నెగిటివ్ ఆలోచనలతో ఇబ్బంది పడుతున్నారా.. ఉపశమనం కోసం ఈ సింపుల్ టిప్స్ మీ కోసం.

www.mannamweb.com


ఆలోచించడం లేదా ఆత్మపరిశీలన చేసుకోవడం కూడా చాలా ముఖ్యం. ఎవరైనా సరే ఒక అంశం గురించి క్షుణ్ణంగా ఆలోచించకపోతే, దానిని ప్రణాళికగా మర్చుకోలేరు. సరైన దిశలో పని చేయలేరు.

మనస్సులో సానుకూలతను పెంచే ఆలోచనలు లేదా అనుభవాలపై ఆలోచనలు ఉంటే మానసిక ఆరోగ్యానికి మంచిదే.. అయినప్పటికీ ఎవకైనా చెడు అనుభవాలు ఎదురైతే అప్పుడు ప్రతికూల ఆలోచనలు వస్తాయి. వీటి నుండి బయటపడటం చాలా ముఖ్యం. లేకుంటే మానసిక ఆరోగ్యంపై చాలా చెడు ప్రభావం చూపుతుంది. అంతేకాదు శారీరక ఆరోగ్యం కూడా చెడిపోతుంది.

ఎవరికైనా మనసులో అప్పుడప్పుడు నెగెటివ్ ఆలోచనలు రావడం సహజమే.. అయితే ఇలా తరచుగా జరిగితే శ్రద్ధ అవసరం. లేకుంటే చాలా ఒత్తిడి పెరుగుతుంది. ఇతర సమస్యలు తలెత్తుతాయి. మనస్సులో చెడు విషయాల గురించి నిరంతరం ఆలోచించడం వ్యక్తిగత జీవితంపైనే కాదు వృత్తి జీవితాన్ని ప్రభావితం చేస్తుంది. కనుక ప్రతికూల ఆలోచనలను ఎలా వదిలించుకోవాలో ఈ రోజు తెలుసుకుందాం..

పనికి విరామం ఇవ్వండి

ఏదైనా చెడు సంఘటన నుండి కోలుకుని, దీని కారణంగా పదే పదే ప్రతికూలంగా ఆలోచించడం ప్రారంభిస్తే.. వెంటనే విరామం తీసుకోవాలి. పని నుంచి మాత్రమే కాదు వ్యక్తిగత జీవితంలోని సమస్యల నుంచి మిమ్మల్ని మీరు కొంచెం దూరం గా ఉండేలా ప్లాన్ చేసుకోండి. మనసుకు నచ్చే విధంగా కొంత సమయం గడపండి. దీని కోసం మీరు మిమ్మల్ని ఉత్సాహ పరిచేందుకు ఎక్కడికైనా విహారానికి వెళ్ళవచ్చు. లేదా ఏదైనా ఆధ్యాత్మిక ప్రదేశంలో ఒంటరిగా గడిపేలా ప్లాన్ చేసుకోవచ్చు.

ప్రతికూల ఆలోచనలు వస్తే ఏం చేయాలి?

ఏదైనా ప్రతికూల ఆలోచన మీ మనస్సులో పదే పదే వస్తుంటే ప్రశాంతంగా కూర్చుని దీర్ఘ శ్వాస తీసుకోండి. రెండు గుక్కల నీరు త్రాగండి. ఈ సమయంలో కొంత సమయం పాటు విశ్రాంతి తీసుకోవచ్చు. లేదా స్ట్రా ద్వారా నీరు తాగుతూ శ్వాస పీల్చుకుంటూ విడిచి పెట్టండి. ఈ ప్రక్రియను కనీసం ఒక నిమిషం పాటు పునరావృతం చేయడం ద్వారా రిలాక్స్‌గా ఉంటారు.

సానుకూల ఆలోచనను ప్రోత్సహించండి.

ఉన్న ప్రతికూల ఆలోచనలను తగ్గించడానికి, సానుకూల ఆలోచనను ప్రోత్సహించడానికి ఉదయం, సాయంత్రం ఎప్పుడు ఖాళీగా ఉన్నా నేను ఉత్తమంగా ఉన్నాను, నేను విజయవంతమయ్యాను వంటి కొన్ని సానుకూల పదాలను పదే పదే మీకు మీరే చెప్పుకోండి. నేను ఈ పని చేయగలను. నేను నా పనిని బాగా చేస్తున్నాను.. నేను నిదానంగా ముందుకు సాగుతున్నాను. అయినా ఖచ్చితంగా నేను నా లక్ష్యాన్ని సాధిస్తాను. ఎవరి మాటలను పట్టించుకోను వంటి సానుకూల ఆలోచనను చేయండి.

ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించండి

సానుకూలంగా ఉండటానికి ఆరోగ్యంగా ఉండటం చాలా ముఖ్యం. ఆరోగ్యంగా ఉన్నప్పుడే మానసికంగా చురుకుగా ఉంటారు. అందుకే దినచర్యలో భాగంగా ఉదయం కొంతసేపు ధ్యానం, జాగింగ్ , ప్రకృతిలో నడవడం వంటివి చేయండి. రాత్రి వేళల్లో సరైన సమయానికి పడుకోవడం, ఉదయం లేవడం, సమతుల్య ఆహారం తీసుకోవడం, పుష్కలంగా నీరు త్రాగడం, సోషల్ మీడియాకు కొంత దూరం పాటించడం వంటి చర్యలు తీసుకోండి.

సమయాన్ని వినియోగించుకోండి

ఏ పని చేయనప్పుడు లేదా చేస్తున్న పని ఇష్టం లేనప్పుడు చాలా ప్రతికూల ఆలోచనలు మనస్సులోకి వస్తాయి. అందువల్ల నచ్చిన ప్రదేశంలో సమయాన్ని గడపండి. గార్డెనింగ్ కోసం సమయాన్ని వెచ్చించడం, సంగీతం వినడం లేదా నేర్చుకోవడం, డ్రాయింగ్, డ్యాన్స్ వంటివన్నీ ఒత్తిడిని తగ్గించడంలో సహాయపడతాయి