బెంగళూరులో దిగిన ప్రజ్వల్‌ రేవణ్ణ.. అరెస్టు చేసిన సిట్‌ పోలీసులు

మహిళలపై లైంగిక దాడి ఆరోపణలు ఎదుర్కొంటున్న జేడీఎస్‌ ఎంపీ ప్రజ్వల్‌ రేవణ్ణ (Prajwal Revanna)ను బెంగళూరు (Bengaluru) పోలీసులు గురువారం అర్ధరాత్రి దాటాక అరెస్టు చేశారు. జర్మనీ నుంచి బయలుదేరిన ఆయన బెంగళూరులోని కెంపెగౌడ అంతర్జాతీయ విమానాశ్రయంలో దిగిన వెంటనే సిట్‌ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అనంతరం ఆయనను విచారణ నిమిత్తం సీఐడీ కార్యాయానికి తరలించారు.


మాజీ ప్రధాని దేవెగౌడ మనవడు అయిన ప్రజ్వల్‌ రేవణ్ణ.. ఎన్డీయే కూటమి తరఫున హాసన నుంచి ఎంపీగా బరిలోకి దిగారు. పలువురు మహిళలపై ఆయన లైంగిక దాడి చేసినట్లు వీడియోలు సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొట్టడంతో ఆయన గత ఏప్రిల్‌లో దేశం విడిచి పరారయ్యారు. ఇప్పటివరకు రేవణ్ణపై మూడు కేసులు నమోదు అయ్యాయి. ఆయన జాడ కోసం బెంగళూరు పోలీసులు ముమ్మరంగా గాలించారు. ఆయనపై నాలుగుసార్లు నోటీసులు, ఒక అరెస్టు వారెంటు, బ్లూ కార్నర్, రెడ్‌ కార్నర్‌ నోటీసులు జారీ అయ్యాయి. దౌత్య పాస్‌పోర్టు రద్దు చేసేందుకు కేంద్ర విదేశాంగ శాఖ చర్యలు చేపట్టింది. విచారణకు హాజరు కావాలని ఆయన తండ్రి హెచ్‌డీ రేవణ్ణ, మాజీ ముఖ్యమంత్రి హెచ్‌డీ కుమారస్వామి, మాజీ ప్రధాని హెచ్‌డీ దేవెగౌడ బహిరంగానే కోరారు.

ఈ నేపథ్యంలో తనపై నమోదైన కేసుల విచారణకు సహకరిస్తానని, మే 31న ‘సిట్‌’ ముందు హాజరవుతానని ఇటీవల తొలిసారి వీడియో సందేశంలో రేవణ్ణ పేర్కొన్నారు. మరోవైపు బెంగళూరు కోర్టులో రేవణ్ణకు ఎదురుదెబ్బ తగిలింది. ఆయన ముందస్తు బెయిల్‌ పిటిషన్‌ను ప్రజాప్రతినిధుల ప్రత్యేక కోర్టు తిరస్కరించింది.