AP Schools Reopening: ఏపీలో నేటి నుంచి బడులు ప్రారంభం – మొదటి రోజే ‘స్టూడెంట్స్‌ కిట్‌’ అందజేత

www.mannamweb.com


Andhra Pradesh Schools Reopen: ఆంధ్రప్రదేశ్ పాఠశాలలు సుదీర్ఘ వేసవి సెలవు తర్వాత జూన్ 13న తెరచుకోనున్నాయి. కొత్త ప్రభుత్వం.. కొత్త విద్యా సంవత్సరంతో పాఠశాలలు పునఃప్రారంభమవుతున్నాయి.

రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలలు పునఃప్రారంభంకానున్నాయి. వాస్తవానికి జూన్ 12న పాఠశాలలు పునఃప్రారంభం కావాల్సి ఉండగా.. రాష్ట్ర ముఖ్యమంత్రిగా చంద్రబాబు, మంత్రుల ప్రమాణస్వీకార మహోత్సవం ఉండటంతో విద్యాశాఖ పాఠశాలల రీఓపెనింగ్ను ఒక రోజు వాయిదా వేసింది. అయితే ప్రస్తుత విద్యాసంవత్సరానికి సంబంధించి పాఠశాలల విద్యాక్యాలెండర్ను విద్యాశాఖ ఇప్పటివరకు విడుదల చేయలేదు. అయితే రాష్ట్రంలో కొత్త ప్రభుత్వం అధికారంలోకి రావడంతో.. కొత్త ముఖ్యమంత్రి, విద్యాశాఖ మంత్రి ఫొటోలతో త్వరలోనే అకడమిక్ క్యాలెండర్ విడుదల చేయనుంది.

పాఠశాలలు ప్రారంభం కాగానే విద్యార్థులందరికీ స్టూడెంట్ కిట్స్ అందజేసే విధంగా విద్యాశాఖ ఆదేశాలు జారీ చేసింది. ఇప్పటికే రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలలన్నింటికి సరఫరా చేయాల్సిన పాఠ్యపుస్తకాలు, నోట్బుక్స్, స్టూడెంట్ కిట్స్ను విద్యాశాఖ చేరవేసింది. విద్యార్థులకు ఎనిమిది రకాల వస్తువులతో కూడిన స్టూడెంట్ కిట్లను పంపిణీ చేయడానికి విద్యాశాఖ ఏర్పాట్లు చేస్తోంది. మొత్తం 36 లక్షల విద్యా కానుక కిట్లను పాఠశాల విద్యాశాఖ సిద్ధం చేసింది. స్థానిక ఎమ్మేల్యేలతో స్టూడెంట్ కిట్లు పంపిణీ చేయనున్నారు.

గత ప్రభుత్వం అందజేస్తున్న ‘జగనన్న విద్యాకానుక’ పేరున విద్యార్థులకు అందించే విద్యాకానుకను ఈసారి ‘స్టూడెంట్స్ కిట్’లుగా పేరుమార్చారు. విద్యార్థులకు అందించాల్సిన మధ్యాహ్నభోజన పథకం కూడా ప్రస్తుత విద్యాసంవత్సరంలో పేరుమార్చారు. గతంలో జగనన్న గోరుముద్ద పేరుతో అమలు చేసే మధ్యాహ్న భోజనం పథకం ప్రస్తుతం ‘పీఎం పోషణ గోరుముద్ద’ పేరుతో అమలు చేయనున్నారు. మరోవైపు ఏ ఒక్క స్కూలులోను ఉపాధ్యాయుల కొరత లేకుండా తాత్కాలిక సర్దుబాట్లతో సమస్య పరిష్కారానికి అధికారులు ఇప్పటికే చర్యలు తీసుకున్నారు.

విద్యాశాఖ అందజేస్తున్న కిట్లలో అన్ని సబ్జెక్టులకు సంబంధించిన పాఠ్యపుస్తకాలతోపాటు, టోఫెల్ వర్క్బుక్, ఫ్యూచర్ స్కిల్స్ సబ్జెక్ట్ పుస్తకంతో పాటు 3 జతల యూనిఫాం క్లాత్, స్కూల్ బ్యాగ్, బెల్ట్, ఆక్స్ఫర్డ్ నిఘంటువు ఉంటుంది. పాఠశాలల్లో 1 నుంచి 5 తరగతి విద్యార్థులకు వర్క్బుక్స్, పిక్టోరియల్ డిక్షనరీ ఇవ్వనున్నారు. ఇక 6 నుంచి 10 తరగతులకు నోట్బుక్స్ ఇస్తారు. ఈ విద్యాసంవత్సరం కూడా గతంలో ఇచ్చినట్టుగానే ద్విభాషా పుస్తకాలనే ముద్రించారు. ఈ విద్యా సంవత్సరం నుంచి 10వ తరగతి కూడా ఇంగ్లిష్ మీడియంలోకి మారడంతో అందుకు తగ్గట్టుగా పుస్తకాల ముద్రణ చేస్తున్నారు. అలాగే, 3 నుంచి 10 తరగతులకు వరకు పాఠ్యపుస్తక ముఖచిత్రాలు మార్చారు. రాష్ట్రంలో వెయ్యి ప్రభుత్వ పాఠశాలలు సీబీఎస్ఈలోకి మారిన సంగతి తెలిసిందే.

పదోతరగతి సోషల్ స్టడీస్ పుస్తకాలను CBSE బోధనా విధానంలో.. జాగ్రఫీ, ఎకనామిక్స్, చరిత్ర, డెమోక్రటిక్ పాలిటిక్స్ సబ్జెక్టులుగా NCERT సిలబస్ను ముద్రించింది. ఫిజికల్ సైన్స్ పుస్తకాలను ఆర్ట్ పేపర్పై ముద్రించారు. ఈ తరహా ముద్రణ చేపట్టడం ఇదే తొలిసారి కావడం గమనార్హం. ఈ విద్యా సంవత్సరం నుంచి 8వ తరగతి విద్యార్థులకు ప్రభుత్వం ‘ఫ్యూచర్ స్కిల్స్’ కోర్సు(Future Skills Course)ను అందుబాటులోకి తెచ్చింది.