పీఎం మోడీ కొత్త మంత్రివర్గంలో ఆరుగురు మాజీ సీఎంలు..

PM Modi New Cabinet: లోక్‌సభ ఎన్నికల్లో మరోసారి గెలిచిన ఎన్డీయే ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ప్రధానిగా నరేంద్రమోడీ మూడోసారి ప్రమాణస్వీకారం చేశారు. ఈ రోజు రాష్ట్రపతి భవన్ వేదికగా జరిగిన ఈ కార్యక్రమానికి అనేక మంది అతిథులు హాజరయ్యారు. ప్రధానితో సహా 71 మంది మంత్రులతో మోడీ కొత్త కేబినెట్ ఏర్పడింది. ప్రధానిగా మోడీతో పాటు కేంద్రమంత్రులు రాజ్‌నాథ్ సింగ్, అమిత్ షా, నితిన్ గడ్కరీ, జేపీ నడ్డా, శివరాజ్ సింగ్ చౌహాన్, నిర్మలా సీతారామన్, ఎస్ జైశంకర్, మనోహర్ లాల్ కట్టర్ తదితరులు కేంద్రమంత్రులుగా ప్రమాణస్వీకారం చేశారు.


ఎన్డీయేలోని మిత్ర పక్షాలకు 11 మందికి మంత్రి పదవులు దక్కాయి. మంత్రి మండలిలో అన్ని సామాజిక వర్గాలకు ప్రాతినిధ్యం లభించే విధంగా ఓబీసీ నుంచి 27 మంది, షెడ్యూల్డ్ కులాల నుంచి 10 మంది, షెడ్యూల్డ్ తెగల నుంచి ఐదుగురు, మైనారిటీల నుంచి ఐదుగురుకి మంత్రి పదవులు దక్కాయి.

ప్రస్తుతం మోడీ కేబినెట్‌లో ఆరుగురు మాజీ ముఖ్యమంత్రులు ఉన్నారు. మూడు సార్లు మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రిగా చేసిన శివరాజ్ సింగ్ చౌహాన్, హర్యానా మాజీ సీఎం మనోహర్ లాల్ కట్టర్, యూపీ మాజీ సీఎం రాజ్‌నాథ్ సింగ్, అస్సాం మాజీ సీఎం సర్బానంద సోనోవాల్, బీహార్ మాజీ సీఎం జీతన్ రామ్ మాంఝీ, కర్ణాటక మాజీ సీఎం కుమారస్వామి ఉన్నారు. ప్రధాని నరేంద్రమోడీ కూడా గతంలో గుజరాత్ సీఎంగా పనిచేయడం గమనార్హం.

బీజేపీ నుంచి అమిత్ షా, నితిన్ గడ్కరీ, నిర్మలా సీతారామన్, ఎస్ జైశంకర్, పీయూష్ గోయల్, జ్యోతిరాదిత్య సింధియా, ధర్మేంద్ర ప్రధాన్, భూపేందర్ యాదవ్, అశ్విని వైష్ణవ్, ప్రహ్లాద్ సింగ్, మరియు ప్రహ్లాద్ జోషి ఉన్నారు.