success story: రూ.5 వేలతో ప్రారంభించిన వ్యాపారం లక్షల టర్నోవర్ గా మారింది..

పూజా కాంత్ ఢిల్లీ నివసిస్తున్న ఓ సాధారణ మహిళ. ఆమె 2015 లో ‘పూజా కి పొట్లీ’ పేరుతో చిన్న వ్యాపారాన్ని ప్రారంభించారు. ఆమె మాక్రేమ్ ఆర్ట్ అంటే చేతితో తయారు చేసిన పర్యావరణ అనుకూల ఉత్పత్తులను తయారు చేసి విక్రయిస్తోంది.
పూజ ఎంబీఏ పూర్తి చేసింది. ఆమె చాలా సంవత్సరాలు కార్పొరేట్ రంగంలో పనిచేశారు. కానీ కొడుకు పుట్టాక 2012లో ఉద్యోగం మానేసింది. ఆమె తన బిడ్డకు ఎక్కువ సమయం ఇవ్వాలని నిర్ణయించుకుని ఉద్యోగం వదులుకుంది. వ్యాపారవేత్తగా ఎదిగింది.


ఇంట్లో ఖాళీగా కూర్చోవడం ఆమెకి నచ్చలేదు. 2015లో పూజా భర్త ఆమెకు స్మార్ట్ ఫోన్ ఇచ్చాడు. బోరు కొట్టకుండా ఉండాలంటే ఇంటి వ్యాపార ఆలోచన కోసం చూడమని ఆమె భర్త ఆమెను కోరాడు. పూజా ఈ కళను నేర్చుకునేందుకు ఎలాంటి శిక్షణ, వర్క్‌షాప్ చేయలేదు. అయితే యూట్యూబ్ చూసి నేర్చుకున్నట్లు పూజ తెలిపారు. అయితే ఆమెకు కళపై పూర్తి పట్టు సాధించడానికి రెండేళ్లు పట్టింది.

కళ పట్ల ఆమెకు ఉన్న ఇష్టం కారణంగా కుట్టు, ఎంబ్రాయిడరీ, నేత వంటి కళలలో ప్రావిన్యయం సాధించింది. ఉత్పత్తులను ఆకర్షణీయంగా తాయారు చేశారు. ప్లాంట్ హ్యాంగర్లు, వాల్ హ్యాంగర్లు, బెడ్ రన్నర్‌లు, టేబుల్ రన్నర్‌లు మొదలైన అలంకార వస్తువులను తయారు చేసి విక్రయించడం మొదలు పెట్టారు. దీని ద్వారా ఆమె మరింత మంది మహిళలకు పని కల్పించారు.

2012లో ఉద్యోగం వదిలే సమయానికి పూజ జీతం నెలకు రూ.30 వేలు. 2015లో ‘పూజా కి పొట్లీ’ ప్రారంభించినప్పుడు రోజుకు ఒకటి రెండు ఆర్డర్లు వచ్చేవి. అప్పట్లో రూ.5-6 వేలు సంపాదన వచ్చేది. కాలక్రమేణా ఇవి ప్రతి వారం సుమారు 100 ఆర్డర్‌లకు పెరిగాయి. ట్రావెల్ ఏజెన్సీని నడుపుతున్న ఆమె భర్త కూడా పూజకు ఆమె వ్యాపారంలో సహాయం చేయడం ప్రారంభించాడు. 2021 ఆర్థిక సంవత్సరంలో వెంచర్ ఆదాయం రూ. 20 లక్షలకు చేరుకుంది. ఆ తర్వాత 2023 ఆర్థిక సంవత్సరంలో రూ.30 లక్షలకు పెరిగింది.

పూజా తన ఉత్పత్తులను ఆన్‌లైన్, ఆఫ్‌లైన్‌లో విక్రయిస్తోంది. ‘పూజా కి పొట్లీ’ వెబ్‌సైట్‌తో పాటు, ఆన్‌లైన్ ఉత్పత్తులు అమెజాన్, ఫ్లిప్‌కార్ట్, మీషో, ఎట్సీ వంటి మార్కెట్‌ప్లేస్‌లలో కూడా విక్రయిస్తున్నారు. బ్రాండ్ కార్పోరేట్ ఆర్డర్‌లను కూడా పెద్దమొత్తంలో పొందుతుంది. ఆన్‌లైన్ మాధ్యమం ద్వారానే ఎక్కువ విక్రయాలు జరుగుతున్నాయని చెప్పారు. ఆమె తన వ్యాపారాన్ని రూ.5 వేలతో ప్రారంభించిన్నట్లు చెప్పారు.