Srimanthudu: నా నవల నుంచి సీన్ టు సీన్ కాపీ కొట్టారు.. కొరటాల జైలుకు వెళ్లాల్సిందే!

Novel Writer Sarath Chandra Demands Jail to koratala Siva: కొరటాల శివ దర్శకత్వంలో మహేష్ బాబు హీరోగా నటించిన శ్రీమంతుడు సినిమా తాను రాసిన నవలకు కాపీ అని శరత్ చంద్ర అనే రచయిత కోర్టును ఆశ్రయించిన సంగతి తెలిసిందే.
కొరటాల శివ, నిర్మాత నవీన్ ఎర్నేని, మహేష్ బాబు ఎంటర్టైన్మెంట్ సంస్థల మీద క్రిమినల్ చర్యలు తీసుకోవాలని ఆయన నాంపల్లి కోర్టును కోరారు. అయితే కొరటాల శివ కాపీ చేశారు కాబట్టి ఆయన మీద చర్యలు తీసుకోగలరు కానీ నిర్మాతల మీద చర్యలు తీసుకోలేమని నాంపల్లి కోర్టు తీర్పునిచ్చింది. ఈ తీర్పు మీద కొరటాల శివ హైకోర్టును ఆశ్రయించారు. తన మీద ఎలాంటి క్రిమినల్ చర్యలు తీసుకోకుండా చూడాలని కోరారు అయితే చట్టబద్ధంగా విచారణ జరుగుతుందని కోర్టు తేల్చి చెప్పింది.
ఈ విషయం మీద సుప్రీం కోర్టుని కూడా కొరటాల శివ ఆశ్రయించగా అక్కడ కూడా ఆయనకు చుక్కెదురయింది. ఈ నేపథ్యంలో రచయిత శరత్ చంద్రని పలు మీడియా సంస్థలు ఇంటర్వ్యూ చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఆయన ఈ వ్యవహారం గురించి ఓపెన్ అయ్యారు. తాను రాసిన నవల నుంచి సీన్ టు సీన్ కాపీ కొట్టారని, నేను దేవరకొండ అనే గ్రామంలో కథ జరుగుతున్నట్లు రాస్తే ఒక అక్షరం మార్చి దాన్ని దేవరకోట చేశారని చెప్పుకొచ్చారు. ఇప్పటికి కూడా వాళ్లు నాకు 15 లక్షలు ఇవ్వడానికి రెడీగా ఉన్నారు కానీ నాకు ఆ డబ్బు వద్దని అన్నారు. కొరటాల శివ తన తప్పు ఒప్పుకొని జైలుకు వెళ్లాల్సిందేనని, అలాగే ఇలా కాపీ కొట్టారు కాబట్టి సినీ పెద్దలు కల్పించుకుని అతను ఇక మీదట సినిమాలు చేయకుండా బహిష్కరించాలని శరత్ చంద్ర డిమాండ్ చేశారు. అలాగే నా మేధో సంపత్తి వాడుకొని సినిమా చేసి కోట్లు సంపాదించారు కాబట్టి న్యాయంగా నాకు రావలసిన డబ్బు కచ్చితంగా నేను కోరుకుంటా, వాళ్ళు ఇవ్వడానికి రెడీగా లేనప్పుడు అది కోర్టు ద్వారా సాధించుకుంటానని ఆయన పేర్కొన్నారు.