మూడోసారి రోదసిలోకి వెళ్లిన భారత సంతతి వ్యోమగామి సునీతా విలియమ్స్ (Sunita Williams) సాంకేతిక కారణాల వల్ల నెలలతరబడి అక్కడే చిక్కుకుపోయిన సంగతి తెలిసిందే.
ఆమె తిరిగి భూమ్మీద ఎప్పుడు అడుగుపెడతారో స్పష్టత లేదు. అంతరిక్షం నుంచి ఆమె విద్యార్థులతో మాట్లాడుతూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. జీరో గ్రావిటీ వద్ద నెలలతరబడి గడపడంతో కూర్చోవడం, పడుకోవడం కూడా కష్టమేనని అన్నారు.
”నేను చాలాకాలంగా ఇక్కడ ఉంటున్నాను. నడక ఎలా ఉంటుందో గుర్తుచేసుకోవడానికి ప్రయత్నిస్తున్నాను. ఇంతకాలంగా నేను నడవలేదు. కూర్చోలేదు. పడుకొని విశ్రాంతి తీసుకోవడానికి వీలులేకుండా పోయింది. జీరో గ్రావిటీ వద్ద కొన్ని నెలలుగా తేలియాడుతుండటంతో నేలపై నడిచిన అనుభూతిని గుర్తుతెచ్చుకోలేకపోతున్నాను” అని సునీత వెల్లడించారు. ”మా మిషన్ ప్రకారం నెల రోజుల్లోపే అంతరిక్షం నుంచి తిరిగి రావాలి. కానీ ఇంతకాలం ఇక్కడ ఉండటం కొంచెం షాకింగ్‌గా అనిపిస్తోంది” అని తెలిపారు.
ఎనిమిది రోజుల మిషన్‌లో భాగంగా సునీతా విలియమ్స్ (Sunita williams), బుచ్ విల్‌మోర్ గత జూన్ 6న బోయింగ్ స్టార్‌లైనర్ క్యాప్సుల్‌లో అంతరిక్ష కేంద్రానికి (ISS) వెళ్లిన సంగతి తెలిసిందే. వాస్తవానికి జూన్ 14వ తేదీన వీరిద్దరూ భూమికి తిరుగుపయనం కావాల్సిఉండగా.. వ్యోమనౌకలో హీలియం లీకేజీ కారణంగా సాంకేతిక సమస్యలు ఎదురయ్యాయి. దాంతో వారు ఏడు నెలలుగా అంతరిక్ష కేంద్రంలోనే చిక్కుకుపోయారు.
ఇదిలాఉంటే.. వారిని భూమి పైకి తీసుకువచ్చేందుకు బైడెన్ ప్రభుత్వం ఎలాంటి ప్రయత్నం చేయలేదని.. వారు చేసిన ఆలస్యం వల్ల వ్యోమగాములు ఎన్నో ఇబ్బందులు ఎదుర్కోవాల్సివస్తోందని తాజాగా ఎలాన్ మస్క్ విమర్శించారు. సురక్షితంగా తీసుకురావాలని స్పేస్‌ఎక్స్‌ను అమెరికా అధ్యక్షుడు ట్రంప్ కోరారని.. త్వరలో ఆ పని పూర్తి చేస్తామని మస్క్ తెలిపారు. దాంతో వారిని తిరిగి తీసుకొచ్చే చర్యలు వేగవంతం అవుతున్నట్లు తెలుస్తోంది.