నేడు శ్రీవారి ఆర్జితసేవా టికెట్లు విడుదల – ఈనెల 24న రూ. 300 టికెట్ల కోటా జారీ

www.mannamweb.com


ఇవాళ తిరుమ‌ల శ్రీ‌వారి ఆర్జిత సేవా టికెట్లు విడుదల కానున్నాయి. 2025 జనవరి నెల కోటాను ఉదయం 10 గంట‌ల‌కు ఆన్‌లైన్‌లో విడుదల చేయనున్నారు. భక్తులు టీటీడీ వెబ్ సైట్ లోకి వెళ్లి బుకింగ్ చేసుకోవాల్సి ఉంటుంది. అక్టోబర్ 24న జనవరికి సంబంధించిన ప్రత్యేక ప్రవేశ దర్శనం రూ.300 టికెట్ల కోటాను అందుబాటలోకి తెస్తారు.

తిరుమల శ్రీవారి భక్తులకు అలర్ట్. 2025 జనవరికి సంబంధించిన శ్రీవారి ఆర్జిత సేవలు, దర్శన టికెట్ల కోటా ఇవాళ్టి నుంచి అందుబాటులోకి రానున్నాయి. టీటీడీ ప్రకటించిన షెడ్యూల్ ప్రకారం… ఇవాళ(అక్టోబర్ 19) ఆర్జిత సేవల కోటాను విడుదల కానుంది. వీటిలో కొన్నింటిని ఎలక్ట్రానిక్‌ లక్కీడిప్‌ కోటా కింద… అక్టోబర్ 21న అందుబాటులోకి తీసుకువస్తారు. https://ttdevasthanams.ap.gov.in వెబ్‌సైట్ ద్వారా శ్రీ‌వారి ఆర్జిత‌సేవ‌లు, ద‌ర్శ‌న టికెట్లు బుక్ చేసుకోవాలి.

తిరుమ‌ల శ్రీ‌వారి ఆర్జిత సేవా టికెట్లకు సంబంధించిన 2025 జనవరి నెల కోటాను ఇవాళ ఉదయం 10 గంట‌ల‌కు టీటీడీ.. ఆన్‌లైన్‌లో విడుదల చేయ‌నుంది. ఈ సేవాటికెట్ల ఎలక్ట్రానిక్ డిప్ కోసం అక్టోబరు 21వ తేదీ ఉదయం 10 గంటల వరకు ఆన్‌లైన్‌లో నమోదు చేసుకోవచ్చని ఓ ప్రకటనలో తెలిపింది. ఈ టికెట్లు పొందిన వారు అక్టోబరు 21 నుండి 23వ తేదీ మధ్యాహ్నం 12 గంటల లోపు సొమ్ము చెల్లించిన వారికి లక్కీడిప్‌లో టికెట్లు మంజూరవుతాయి.

