Super Vasuki Train: ఒకటి కాదు, రెండు కాదు.. 295 బోగీల గూడ్స్ రైలు ఇది.. ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్తుందంటే..

ఇంత పెద్ద గూడ్స్ రైలు ఎక్కడో చైనాలో లేదు.. అమెరికాలో అంతకన్నా లేదు.. అది ఉన్నది మన దేశంలోనే. పట్టాల మీద ప్రయాణం చేస్తోంది కూడా మనదేశంలోనే..


ప్రపంచంలోనే నాలుగవ అతిపెద్ద రైల్వే వ్యవస్థగా భారతీయ రైల్వేకు పేరు ఉంది. ప్రతిరోజు నాలుగు కోట్ల మంది ప్రయాణికులను తమ గమ్యస్థానాలకు రైల్వే శాఖ చేరవేర్చుతోంది. ప్రకృతి మధ్యనుంచి, ప్రపంచంలో అతి ఎత్తైన వంతెనపై రైళ్లను నడిపిస్తున్న ఘన చరిత్ర భారతీయ రైల్వే శాఖకు ఉంది. అయితే ఈ జాబితాలో ఇప్పుడు అత్యంత పొడవైన గూడ్స్ రైలు కూడా చేరింది. భారతీయ రైల్వే శాఖ నడిపే గూడ్స్ రైళ్లకు మహా అయితే 25 నుంచి 50 వరకు బోగీలు ఉంటాయి. కానీ ఈ గూడ్స్ రైలుకు మాత్రం 295 బోగీలు ఉంటాయి. ఈ బోగీలను లాగడానికి ఆరు ఇంజన్లు పనిచేస్తుంటాయి.. దీన్ని “సూపర్ వాసుకి” అని పిలుస్తుంటారు. సూపర్ వాసుకి పొడవు 3.5 కిలోమీటర్లు.. దీనికి 295 కోచ్ లు ఉంటాయి. వాటిని లాగడానికి ఆరు లోకోమోటివ్ ఇంజన్లు ఉంటాయి. అంత పెద్ద స్థాయిలో బోగీలను కలిగి ఉంటుంది కాబట్టి.. ఈ రైలు ఒక స్టేషన్ నుంచి మరొక స్టేషన్ దాటాలి అంటే దాదాపు గంట సమయం పడుతుంది.

ఎందుకు ఇన్ని బోగీలు

ఈ రైలు దేశంలోని వివిధ గనుల నుంచి బొగ్గులు సేకరిస్తుంది. దానిని వివిధ విద్యుత్ ప్లాంట్లకు రవాణా చేస్తుంది.. చత్తీస్ గడ్ లోని కోర్బా నుంచి నాగపూర్ ప్రాంతంలోని రాజ్ నంద్ గావ్ వరకు ఈ రైలు ప్రయాణిస్తుంది. సుమారు 27 వేల టన్నుల బొగ్గును తీసుకెళ్తుంది.. కోర్బా రాజ్ నంద్ గావ్ నగరాల మధ్య ఉన్న దూరాన్ని సూపర్ వాసుకి 11.20 గంటల్లోనే కవర్ చేస్తుంది. వాసుకి అనేది శివుడి మెడలో ఉన్న సర్పం పేరు. ఈ రైలు కూడా అదే పేరు పెట్టారు. పాములకు రాజుగా వాసుకి పిలుస్తుంటారు.. దేవతలు పురాణ కాలంలో క్షీరసాగర మదనంలో తాడుకు బదులుగా వాసుకిని ఉపయోగించారు. అమృతం వచ్చిన తర్వాత దేవతలు వాసుకి కి పూజలు చేశారు. ఈ ట్రైన్ కూడా కదులుతున్నప్పుడు అచ్చం వాసుకి పాములాగే కనిపిస్తుందట. అందువల్లే దానికి ఆ పేరు పెట్టారు. భారతీయ రైల్వే చరిత్రలో అతిపెద్ద గూడ్స్ రైలుగా దీనికి పేరు ఉంది. గూడ్స్ విభాగంలో సరికొత్త చరిత్రను ఈ రైలు సృష్టిస్తోంది. ప్రతి ఏడాది వందల కోట్ల ఆదాయాన్ని రవాణా మార్గం ద్వారా రైల్వే శాఖకు అందిస్తున్న ఘనత వాసుకి కి ఉంది. అందుకే దీనిని భారత రైల్వే శాఖ అధికారులు కదులుతున్న ఖజానాగా పేర్కొంటుంటారు.