ప్రభుత్వ నిబంధనలు ఉల్లంఘిస్తే ప్రైవేట్ విద్యా సంస్థల అనుమతులు రద్దు చేస్తామని నకిరేకల్ ఎంఈఓ మేక నాగయ్య బుధవారం దిశతో తెలిపారు.గతంలో దిశ దినపత్రికలో ప్రైవేట్ దోపిడి షూరు అనే స్టోరీని ప్రచురితమైంది.
దీనికి స్పందించిన అధికారులు, విద్యార్థి సంఘాల నాయకులు, నకిరేకల్ పట్టణంలో మంగళవారం బుధవారం ప్రైవేట్ స్కూళ్లపై దాడులు నిర్వహించారు. దీంతో అనేక విషయాలు వెలుగులోకి వచ్చాయి. నారాయణ స్కూల్లో ఆవరణలో ఏకంగా మూడు గదులలో పాఠ్యపుస్తకాలు, స్టేషనరీ, విక్రయిస్తున్నట్లు అధికారులు గుర్తించారు. వెంటనే అధికారులు ఆ మూడు గదులను వెంటనే సీజ్ చేశారు.
ఇక.. శ్రీ చైతన్య స్కూల్ బయట పాఠ్యపుస్తకాలు అమ్ముతుండగా విద్యార్థి సంఘాలు పట్టుకున్నాయి. ఆ స్కూల్ పై క్రిమినల్ కేసు నమోదు చేసినట్లు ఎంఈఓ నాగయ్య తెలిపారు. ఈ సందర్భంగా ఎంఈఓ నాగయ్య మాట్లాడుతూ నారాయణ, శ్రీ చైతన్యలతో పాటు మరికొన్ని విద్యాసంస్థలు విచ్చలవిడిగా వారి ఇష్టానుసారంగా ఫీజులు దోపిడీ చేస్తున్నారని పేర్కొన్నారు. ప్రైవేట్ విద్యాసంస్థల్లో గవర్నింగ్ బాడీ నిర్ణయించిన ఫీజులను తరగతుల వారిగా వివరాలను నోటీస్ బోర్డులో ప్రదర్శించాలని ఆయన పేర్కొన్నారు. ప్రైవేట్ విద్యాసంస్థల్లో పాఠ్యపుస్తకాలు నోట్ బుక్స్ స్టేషనరీ అమ్మటానికి అనుమతులు లేవని ఆయన తెలిపారు.
విద్యార్థుల తల్లిదండ్రులను ఒత్తిడి చేసి కొనుగోలు చేయాలని చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని ఆయన తెలిపారు. కొనుగోలు చేసిన తల్లిదండ్రులు తప్పకుండా రసీదు పొందాలని ఆయన తెలిపారు. కానీ కొన్ని విద్యాసంస్థలు విచ్చలవిడిగా పాఠ్యపుస్తకాలు స్టేషనరీ స్కూల్ యూనిఫామ్ అమ్ముకుంటూ ఆధారాలు లేకుండా చేస్తున్నాయని ఆయన విమర్శించారు. ప్రతి పాఠశాలలో ప్రభుత్వ నిబంధనల ప్రకారం నడిపించాలని ఆయన తెలిపారు. లేనిచో కఠిన చర్యలు తీసుకుంటామని ఆయన హెచ్చరించారు.
































