అంగన్వాడీలకు మద్దతుగా 24న రాష్ట్ర బంద్

Share Social Media

అంగన్వాడీలకు మద్దతుగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బంద్ కు రాష్ట్ర అఖిలపక్ష ట్రేడ్ యూనియన్లు పిలునిచ్చాయి. ఈ బంద్ ను జయప్రదం చేయాలని సిఐటియు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సిహెచ్.నరసింగరావు, ఏఐటీయూసీ రాష్ట్ర అధ్యక్షులు ఆర్.రవిద్రనాధ్, ఐఎఫ్టియు రాష్ట్ర అధ్యక్షులు పి.ప్రసాద్, టీఎన్టియుసి రాష్ట్ర అధ్యక్షులు రఘురామరాజు, ఐ.ఎన్.టి.యు.సి రాష్ట్ర నాయకులు క్రాంతికుమార్ తదితరులు పత్రికా ప్రకటనను విడుదల చేశారు. ఈ ప్రకటనలో .. “ఒక లక్షా ఐదువేల మంది అంగన్వాడీ మహిళ శ్రామికుల జీతభత్యాలు, పనిభారలు తదితర సమస్యలపై సిఐటియు, ఏఐటీయూసీ, ఐఎఫ్టియు అనుబంధ అంగన్వాడీ సంఘాల ఆధ్వర్యంలో గత 42 రోజులుగా సమ్మె జరుగుతున్నది. వారి డిమాండ్లకు మద్దతుగా ప్రజలనుండి సేకరించిన కోటి సంతకాలను జగనన్నకి సమర్పించడానికి విజయవాడ వస్తున్న అంగన్వాడీలపై పాశవికంగా పోలీసులతో దాడి చేయించారు.
అంగన్వాడీల న్యాయమైన డిమాండ్లను పరిష్కరించడానికి బదులు రాష్ట్ర ప్రభుత్వం ఎస్మా చట్టాన్ని ప్రయోగించడం అత్యంత నిరంకుశమైనది. పైగా నిరవధిక నిరాహార దీక్షలు చేస్తున్న దీక్షా శిబిరంపై ఈరోజు అనగా 42వరోజు తెల్లవారుజామున 3 గంటలకు నిరాహారదీక్ష శిబీరాన్ని కూల్చాయి. దీక్షలు చేస్తున్న నాయకులను దూరప్రాంతాలకు తరలించి నిర్బందించారు. వారి ఆరోగ్యాన్నికూడా పట్టించుకోలేదు.

కరెంటు తీసివేసి ఆడవాళ్ళను కూడా మగ పోలీసులే అరెస్టులు నిర్వహించి అరగంట పాటు యుద్ధభూమిని తలపించారు. దీక్షలకు మద్దతుగా పాల్గొన్న సుమారు 2 వేల మంది అరెస్టుచేసి మచిలీపట్నం, నూజివీడు తదితర సుదూర ప్రాంతాలకు తరలించారు. లక్ష మందికి పైగా అంగన్వాడీలు చాలిచాలని జీతాలతో జీవిస్తున్న మహిళా కార్మికులపట్ల రాష్ట్ర ప్రభుత్వ పాశవిక విధానానికి వ్యతిరేకంగా, బాధిత అంగన్వాడిలకు సంఘీభావంగా రాష్ట్ర బంద్ చేయడం అవసరమని రాష్ట్ర అఖిలపక్ష ట్రేడ్ యూనియన్లు భావించాయి. 24-01-2024 న రాష్ట్ర బంద్ జయప్రదం చేయడం ద్వారా నిరంకుశ రాష్ట్ర ప్రభుత్వం పట్ల తగిన ప్రతిఘటనను ప్రదర్శించాల్సి ఉందని మేము భావిస్తున్నాము. ఈ పిలుపును రాష్ట్ర రాజకీయ పార్టీలు, ప్రజా సంఘాలు, హక్కుల సంఘాలు, ప్రజాస్వామిక వాదులు, వివిద వర్గాల ప్రజలు బలపరచవలసిందిగా కోరుతున్నాము” అని పేర్కొన్నారు.

Related News