పాకిస్తాన్ ఈరోజు అంటే ఆగస్టు 14న 79వ స్వాతంత్ర్య దినోత్సవాన్ని జరుపుకుంటోంది. ఈ ప్రత్యేక సందర్భంగా కరాచీ నగరంలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. పాక్ లో కాల్పులు కలకలం రేపాయి.
వేడుకల సందర్భంగా జరిగిన కాల్పుల్లో ముగ్గురు మరణించారు. మృతుల్లో 8 ఏళ్ల బాలిక, ఒక వృద్ధుడు ఉన్నారు. స్థానిక మీడియా ప్రకారం, అజీజాబాద్‌లో వీధిలో నడుచుకుంటూ వెళుతుండగా ఓ బాలిక కాల్పులకు గురైంది. కోరంగిలో స్టీఫెన్ అనే వ్యక్తి కాల్పుల్లో మరణించాడు.
స్థానిక పోలీసుల ప్రకారం, కరాచీలోని అనేక ప్రాంతాల్లో కాల్పుల సంఘటనలు నమోదయ్యాయి. వీటిలో లియాఖతాబాద్, కోరంగి, లియారి, మహమూదాబాద్, అక్తర్ కాలనీ, కెమారి, జాక్సన్, బాల్డియా, ఓరంగి టౌన్, పపోష్ నగర్ వంటి ప్రాంతాలు ఉన్నాయి. షరీఫాబాద్, నార్త్ నజీమాబాద్, సుర్జాని టౌన్, జమాన్ టౌన్, లాంధి వంటి ప్రాంతాలు కూడా దీని ప్రభావానికి గురయ్యాయి.
ఈ కాల్పుల్లో గాయపడిన వారిని సివిల్, జిన్నా, అబ్బాసి షహీద్ ఆసుపత్రులతో పాటు ప్రైవేట్ ఆసుపత్రులకు తరలించారు. పోలీసులు 20 మందికి పైగా అనుమానితులను అరెస్టు చేశారు. వారి నుంచి ఆధునిక ఆయుధాలు, బుల్లెట్లను స్వాధీనం చేసుకున్నారు. తమ ఆపరేషన్ కొనసాగుతోందని, కాల్పులకు తెగబడిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులు తెలిపారు. పాకిస్తాన్‌లో ప్రతి సంవత్సరం స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల సందర్భంగా కాల్పుల సంఘటనలు చోటుచేసుకుంటున్నాయి. 2024లో కూడా ఇలాంటి సంఘటన జరిగింది. ఇందులో ఒక చిన్నారి మరణించగా, 95 మందికి పైగా గాయపడ్డారు.

































