రిలీజ్ కు ముందు దేవరకు షాక్, టికెట్ల ధరల పెంపుపై హైకోర్టు కీలక ఆదేశాలు

www.mannamweb.com


రిలీజ్ కు ముందు దేవర టీమ్ కు ఏపీ హైకోర్టు షాక్ ఇచ్చింది. టికెట్ ధరలు పెంచుకునేందుకు ఏపీ ప్రభుత్వం ఇచ్చిన జీవోపై కీలక తీర్పు ఇచ్చింది. రెండు వారాల ధరల పెంపును 10 రోజులకు పరిమితం చేస్తూ తీర్పు ఇచ్చింది.

రిలీజ్ కు ముందు జూ.ఎన్టీఆర్ దేవరకు షాక్ తగిలింది. పాన్ ఇండియా మూవీ దేవర చిత్రం ఈ నెల 27న విడుదల కానుంది. అయితే ఈ సినిమా టికెట్ల ధరలు పెంచుకునేందుకు తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలు అనుమతి ఇచ్చాయి. ఏపీ ప్రభుత్వం దేవర టికెట్ రేట్లకు సింగిల్ స్క్రీన్స్‌లో రూ.110, మ‌ల్టీప్లెక్స్‌లో రూ.135 వ‌ర‌కు పెంచుకునే వెసులుబాటును క‌ల్పించింది. 14 రోజుల వరకు టికెట్ల ధరలు పెంచుకునేందుకు అవకాశం ఇచ్చింది. అయితే దేవర సినిమా టికెట్ రేట్లను పెంచడాన్ని వ్యతిరేకిస్తూ హైకోర్టులో పిటిషన్ దాఖలైంది. సినిమా టికెట్ రేట్లను పెంచుతూ రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన జీవోను వెనక్కి తీసుకునేలా ఆదేశించాలని పిటీషనర్లు కోర్టును కోరారు. ఏ ప్రాతిపదికన టికెట్ల పెంపునకు అవకాశం కల్పించారో చెప్పాలని డిమాండ్ చేశారు.

దేవర టికెట్ల వ్యవహారంపై దాఖలైన పిటిషన్లపై ఏపీ హైకోర్టులో ఇవాళ విచారణ చేపట్టింది. సినిమా టికెట్ల ధ‌ర‌ల పెంపుపై హైకోర్టు కీల‌క తీర్పు ఇచ్చింది. టికెట్ల రేట్ల పెంపు 14 రోజుల వ‌ర‌కు ఉన్న పరిమితిని 10 రోజులకే పరిమితం చేస్తూ హైకోర్టు ఆదేశాలిచ్చింది. టికెట్ ధరల పెంపును సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్ పై విచారించిన కోర్టు పిటీషనర్ వాదనతో ఏకీభవించింది.

భారీ బడ్జెట్ తో తెరకెక్కిన సినిమాలకు విడుదల సమయంలో టికెట్ల ధరలు పెంచుకునేందుకు తెలుగు రాష్ట్ర ప్రభుత్వాలు అనుమతి ఇస్తున్నాయి. ఈ నేపథ్యంలో దేవర మూవీ టీమ్ ఏపీ ప్రభుత్వాన్ని టికెట్ల ధరలు పెంచాలని కోరింది. ఇందుకు ఏపీ సర్కార్ అనుమ‌తినిస్తూ జీవో జారీ చేసింది. మల్టీప్లెక్స్‌ థియేటర్లలో టికెట్‍పై అదనంగా రూ.135 పెంచుకునేందుకు, సింగిల్ స్క్రీన్‍లలో బాల్కనీ టికెట్‍పై రూ.110, క్లాస్‍ టికెట్‍పై రూ.60 అదనంగా వసూలు చేసేందుకు అనుమతి ఇచ్చింది. రెండు వారాల వరకు టికెట్లపై అదనపు ధరలు అమల్లో ఉంటాయని పేర్కొంది. అయితే ఈ జీవోను స‌వాల్ చేస్తూ హైకోర్టులో పిటిష‌న్ దాఖలు కాగా టికెట్ ధరల పెంపును 10 రోజులకు పరిమితం చేస్తూ తీర్పు ఇచ్చింది.

తెలంగాణలోనూ ధరలు పెంపు

దేవర మూవీ టికెట్ల ధరలను పెంచడానికి రెండు తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలు అనుమతిచ్చిన విషయం తెలిసిందే. తెలంగాణలోని మల్టీప్లెక్స్ లలో అయితే గరిష్ఠంగా ఈ ధరలు రూ.413 వరకూ ఉన్నాయి. ఏఎంబీ సినిమాస్ లోనూ రూ.400 నుంచి రూ.500 మధ్య టికెట్ల ధరలను చూపిస్తోంది. ఈ టికెట్లు కూడా ఎగబడి కొనేస్తున్నారు. తొలి రోజు మాత్రమే ఈ ధరలు ఉంటాయి. ఇక సింగిల్ స్క్రీన్లలో అయితే గరిష్ఠంగా రూ.297 వరకూ ఉండటానికి అనుమతి ఇచ్చారు. అంతేకాకుండా అర్ధరాత్రి ఒంటి గంటకే షోలు ఏర్పాటు చేయనున్నారు. తెలంగాణలో మొత్తంగా 29 థియేటర్లు ఈ అర్ధరాత్రి షోలు వేయనున్నాయి. ఇక రోజుకు ఆరు షోలు వేసుకునేందుకు కూడా ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఇవన్నీ చూస్తుంటే తొలి రోజే దేవర మూవీ బాక్సాఫీస్ రికార్డులను తిరగరాయడం ఖాయంగా కనిపిస్తోంది.

జూనియర్ ఎన్టీఆర్ నటించిన దేవర మూవీ టికెట్ల అమ్మకాలు తెలుగు రాష్ట్రాల్లో విడుదలయ్యాయి. ఈ టికెట్లు హాట్ కేకుల్లా అమ్ముడైపోతున్నాయి. ట్రైలర్ రిలీజ్ కు ముందే నార్త్ అమెరికాలో అన్ని రికార్డులు తిరగరాసిన ఈ మూవీ.. ఇప్పుడు ఇక్కడ కూడా అదే చేస్తోంది. హైదరాబాద్ లోని ఏఎంబీ సినిమాస్ లో రెండే నిమిషాల్లో టికెట్లన్నీ అమ్ముడైపోవడం గమనార్హం.