అక్టోబర్ 22న ఆర్జిత సేవా టికెట్ల విడుదల : కల్యాణోత్సవం, ఊంజల్ సేవ, ఆర్జిత బ్రహ్మోత్సవం, సహస్రదీపాలంకార సేవా టికెట్లను ఉదయం 10 గంటలకు విడుదల చేస్తారు.
22న వర్చువల్ సేవల కోటా విడుదల : వర్చువల్ సేవలు, వాటి దర్శన స్లాట్లకు సంబంధించిన జనవరి నెల కోటాను అక్టోబరు 22న మధ్యాహ్నం 3 గంటలకు టీటీడీ ఆన్‌లైన్‌లో విడుదల చేయనుంది.
అక్టోబరు 23న‌ అంగప్రదక్షిణం టోకెన్లు: జనవరి నెల‌కు సంబంధించిన అంగప్రదక్షిణం టోకెన్ల కోటాను అక్టోబరు 23న ఉదయం 10 గంటలకు టీటీడీ ఆన్‌లైన్‌లో విడుదల చేయ‌నుంది.
శ్రీవాణి టికెట్ల ఆన్ లైన్ కోటా : శ్రీవాణి ట్రస్టు టికెట్లకు సంబంధించిన జనవరి నెల ఆన్ లైన్ కోటాను అక్టోబరు 23వ తేదీ ఉదయం 11 గంటలకు టీటీడీ విడుదల చేయనుంది.
వృద్ధులు, దివ్యాంగుల దర్శన కోటా: వ‌యోవృద్ధులు, దివ్యాంగులు, దీర్ఘ‌కాలిక వ్యాధులున్న‌వారు తిరుమల శ్రీ‌వారిని ద‌ర్శించుకునేందుకు వీలుగా జనవరి నెల ఉచిత‌ ప్ర‌త్యేక ద‌ర్శ‌నం టోకెన్ల కోటాను అక్టోబరు 23న మధ్యాహ్నం 3 గంట‌ల‌కు టీటీడీ ఆన్‌లైన్‌లో విడుద‌ల చేయ‌నుంది.
స్పెషల్​ దర్శనం రూ.300 టికెట్లు : అక్టోబర్ 24న జనవరికి సంబంధించిన ప్రత్యేక ప్రవేశ దర్శనం రూ.300 టికెట్ల కోటాను అందుబాటలోకి తెస్తారు.
తిరుమల, తిరుపతిల‌లో జనవరి నెల గదుల కోటాను అక్టోబరు 24న మధ్యాహ్నం 3 గంటలకు ఆన్‌లైన్‌లో విడుదల చేస్తారు.

శ్రీ పద్మావతి అమ్మవారి బ్రహ్మోత్సవాలు:

శ్రీ పద్మావతి అమ్మవారి బ్రహ్మోత్సవాలు నవంబరు 28 నుండి డిసెంబర్ 6వ తేదీ వరకు జరగనున్నాయి. ఈ ఉత్సవాలను వైభవంగా నిర్వహించేందుకు అన్ని విభాగాల అధికారులు ముందస్తు ఏర్పాట్లు చేపట్టాలని టిటిడి జెఈవో వీరబ్రహ్మం అధికారులను ఆదేశించారు.

శుక్రవారం ఆయన అధికారులతో కలిసి అమ్మవారి ఆలయం, పుష్కరిణి, మాడవీధులు, నవజీవన్ కంటి ఆసుపత్రి సమీపంలోని ఖాళీ స్థలం, ఘంటసాల సర్కిల్ , హైస్కూల్ పరిసరాలు, పసుపు మండపం, పూడిరోడ్డు తదితర ప్రాంతాలను పరిశీలించారు.

ఈ సందర్భంగా జెఈవో మాట్లాడుతూ… బ్రహ్మోత్సవాలకు విచ్చేసే భక్తులకు అమ్మవారి మూలమూర్తి దర్శనంతో పాటు వాహన సేవలు వీక్షించేలా టిటిడిలోని అన్ని విభాగాలు సమన్వయంతో ఏర్పాట్లు చేస్తున్నట్లు చెప్పారు. బ్రహ్మోత్సవాలలో చివరిరోజైన పంచమి తీర్థం నాడు విశేషంగా వచ్చే భక్తుల వాహనాల పార్కింగ్ కోసం పూడి రోడ్డు, రేణిగుంట, మార్కెట్ యార్డ్ ప్రాంతాల్లో స్థలాలను సిద్ధం చేయాలన్నారు.

భక్తులు సేదతీరేందుకు నవజీవన్ కంటి ఆసుపత్రి, హైస్కూలు, గోశాల(పూడి రోడ్డు) వద్ద జర్మన్ షెడ్లు ఏర్పాటు చేయాలన్నారు. పుష్కరిణిలోకి వెళ్లేందుకు, తిరిగి వెలుపలికి వచ్చేందుకు తగిన విధంగా గేట్లు ఏర్పాటు చేయాలని అధికారులకు ఆదేశించారు. తమిళనాడు భక్తులు ఎక్కువగా వచ్చే అవకాశం ఉన్నందున తమిళంలో సైన్ బోర్డులు సిద్ధం చేయాలన్నారు.