాము ఏకాంతంగా ఉన్న సమయంలో తీసుకున్న వీడియోలు, ఫొటోలు తన కాబోయే భర్తకు షేర్ చేస్తాడేమో అనే అనుమానంతోనే హత్యకు పాల్పడినట్లు గ్రీష్మ కోర్టులో ఒప్పుకుంది.