సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ (CBSE) సింగిల్ గర్ల్ చైల్డ్ స్కాలర్‌షిప్ కోసం దరఖాస్తు చివరి తేదీని ఫిబ్రవరి 8, 2025 వరకు పొడిగించింది.
విద్యార్థినులు CBSE అధికారిక వెబ్‌సైట్ cbse.gov.in ద్వారా దరఖాస్తులు చేసుకోవచ్చు. ఈ విషయంపై బోర్డు ఒక నోటీసు జారీ చేసింది. ఈ స్కాలర్‌షిప్ కింద.. పాఠశాలలో తమ తల్లిదండ్రుల ఏకైక సంతానం అయిన విద్యార్థినులకు ప్రతి నెల రూ.1000 అందజేస్తారు. ఇది రెండు సంవత్సరాల పాటు ఇవ్వబడుతుంది. అంటే నెలకు రూ. వెయ్యి చొప్పున 24 నెలలకు రూ.24 వేలు పొందవచ్చు. దీనికి విద్యార్థినులు 10వ తరగతి పరీక్షలో కనీసం 70 శాతం మార్కులు సాధించి ఉండాలి.
అర్హత , నిబంధనలు..
ఈ స్కాలర్‌షిప్ సిబిఎస్ఇ (CBSE) 10వ తరగతి పరీక్ష ఫలితాల ఆధారంగా మెరిట్ పద్ధతిలో అందజేయబడుతుంది. విద్యార్థిని ప్రస్తుతం 11వ తరగతి లేదా 12వ తరగతి చదువుతుండాలి. 10వ తరగతిలో కనీసం 70 శాతం మార్కులు ఉండాలి. 11వ మరియు 12వ తరగతులకు విద్యార్థిని ట్యూషన్ ఫీజు ప్రతి నెల రూ.2500 కన్నా ఎక్కువ కాకూడదు. విద్యార్థి కుటుంబం వార్షిక ఆదాయం రూ.8 లక్షల లోపు ఉండాలి.
విద్యార్థిని 11వ తరగతిలో కనీసం 50 శాతం మార్కులు సాధిస్తే మాత్రమే స్కాలర్‌షిప్ మరో ఏడాది రెన్యూవల్ చేస్తారు. విద్యార్థిని తన సబ్జెక్టులను లేదా పాఠశాల మార్చాలనుకుంటే, బోర్డు నుండి ముందస్తు అనుమతి తీసుకోవాలి. ఈ స్కాలర్‌షిప్ సమయంలో.. విద్యార్థినికి పాఠశాల లేదా ఇతర సంస్థల నుండి అదనపు రాయితీలు కూడా లభించవచ్చు. స్కాలర్‌షిప్ పొడిగింపు, ప్రతిభావంతులైన విద్యార్థినులకు ఆర్థికంగా నిలిచే కార్యక్రమం ఇది.