చలి కాలంలో శ్వాసకోశ వ్యాధులు, గుండె జబ్బులు ఎక్కువగా ప్రబలే అవకాశం ఉంది. అందుకే ఈ సీజన్‌కు తగినట్టుగా మన ఆహార అలవాట్లు మార్చుకోవాలి. చలికాలంలో బాడీని వేడిగా ఉంచుకోవడంతోపాటు, కొవ్వులేని ఆహార పదార్థాలను తీసుకోవాలి.
వివిధ ఆరోగ్య ప్రయోజనాలను అందించే చియా గింజలను వింటర్ సూపర్ ఫుడ్‌గా చెబుతారు ఆహార నిపుణులు. వీటిల్లో ఒమేగా-3 కొవ్వు ఆమ్లాలు, ముఖ్యంగా ఆల్ఫా-లినోలెనిక్ యాసిడ్ (ALA)లో పుష్కలంగా లభిస్తాయంటున్నారు నిపుణులు. ఒమేగా-3 కొవ్వు ఆమ్లాలు గుండె, మెదడు పనితీరును మెరుగుపర్చడంలో కీలక పాత్ర పోషిస్తాయి.
చియా సీడ్స్‌లో ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్స్, ఫైబర్, ప్రొటీన్, యాంటీ ఆక్సిడెంట్లు, విటమిన్లు , మినరల్స్ సమృద్ధిగా ఉంటాయి. వీటిని పలు రకాలుగా మన ఆహారంలో చేర్చుకోవచ్చు. ముఖ్యంగా చియా వాటర్, స్మూతీస్, యోగర్ట్స్, లలాడ్స్, పుడ్డింగ్ రూపంలో తీసుకోవచ్చు.
ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్స్, ఆరోగ్యకరమైన కొవ్వులు గుండె ఆరోగ్యానికి, మంటను తగ్గించడానికి, మెదడు పనితీరును మెరుగుపరుస్తాయి.
చియా గింజల్లో ఎక్కువగా లభించే డైటరీ ఫైబర్ జీర్ణ ఆరోగ్యాన్ని ప్రోత్సహిస్తుంది. మంచి శక్తి నిస్తుంది.
యాంటీఆక్సిడెంట్లతో నిండిన చియా విత్తనాలు పర్యావరణ కారకాలు, కాలానుగుణ హెచ్చుతగ్గుల వల్ల కలిగే సమస్యల్ని ఎదుర్కోవడంలో సహాయపడతాయి, రోగనిరోధక వ్యవస్థను బలపరుస్తాయి. జలుబు, దగ్గు, ఫ్లూ వంటి సమస్యలనుంచి ఉపశమనానికి తోడ్పడతాయి.
అలాగే చలికాలంలో నీళ్లు ఎక్కువగా తాగుతాం కాబట్టి చియా గింజల వాటర్ తీసుకోవడం మంచిది. చియా విత్తనాలు హైడ్రోఫిలిక్ లక్షణాలను కలిగి ఉంటాయి. ఫలితంగా శీతాకాలంలో శరీరంలో తేమను నిలుపుకోవడంలో సహాయపడతాయి. చియా విత్తనాలు చర్మం తేమను కోల్పోకుండా కాపాడుతాయి. చర్మ సమస్యలను దూరం చేస్తాయి.
హెర్బల్ టీ లేదా హాట్ చాక్లెట్ వంటి వేడి పానీయాలకు చియా సీడ్స్ యాడ్ చేసుకోవచ్చు.
ఒక గ్లాస్ నీటిలో, కొద్దిగా చియా గింజలు వేసి, రాత్రంతా నానబెట్టాలి. ఆ నీటిని ఉదయం పరగడుపునే తాగితే, రోజంతా హైడ్రేటెడ్‌గా ఉంటుంది. పీచు పదార్థం పుష్కలంగా అందుతుంది. తద్వారా జీర్ణక్రియ ఆరోగ్యం మెరుగుపడుతుంది. మలబద్ధకం నుంచీ ఉపశమనం లభిస్తుంది.
చియా గింజల్లో యాంటి ఆక్సిడెంట్లు ఫ్రీ రాడికల్స్ నుంచి శరీరాన్ని రక్షించడంలో సాయపడతాయి. ఇందులోని యాంటి ఇన్‌ఫ్లమేటరీ గుణాలు కేన్సర్ లక్షణాలను తగ్గిస్తాయి.
చియా పుడ్డింగ్: పాలలో (బాదం లేదా కొబ్బరి పాలతో కూడా) చియా గింజలను నానబెట్టి రాత్రంతా రిఫ్రిజిరేటర్‌లో ఉంచి, నచ్చిన మరికొన్ని పండ్ల ముక్కలను కలుపుకొని చియా సీడ్ పుడ్డింగ్‌ను చేసుకోవచ్చు.
సౌందర్య పోషణలోనూ, జుట్టు సంరక్షణలో కూడా చియా గింజలు ప్రభావవంతంగా పనిచేస్తాయి.