Success Story: ఒక్క వార్త చూసి కోటీశ్వరుడైన కుర్రోడు.. ఏటా కోట్లు సంపాదన.. సూపర్ సక్సెస్

Mahesh Asabe Story: ఒకప్పుడు దేశంలో రైతుల పరిస్థితి చాలా దయనీయంగా ఉండేది. అయితే ఇప్పుడు కొందరు యువ రైతులు చేస్తున్న ప్రయోగాలు వారిని కోటీశ్వరులుగా మార్చేస్తున్నాయి.
వ్యవసాయం ఒక పండుగ అన్నట్లుగా మారిపోయింది.


అలా వ్యవసాయంలో కరువుకు ప్రసిద్ధి చెందిన మహారాష్ట్రకు చెందిన యువ రైతు అందరిని ఆశ్చర్యానికి గురిచేసిన సంఘటన గురించి ఇప్పుడు తెలుసుకుందాం. మహారాష్ట్రలోని షోలాపూర్‌కు చెందిన మహేశ్‌ అసాబేకు తక్కువగా నీరు లభించే డ్రై ల్యాండ్‌లో ప్రస్తుతం డ్రాగన్ ఫ్రూట్ పండిస్తూ కోట్లు సంపాదిస్తున్నాడు. వ్యవసాయంపై చిన్నప్పటి నుంచి ఎక్కువ ఆసక్తి ఉన్న అసాబే షోలాపూర్‌లోని కాలేజ్ ఆఫ్ అగ్రికల్చరల్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీలో బీటెక్ చదివాడు. తర్వాత అదే విభాగంలో ఎంటెక్‌ పూర్తి చేశాడు.

అయితే వివిధ రకాల డ్రాగన్ ఫ్రూట్స్ పండిస్తూ తన విజయగాథతో కోట్లాది మంది రైతులకు ఆదర్శంగా నిలుస్తున్నాడు. తక్కువ నీటి వినియోగంతో పండే డ్రాగన్ ఫ్రూట్ తమ ప్రాంతంలో అనుకూలమైన పండగా గుర్తించి మెుదట తమ కుటుంబానికి ఉన్న 3 ఎకరాల్లో మహేష్ అసబే 9,000 మెుక్కలను నాటాడు. అలా ఎకరాకు ఐదు టన్నుల పండ్లతో రూ.5 లక్షలు ఆదాయం పొందాడు. అయితే రెండో ఏడాది ఎకరాకు 10 టన్నుల దిగుబడి రావటంతో రూ.10 లక్షలు ఆదాయంగాపొందాడు. మంచి లాభాలు రావటంతో తర్వాత 20 ఎకరాల భూమిని కొనుగోలు చేసి సాగును విస్తరించాడు.

అలా డ్రాగన్ ఫ్రూట్స్ పక్క రాష్ట్రాల్లోని పండ్ల వ్యాపారులకు ఎగుమతి చేస్తూ లాభాలను అందుకున్నాడు. ప్రస్తుతం మహేష్ అసబే 20 ఎకరాల్లో పలు రకాల డ్రాగన్ ఫ్రూట్‌లను సాగు చేస్తున్నాడు. దీంతో యువ రైతు ఏడాదికి రూ.2 కోట్లు సంపాదిస్తున్నాడు. డ్రాగన్ ఫ్రూట్ పోషకాలతో నిండినందున ప్రజలలో ఆదరణ పొందిందని, కాబట్టి దీనికి భవిష్యత్తు ఖచ్చితంగా ఉజ్వలంగా ఉంటుందని చెబుతున్నాడు. నీటి లభ్యత తక్కువగా ఉండే కరవు ప్రాంతాల్లోని రైతులు మహేష్‌ను అనుసరించవచ్చు.