‘ఏం కొనేటట్లు లేదు.. ఏం తినేటట్లు లేదు.. నాగన్నా.. ధరలు మీద ధరలు పెరిగె నాగులో నాగన్న’ అనే ఆర్. నారాయణమూర్తి సినిమాలో పాట ఎంత మందికి గుర్తుంది.
ప్రస్తుతం నిత్యవసర సరుకుల ధరలు పెరగడంతో రాష్ట్రంలోని పేద, మధ్యతరగతి ప్రజల బతుకులు అలాగే మారాయి. పప్పులు, ఉప్పు, వంటనూనె వంటి ధరలు ఆకాశానికి పరుగులు పెడుతుండడంతో ప్రజలు బతుకెళ్లదీయలేక పడుతున్న పాట్లు అన్నీఇన్నీ.. కాదు. ఇలా గ్రామాల్లో ఉపాధిలేక నగరాలకు వలసొచ్చిన వేతన జీవులు అధిక ధరలతో పడుతున్న అవస్థలు వర్ణనాతీతం. ప్రస్తుతం మార్కెట్ లో ఏది కొందామన్నా వామ్మో అనుకునేలా మారాయి. జేబు నుండి డబ్బు తీసుకోని పోయిన..కనీసం చేతిలో పట్టుకునే సామాన్లు కూడా రావడం లేదు.
ప్రజల సమస్యలు ఇలా ఉంటే వ్యాపారులు బాధలు మరోలా ఉన్నాయి. ఏ రోజుకి ఏ ధర ఉంటుందో తెలియట్లేదని, ఒకేసారి ఎక్కువ మోతాదులో సరుకులు కొనుగోలు చేస్తే.. ఒకవేళ వాటి ధరలు తగ్గితే తాము నష్టపోతామనే భయంలో ఉన్నామని చెబుతున్నారు. ధరలు ఎక్కువగా ఉండడంతో ప్రజలు కొనుగోలు చేసే సరుకులు మోతాదు తగ్గుతోందని వ్యాపారులు చెబుతున్నారు. దీంతో తమ వ్యాపారాలు దెబ్బుతింటున్నాయని వాపోతున్నారు. రోజువారీ కూలీ చేసుకునే వారికి చేతి నిండా పనులు దొరకడం లేదు. దీనికితోడు నిత్యావసరాల ధరలు నెలల వ్యవధిలోనే పెరిగిపోతున్నాయి. దీంతో కుటుంబాలను ఎలా పోషించాలో అర్థం కాని పరిస్థితులు ఏర్పడుతున్నాయి. కూలీ పనులు, ఇతర చిన్న ఉద్యోగాలు చేస్తున్నవారికి జీతాలు పెరిగేందుకు సంవత్సరాలు పడుతుంటే.. పప్పు, ఉప్పు, వంటనూనె ధరలు రోజుల వ్యవధిలోనే విపరీతంగా పెరుగుతున్నాయి. దీంతో తాము ఏమి తిని బతకాలని సామాన్యులు వాపోతున్నారు. భార్యాభర్తలు ఇద్దరూ పని చేస్తున్నా జీవనం సాఫీగా సాగడం లేదని మధ్యతరగతి ప్రజలు చెబుతున్నారు.
తాజాగా సబ్బుల ధరలు కూడా ఆకాశానికి తాకుతున్నాయి.ప్రముఖ ఎఫ్‌ఎమ్‌సీజీ కంపెనీలు వీప్రో మరియు హెచ్‌యూఎల్ (హిందూస్థాన్ యూనిలివర్) సబ్బుల ధరలను 7-8 శాతం పెంచాయి. ఇందుకు ప్రధాన కారణం పాల్మ్ ఆయిల్ ధరలు గణనీయంగా పెరగడమే. HUL, విప్రో లాంటి FMCG కంపెనీలు సంతూర్, డవ్, లక్స్, లైఫ్ బాయ్, లిరిల్, పియర్స్, రెక్సోనా తదితర సబ్బుల ధరలను పెంచాయి. ముడి సరుకైన పామ్ ఆయిల్ ధరలు 35-40 శాతం పెరగడంతో సబ్బుల రేట్లను 7-8% పెంచుతున్నట్లు ఆ కంపెనీలు ప్రకటించాయి. వీటితో పాటు టీ, స్కిన్ క్లీనింగ్ ఉత్పత్తుల రేట్లు సైతం పెరిగాయి.పాల్మ్ ఆయిల్ అనేది సబ్బుల తయారీలో ముఖ్యమైన పదార్ధం. ఇది ఉత్పత్తి ఖర్చులను నేరుగా ప్రభావితం చేస్తుంది. అంతర్జాతీయ మార్కెట్‌లో ధరలు పెరగడం వల్ల కంపెనీలు తమ ఉత్పత్తులపై ధరలు పెంచాల్సిన అవసరాన్ని వ్యక్తం చేస్తున్నాయి. ఇటీవల కాఫీ, టీ పౌడర్ ధరలు కూడా పెరిగిన విషయం తెలిసిందే.