నాగ చైతన్య, శోభిత ధూళిపాళ్ల నిశ్చితార్థం అధికారికంగా ప్రకటించబడంతో ఒక్కసారిగా వీరిపై ఫోకస్ పెరిగింది. ఆగస్టు 8, 2024, ఉదయం ఈ నిశ్చితార్థం కుటుంబ సభ్యుల సమక్షంలో సంప్రదాయ పద్ధతిలో జరిగింది.
ఈ విషయాన్ని అక్కినేని నాగార్జున సోషల్ మీడియాలో ఫోటోలను పంచుకుంటూ ప్రకటించారు. శోభిత, చైతన్య జంట సంప్రదాయ దుస్తుల్లో ఎంతో ఆనందంగా కనిపించారు.
ఇప్పటికే శోభిత ధూళిపాళ్ల పేరు ఇండస్ట్రీలో మంచి గుర్తింపు పొందింది. కానీ, ఆమె వ్యక్తిగత జీవితాన్ని చాలా మందికి తెలియకపోవచ్చు. తెనాలిలో జన్మించిన ఈ అందాల తార జీవిత కథ చాలా ఆసక్తికరంగా ఉంటుంది. మొదట ఆమె కూడా ఆమ్స్ బిజినెస్ మెన్ కూతురు అని వార్తలు వచ్చాయి. అలాగే ఇంచుమించు నాగచైతన్యకు తగ్గట్టుగా ఆస్తులు ఉన్నాయని కూడా కామెంట్స్ వచ్చాయి.
నిజానికి ఆ వార్తల్లో నిజం లేదు. ఆమె తండ్రి వేణుగోపాలరావు మెర్చంట్ నేవీ ఇంజనీర్ కాగా, ఆమె తల్లి శాంతా కామాక్షి ఒక ప్రైమరీ స్కూల్ టీచర్. ముమ్మాటికి సాదాసీదా తెలుగు కుటుంబం నుంచి వచ్చిన శోభిత, తన కుటుంబంతో కలిసి విశాఖపట్నంలో పెరిగింది. అక్కినేని వారి ఆస్తులతో పోలిస్తే వారి ఆస్తులు చాలా తక్కువ. కానీ నాగచైతన్య కేవలం ఆమెతో జీవితం బాగుంటుందని మాత్రమే ఆలోచించి పెళ్లికి సిద్ధమయ్యాడు.
శోభిత తండ్రి మెర్చంట్ నేవీలో పనిచేస్తుండటంతో, కుటుంబం తరచుగా మారుతూ ఉండేది. అయితే, శోభిత చిన్న వయసులోనే ముంబైకి చేరుకుంది, అక్కడి నుంచే ఆమె ఉన్నత విద్య పూర్తి చేసింది. ముంబైలోని వివిధ విశ్వవిద్యాలయాల్లో వాణిజ్యం, ఆర్థిక శాస్త్రం, కార్పొరేట్ లా వంటి పలు కోర్సులు పూర్తి చేసింది.
సోభిత ధూళిపాళ్లకు మంచి శిక్షణ పొందిన విద్యార్థిని మాత్రమే కాదు, ఆమె అందాల పోటీలలో కూడా విజయాన్ని సాధించింది. ఆమె మొదటిసారి పాల్గొన్న బ్యూటీ పేజెంట్ ఆర్మీ ఈవెంట్ లో జరిగింది. ఆ తర్వాత, 2013 లో జరిగిన మిస్ ఎర్త్ పోటీల్లో భారతదేశానికి ప్రాతినిధ్యం వహించింది. ఆమె సినీరంగంలో 2016లో అడుగు పెట్టింది. అనురాగ్ కశ్యప్ దర్శకత్వంలో వచ్చిన రామన్ రాఘవ్ 2.0 అనే సినిమాలో విక్కీ కౌశల్ సరసన ఆమె తొలిసారిగా నటించింది.
ఆ సినిమా తర్వాత అనేక భాషల్లో సినిమాలు చేసింది, తెలుగు సహా. ఆమె గతంలో ‘గూఢాచారి’ వంటి హిట్ సినిమాలలో నటించింది. అంతేకాకుండా, శోభిత OTT స్పేస్ లో కూడా అదృష్టాన్ని పరీక్షించుకుంది. ఆమె నటించిన ‘మేడ్ ఇన్ హెవెన్’ అనే వెబ్ సిరీస్ ప్రత్యేక గుర్తింపును తెచ్చింది. ఇప్పుడు, శోభిత తన వ్యక్తిగత జీవితంలో మరో కొత్త అధ్యాయాన్ని మొదలుపెడుతోంది. నాగ చైతన్యతో వివాహం జరగనున్న నేపథ్యంలో, ఆమె సినీ కెరీర్ కంటే వ్యక్తిగత జీవితంపై ఇప్పుడు అభిమానులు ఎక్కువగా ఆసక్తి చూపిస్తున్నారు.