రైతులకు చంద్రబాబు సర్కార్ భారీ గుడ్ న్యూస్

రైతులకు ఊరట కలిగే అంశం. ఏంటని అనుకుంటున్నారా? ఏకంగా వంద శాతం వరకు సబ్సిడీ పొందొచ్చు. పూర్తి వివరాలు తెలుసుకోండి.


ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం చిన్న, సన్నకారు రైతులను ప్రోత్సహించేందుకు బిందు సేద్యం, తుంపర సేద్యం పరికరాలు అందించేందుకు కీలక నిర్ణయం తీసుకుంది. ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం సూక్ష్మసేద్యం ద్వారా పంటలు పండించడంలో దేశంలోనే నెంబర్ వన్‌గా నిలుస్తుందని, FY25లో 1.17L హెక్టార్లలో సూక్ష్మ సేద్యం అమలు చేసి దేశంలోనే ఏపీ నెంబర్-1గా నిలిచిందని కొన్ని సర్వేల్లో వెల్లడైంది.

తాజాగా ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం చిన్న, సన్నకారు రైతులను, కాళ రైతులను ప్రోత్సహించేందుకు బిందు, తుంపర సేద్యం పద్ధతిలో డ్రిప్పు పరికరాలను 90 నుంచి 100% సబ్సిడీతో అందించనున్నట్లు కర్నూలు జిల్లా ఏపీఎంఐపీ ప్రాజెక్టు డైరెక్టర్ పి. ఉమాదేవి తెలిపారు.

గతంలో ఈ డ్రిప్పు పరికరాలు 90% సబ్సిడీతో అందిస్తుండగా, ప్రస్తుతం కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఆ 90% సబ్సిడీని 100 శాతానికి పెంచిందని తెలిపారు. ఐదు ఎకరాల లోపు ఉన్నటువంటి చిన్న, సన్నకారు ఎస్సీ, ఎస్టీ రైతులకు 100 శాతం సబ్సిడీ, బీసీ కులాలకు చెందిన రైతులకు 90% సబ్సిడీ అందిస్తున్నట్లు తెలిపారు.

5 నుంచి 10 ఎకరాల లోపు ఉన్న రైతులకు గతంలో 70 శాతం సబ్సిడీ ఉండేదని, ఇప్పుడు 90 శాతం సబ్సిడీ ఇస్తున్నట్లు స్పష్టం చేశారు. జీవో నెం.82 ప్రకారం అర్హులైన రైతులందరికీ ఈ స్కీంను వర్తింపజేస్తామన్నారు. ఇప్పటికే కర్నూలు జిల్లాలో 30,872 మంది డ్రిప్పుతోపాటు స్ప్రింక్లర్లు ఏర్పాటు చేసుకున్న రైతులు ఉన్నారని, 34,132 హెక్టార్లలో డ్రిప్పు, స్ప్రింక్లర్లను ఏర్పాటు చేసుకున్నారని తెలిపారు.

మిగిలిన రైతులంతా కూడా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవడానికి సమీపంలోని గ్రామ, వార్డు సచివాలయం లేదా ఇలా ఏపీఎంఐపీ కార్యాలయంలో సంప్రదించాలని తెలిపారు. అందువల్ల అన్నదాతలు ఉంటే మాత్రం వెంటనే ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి. మళ్లీ ఇలాంటి ఛాన్స్‌లు రాకపోవచ్చు. వంద శాతం వరకు రాయితీ లభిస్తోంది.

డ్రిప్ ఇరిగేషన్ వల్ల పలు లాభాలు ఉన్నాయి. నీటి పొదుపు చేయొచ్చు. డ్రిప్ ఇరిగేషన్ ద్వారా ప్రతి మొక్కకు అవసరమైన నీటినే నేరుగా వేరుకు అందించవచ్చు. ఈ విధానం ద్వారా సుమారు 40%–60% నీటి పొదుపు చేయవచ్చు.

ఎరువుల వినియోగం సమర్థవంతంగా ఉంటుంది. నీటితో పాటు ఎరువులను కూడా సిస్టమ్‌లో ఇవ్వవచ్చు (ఫెర్టిగేషన్). ఇది ఎరువుల వినియోగాన్ని తగ్గించడంతో పాటు, మొక్కలకు తగిన మోతాదులో పోషకాలు అందేలా చేస్తుంది. కలుపు మొక్కలు పెరగడం తగ్గుతుంది. నియంత్రిత నీటి, ఎరువుల సరఫరా వల్ల పంటలకు ఆరోగ్యం మెరుగవుతుంది. దీని వల్ల ఉత్పత్తి 20%–30% వరకు పెరగవచ్చు.

సమయానికి తగినంత నీరు అందడం వల్ల పంట నాణ్యత మెరుగవుతుంది. మార్కెట్‌లో ఎక్కువ ధర వచ్చే అవకాశం ఉంటుంది. నీటి కొరత ఉన్న ప్రాంతాల్లో ఇది గొప్ప పరిష్కారంగా నిలుస్తుంది. మిరప, టమాట, జామ, మామిడి, ద్రాక్ష వంటి తోట పంటల రైతులు డ్రిప్ ఇరిగేషన్ అమలు చేసుకోవచ్చు.