పరిపాలనా కేంద్రంగా సాగుతున్న విజయవాడను మావోయిస్టులు షెల్టర్‌జోన్‌గా చేసుకోవడం..పెద్దసంఖ్యలో ఇక్కడి పరిసర ప్రాంతాల్లో తలదాచుకోవడం కలకలం సృష్టించింది. ఎవరి దృష్టీ ఉండదని ఆటోనగర్‌లో 27 మంది ఒకే భవనంలో ఆయుధాలతో ఉన్నారు. విజయవాడలోని ఆటోనగర్, కానూరులోని కొత్త ఆటోనగర్‌లు అసాంఘిక శక్తులకు అడ్డాగా మారాయి. ఇక్కడ కర్మాగారాల్లో ఉత్తరాది నుంచి వేలమంది కార్మికులు వచ్చి పనిచేస్తుంటారు. ఈ ప్రాంతంపై పోలీసుల నిఘా లేకపోవడం, గస్తీ లోపించడం అరాచక శక్తులకు మరింత ఊతమిస్తోంది.
నిఘా శూన్యం…
విజయవాడ ఆటోనగర్ విస్తరణలో భాగంగా 32 ఎకరాలలో కానూరులో కొత్త ఆటోనగర్ ఏర్పాటైంది. ఇందులో 150 పరిశ్రమలతోపాటు 350 వరకు సర్వీస్ యూనిట్లు వచ్చాయి. వీటిల్లో పనిచేసేందుకు బిహార్, ఛత్తీస్‌గఢ్, ఒడిశా, యూపీల నుంచి కార్మికులు పెద్దసంఖ్యలో వస్తుంటారు. రాత్రయిందంటే ఇక్కడ గంజాయి, బ్లేడ్ బ్యాచ్‌లు హల్‌చల్ చేస్తుంటాయి. అయితే రాత్రిళ్లు పోలీసుల గస్తీ నామమాత్రమే.
ఎస్‌ఐబీకి సమీపంలోనే…
మావోయిస్టుల కార్యకలాపాలపై నిరంతరం నిఘా ఉంచే ఎస్‌ఐబీ (స్పెషల్ ఇంటెలిజెన్స్ బ్యూరో) కార్యాలయానికి సమీపంలోనే మావోయిస్టులు షెల్టర్ పొందిన భవనం ఉంది. ఎస్‌ఐబీకి చెందిన సిబ్బంది నిత్యం మావోయిస్టుల కదలికలపై సమాచారం సేకరిస్తుంటారు. వారి సానుభూతిపరులపై కూడా నిత్యం నిఘా పెడుతుంటారు. ఈ కార్యాలయానికి 3.5 కి.మీ. దూరంలోనే మావోయిస్టులు షెల్టర్ తీసుకోవడం చర్చనీయాంశమైంది. ఇదేమార్గంలో మంత్రి పార్థసారథి క్యాంపు కార్యాలయం కూడా ఉంది. సమీపంలోనే భాజపా ఎమ్మెల్యే సుజనాచౌదరి నివాసం ఉంది. మచిలీపట్నంలోని ఎస్పీ బంగ్లాలో మరమ్మతులు జరుగుతుండటంతో. ఈ ప్రాంతానికి 500 మీటర్ల దూరంలోని ఓ గేటెడ్ కమ్యూనిటీలో ఎస్పీ విద్యాసాగర్‌నాయుడు తన బంధువుల ఇంట్లో తాత్కాలికంగా ఉంటున్నారు.
































