ఏపీలో రైతులకు ఎరువుల సరఫరా… అధికారులకు సీఎం చంద్రబాబు కీలక ఆదేశాలు

ఆంధ్రప్రదేశ్‌లోని రైతులకు ఎరువుల సరఫరాకు సంబంధించి సీఎం చంద్రబాబు నాయుడు కీలక ఆదేశాలు జారీ చేశారు. ఎరువుల సరఫరా విషయంలో రైతులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా చూసుకోవాలని చెప్పారు.


సీఎం చంద్రబాబు నాయుడు ఆదివారం రోజున రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, డీజీపీ, వ్యవసాయ శాఖ అధికారులు, విజిలెన్స్ అధికారులతో టెలికాన్ఫరెన్స్ ద్వారా సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా మార్క్ ఫెడ్ ద్వారా దాదాపు 70 శాతం మేర ఎరువులు రైతులకు సరఫరా అయ్యేలా ప్రణాళికలు సిద్దం చేసుకోవాలని సీఎం చంద్రబాబు సూచించారు. ప్రైవేట్ డీలర్ల కంటే ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాల ద్వారా ఎరువుల సరఫరా ఎక్కువగా జరిగేలా చూడాలన్నారు.

జిల్లాల వారీగా ఎరువుల లభ్యత, సరఫరా వివరాలపై ఆరా తీశారు. విజిలెన్స్ తనిఖీలు ముమ్మరంగా చేపట్టాలన్న మార్గనిర్దేశం చేశారు యూరియా, ఎరువుల స్టాక్ చెకింగ్ చేపట్టాలని విజిలెన్స్ అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. వ్యవసాయేతర అవసరాలకు యూరియా తరలిపోకుండా చూడాలని అధికారులకు సూచించారు. ఎరువులు బ్లాక్ మార్కెట్‌కు తరలించేవారిపై కేసులు నమోదు చేయాలని ఆదేశించారు. ఎరువులను అధిక ధరలకు విక్రయించే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని చెప్పారు. ఎరువుల కొరత అంటూ ఎవరైనా ఫేక్ ప్రచారాలు చేస్తుంటే తగు రీతిన సమాధానం చెప్పాలని ఆదేశించారు.

ఇదిలాఉంటే, ఏపీ తీవ్రమైన యూరియా కొరత ఉందని, కృత్రిమ కొరత సృష్టించి యూరియాను బ్లాక్ మార్కెట్ కు తరలిస్తున్నారని జరుగుతున్న ప్రచారాన్ని ఏపీ ప్రభుత్వ ఫ్యాక్ట్ చెక్ట్ వింగ్ ఖండించింది. ఇలాంటి కథనాలు రైతులను కలవరపెట్టేందుకు ఉద్దేశ పూర్వకంగా చేస్తున్న ప్రచారాలేనని… అవి వాస్తవాలు కాదని పేర్కొంది. ఖరీఫ్ సీజన్ మొత్తానికి 6.22 లక్షల మెట్రిక్ టన్నుల యూరియా అవసరం అవుతుందని… ముందు జాగ్రత్తగా కాస్త ఎక్కువగానే అంటే 6.39 లక్షల మెట్రిక్ టన్నుల యూరియాను అందుబాటులో ఉంచడం జరిగిందని తెలిపింది. అందువల్ల ట్టి కొరత అన్న మాట అబద్ధమని పేర్కొంది.

ఇందులో ఇప్పటివరకు 4.89 లక్షల మెట్రిక్ టన్నుల యూరియాను అమ్మగా… ఇంకా 1.50 లక్షల మెట్రిక్ టన్నుల యూరియా నిల్వలు అందుబాటులో ఉన్నాయని తెలిపింది. అయితే ఎక్కడిక్కడ వ్యవసాయపనులు జోరుగా సాగుతుండటం, ఎరువుల పంపిణీలో సిబ్బంది బిజీగా ఉండటం మూలంగా iFMS రికార్డుల్లో యూరియా అమ్మకపు వివరాలు రియల్ టైమ్‌లో నమోదు కావడం లేదన్న మాట వాస్తవమని పేర్కొంది. అంతేకాని వారు ప్రచారం చేస్తున్నట్టు తప్పుడు లెక్కలు, బ్లాక్ మార్కెట్ వంటివి ఏవీలేవని పేర్కొంది. వారి ప్రచారంలో పేర్కొన్న అనకాపల్లి, కాకినాడ, శ్రీకాకుళం, విజయనగరం, అనంతపురం, కృష్ణా, ఎన్టీఆర్, తూర్పు గోదావరి, కడప, నంద్యాల, ఏలూరు జిల్లాలలో పరిస్థితిని మళ్ళీ ఒకసారి సమీక్షించడం జరిగిందని… ఎక్కడా కూడా వారు ప్రచారం చేస్తున్నట్టుగా ఎలాంటి అవకతవకలు లేవని తెలిపింది.

అధికారులు దగ్గరుండి మరీ రైతులకు ఎరువుల సరఫరాను పర్యవేక్షిస్తున్నారని తెలిపింది. రైతు పాస్ బుక్, ఆధార్ కార్డులను తనిఖీ చేసి మరీ ఎరువును అందిస్తున్నారని… ఎమ్మార్పీ ప్రకారమే అమ్మకాలు జరుగుతున్నాయని చెప్పింది. రైతులు వేసిన పంటలను బట్టి వారికి ఎరువులు సరఫరా చేయడం జరుగుతోంది… ఒక్కొక్కరికీ ఒకటి లేదా రెండు బ్యాగుల చొప్పున అందజేస్తూ కొరత అన్నమాట రాకుండా రైతులందరికీ యూరియా అందేలా తగిన జాగ్రత్తలు తీసుకుంటున్నారని తెలిపింది. అయితే ఈ విషయంలో ఉద్దేశ పూర్వకంగా చేస్తున్న దుష్ప్రచారం మాత్రమేనని… ఇటువంటి ప్రచారం పట్ల రైతులు ఎవరూ ఆందోళన చెందవద్దని కోరింది.

👉 ఈ ఆర్టికల్ ని మీ వాట్సప్ / టెలిగ్రామ్ / పేస్ బుక్ / ట్విట్టర్ లలో షేర్ చేయండి .... థాంక్యూ.