Smart Phone: సెల్ ఫోన్‌కు ల్యాప్ టాప్‌తో చార్జింగ్ పెడుతున్నారా?

స్మార్ట్ ఫోన్ వాడేవారు దానిని తరచూ చార్జ్ చేసుకోలేక ఇబ్బంది పడుతుంటారు. దీంతో షార్ట్ కట్స్ ఉపయోగించి చార్జింగ్ ఎక్కిస్తుంటారు. అలాంటిదే ల్యాప్ టాప్ తో సెల్ ఫోన్ కు చార్జింగ్ పెట్టడం. టైం లేకనో, ఆఫీసు పనుల్లో బిజీగా ఉండో అడాప్టర్ ను ఉపయోగించడం పూర్తిగా మానేస్తుంటారు. ఇలా చేసేవారిని టెక్ నిపుణులు హెచ్చరిస్తున్నారు.


స్మార్ట్ ఫోన్ లేని ప్రపంచాన్ని ఒక్క నిమిషం కూడా ఊహించుకోలేం. అంతలా మన జీవితాల్లో ఈ సెల్ ఫోన్ భాగమైంది. కొందరు ఎంటర్ టైన్మెంట్ కోసం వీటిని ఉపయోగిస్తే మరికొందరు ఆఫీసు పనులు, బిజినెస్ ల కోసం ఫోన్ వాడుతుంటారు. అయితే, ఎంత చార్జింగ్ పెట్టినా బ్యాటరీ డౌన్ అయ్యే ఫోన్లతో ఎప్పుడూ ఇబ్బందే. అందుకే దగ్గర్లో ఏది అందుబాటులో ఉండే ఆ పరికరానికి సెల్ ఫోన్ చార్జింగ్ పెడుతుంటారు. అలాగే ల్యాప్ టాప్ లను కూడా చార్జింగ్ కోసం వాడుతుంటారు. ల్యాప్ టాప్ లో యూఎస్ బీ పోర్టును ఉపయోగించి ట్యాప్ టాప్ కు కనెక్ట్ చేస్తుంటారు. అయితే, ఇలా చేయడం ఎంత వరకు కరెక్టెనా అనేది పరిశీలిస్తే..

ఫోన్ బ్యాటరీకి ముప్పే..
అడాప్టర్ కు బదులుగా సెల్ ఫోన్ ను ల్యాప్ టాప్ తో చార్జ్ చేయడం వల్ల ప్రయోజనాల కన్నా ప్రమాదాలే ఎక్కువున్నాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు. మామూలుగానే ఇలా చార్జింగ్ పెట్టినప్పుడు సాధారణ సమయం కన్నా మరింత ఎక్కువ సమయం తీసుకుంటుంది. దీని వల్ల మీ ఫోన్ బ్యాటరీలో ఎన్నో రకాల సమస్యలు తలెత్తవచ్చు. ఇది ఫోన్ బ్యాటరీ సహజంగా పనిచేసే తీరును మార్చేస్తుంది. యూఎస్ బీ పోర్టులు చార్జర్ ల కంటే తక్కువ శక్తివంతమైనవి కాబట్టి వీటితో చార్జింగ్ ఎక్కించడానికి ఎక్కువ సమయం పడుతుంది. ఈ ప్రాసెస్ లో మీ ఫోన్ బ్యాటరీ దెబ్బతింటుంది.

ల్యాప్ టాప్‌కూ నష్టమే..
మీ సెల్ ఫోన్ తో పాటు ల్యాప్ టాప్ కు కూడా జరగాల్సిన నష్టం జరిగిపోతుంది. ఇలా చేయడం వల్ల ల్యాప్ టాప్ కూడా విపరీతంగా వేడెక్కిపోతుంది. ఒక్కో సారి ఇవి పేలిపోతున్న ఘటనలు కూడా చూస్తుంటాం. అందుకే కేబుల్ సామర్థ్యాన్ని కూడా ఓ సారి పరీక్షించుకోవడం బెటర్.

ఫోన్‌లో సమస్యలు..
మీ సెల్ ఫోన్ చార్జర్ కు బదులు వేరొకరి చార్జర్ ను ఎక్కువ కాలం ఉపయోగించడం వల్ల కూడా మీ ఫోన్ బ్యాటరీ సామర్థ్యం దెబ్బతింటుంది. లేదా తక్కువ రేటుకే వస్తుందని కూడా చౌకగా దొరికే చార్జర్లను కూడా వాడకపోవడమే మంచిది. దీనివల్ల లాంగ్ రన్ లో సెల్ ఫోన్ పాడవడమే కాకుండా దాని వేగం కూడా తగ్గిపోతుంది.