Smart Phones Survey : మనదేశంలో ఇప్పుడు మరుగుదొడ్డి లేని ఇళ్లు ఉన్నాయి. కానీ స్మార్ట్ ఫోన్లు లేని ఇళ్లు లేనే లేవు. దీన్నిబట్టి స్మార్ట్ ఫోన్ల వినియోగం ఎంతగా పెరిగిందో మనం అర్థం చేసుకోవచ్చు.
ప్రతీ ఒక్కరి చేతిలో ఒక స్మార్ట్ ఫోన్ ఇప్పుడు తప్పనిసరిగా కనిపిస్తోంది. ఒక అంచనా ప్రకారం.. మన దేశంలో స్మార్ట్ ఫోన్ యూజర్ల సంఖ్య 100 కోట్లకు పైమాటే. ఈనేపథ్యంలో భారతీయుల స్మార్ట్‌ఫోన్ వినియోగపు అలవాట్లపై అమెరికాకు చెందిన బోస్టన్ కన్సల్టింగ్ గ్రూప్ (BCG) నిర్వహించిన అధ్యయనంలో ఆసక్తికర విషయాలు(Smart Phones Survey) వెలుగుచూశాయి. అవేంటో ఇప్పుడు చూద్దాం.
బోస్టన్ కన్సల్టింగ్ గ్రూప్ నివేదికలోని విశేషాలివీ..
భారత్‌కు చెందిన స్మార్ట్ ఫోన్ యూజర్లలో దాదాపు సగం మందికి తాము స్మార్ట్ ఎందుకు వాడుతున్నామనే విషయం కూడా తెలియదు. అంటే.. ఎలాంటి కారణం లేకుండానే ఎంతోమంది స్మార్ట్ ఫోన్‌ను వాడేస్తున్నారు.
స్మార్ట్ ఫోన్‌ను తరుచుగా చేతిలోకి తీసుకోవడం ఒక అసంకల్పిత ప్రతీకార చర్యలా మారిపోయింది. అంటే తమ ప్రమేయం లేకుండానే ఫోన్‌ను చేతితో తాకుతున్నారు. ఫోన్‌ను తరుచుగా ఓపెన్ చేసి చూస్తున్నారు. యూజర్‌కు తెలియకుండానే చెయ్యి ఫోన్ మీదకు వెళ్తోంది.. వేళ్లు బ్రౌజ్ చేయడం మొదలుపెడుతున్నాయి.
ఫోన్‌ను అకస్మాత్తుగా ఎందుకు చూస్తున్నారు ? ఏం పనిలేకున్నా ఎందుకు ఫోన్‌లో బ్రౌజింగ్ చేస్తున్నారు ? అని బోస్టన్ కన్సల్టింగ్ గ్రూపు నిపుణులు సర్వేలో పాల్గొన్న భారతీయులను ప్రశ్నించారు. దీనికి భారతీయులు షాకిచ్చే ఆన్సర్స్ చెప్పారు. ”మాకు తెలియదు” అని కొందరు.. ”ఊరికే అలా జరిగిపోతోంది” అని మరికొందరు సమాధానాలిచ్చారు.
ఈ సర్వేలో భాగంగా బోస్టన్ కన్సల్టింగ్ గ్రూప్ నిపుణులు వెయ్యి మందికిపైగా భారతీయులను ప్రశ్నించారు.
ఫోన్‌ను చేతిలో తీసుకునే సందర్భాల్లో దాదాపు 55 శాతం సమయాల్లో.. ఎందుకోసం ఫోన్ పట్టుకున్నారనే దానిపై ఇండియన్స్‌కు క్లారిటీ ఉండటం లేదు. దాదాపు 50 శాతం సందర్భాల్లోనే క్లారిటీ ఉంటోంది. 5 నుంచి 10 శాతం సందర్భాల్లో మాత్రమే యూజర్లకు స్మార్ట్ ఫోన్ వాడకంపై పాక్షికంగా స్పష్టత ఉంటోంది.
ఒక సాధారణ వినియోగదారుడు రోజుకు దాదాపు 70 నుంచి 80 సార్లు తమ స్మార్ట్ ఫోన్‌ను చేతిలోకి తీసుకుంటున్నాడు.
స్మార్ట్ ఫోన్ వినియోగంలో.. సోషల్ మీడియాలో గడపడం, షాపింగ్ చేయడం, సెర్చ్ చేయడం, గేమింగ్ వంటివి వరుసగా ప్రాధాన్యతా క్రమంలో ఉన్నాయి.
ఫోన్ వాడుతున్న సందర్భంలో దాదాపు 50 నుంచి 55 శాతం సమయాన్ని స్ట్రీమింగ్ యాప్‌ల కోసం వెచ్చిస్తున్నారు. గేమింగ్, షాపింగ్ కోసం 5 నుంచి 8 శాతం టైమ్‌ను కేటాయిస్తున్నారు.
దాదాపు 84 శాతం మంది వినియోగదార్లు, తాము నిద్ర లేచిన 15 నిమిషాల్లోపే ఫోన్ చెక్ చేసుకుంటున్నారు.