కొన్నేళ్ల క్రితం ఒత్తిడి అనే ఒక ఆరోగ్య సమస్య వస్తుందని కూడా చాలా మంది ఊహించకపోయి ఉండొచ్చు. కానీ ప్రస్తుతం ఒత్తిడి సర్వసాధారణంగా మారిపోయింది. స్కూలుకు వెళ్లే చిన్నారుల నుంచి ఆఫీసుకు వెళ్లే ఉద్యోగుల వరకు ఒత్తిడితో చిత్తవుతున్నారు.
రోజురోజుకీ ఒత్తిడితో ఇబ్బంది పడుతోన్న వారి సంఖ్య పెరుగుతోంది. సహజంగా ఒత్తిడి మానసిక సమస్యగా భావిస్తుంటాం. అయితే ఒత్తిడి శారీరక ఆరోగ్యంపై కూడా ప్రభావం చూపుతుందని నిపుణులు అంటున్నారు.
దీర్ఘకాలంగా ఒత్తిడితో బాధపడుతుంటే అది అందంపై ప్రభావం చూపుతుందని తాజా పరిశోధనల్లో వెల్లడైంది. ఒత్తిడి, ఆందోళనలకు గురైనప్పుడు ముఖ సౌందర్యం విషయంలో కొన్ని రకాల మార్పులు వస్తాయని అంటున్నారు. సాధారణంగా ఒత్తిడి, ఆందోళనకు గురికాగానే శరీరంలో ఎక్కువ మొత్తంలో కార్టిసాల్ విడుదలవుతుంది. ఇది ఒత్తిడి హార్మోన్. చర్మంపై ఉండే నూనె గ్రంథుల్ని (సెబేషియస్ గ్రంథులు) ప్రేరేపించి ఎక్కువ మొత్తంలో నూనెలు విడుదలయ్యేందుకు కారణమవుతుంది. దీంతో చర్మ గ్రంథులు మూసుకుపోయి ముఖంపై మొటిమలు వస్తాయని అంటున్నారు.
ఒత్తిడితో బాధపడేవారిలో కళ్ల కింద వాపు, కనురెప్పలు ఉబ్బడం వంటి సమస్యలు కూడా వస్తాయని అంటున్నారు. దీంతో ముఖ సౌందర్యం దెబ్బతింటుంది. అదే విధంగా ఒత్తిడితో చర్మం ఎలాస్టిసిటీ కోల్పోతుంది. దీంతో చిన్న వయసులోనే వృద్ధాప్య ఛాయలు ఏర్పడుతాయి. ఒత్తిడి కారణంగా చర్మం త్వరగా పొడిబారుతుందని పలు అధ్యయనాల్లో వెల్లడైంది. దీనికి కారణం ఒత్తిడి కారణంగా.. చర్మం కింద ఉండే ప్రొటీన్, లిపిడ్స్ చర్మ కణాల దెబ్బ తినడమే.
ఒత్తిడి, ఆందోళన వల్ల రోగ నిరోధక శక్తిపై కూడా ప్రతికూల ప్రభావం పడుతుంది. దీంతో పొట్ట, చర్మంలో ఉండే బ్యాక్టీరియా సమతుల్యం దెబ్బతింటుంది. దీన్నే ‘డిస్‌బయోసిస్’ అంటారు. ఫలితంగా చర్మంపై దద్దుర్లు, ఎరుపెక్కడం.. వంటి సమస్యలొస్తాయి. దీర్ఘకాలంగా ఇది కొనసాగితే సొరియాసిట్ వంటి చర్మ వ్యాధులకు కూడా దారి తీసే ప్రమాదం ఉంటుంది. మానసిక సమస్యలు ఎక్కువైతే జుట్టు కూడా తెల్లబడుతుందని పలు అధ్యయనాల్లో వెల్లడైంది.
నోట్: పైన తెలిపిన విషయాలు కేవలం ప్రాథమిక సమాచారం మేరకు మాత్రమే. ఆరోగ్యానికి సంబంధించి వైద్యుల సూచనలు పాటించడమే ఉత్తమం.