నేర శిక్షా స్మృతి లేదా భారతీయ నాగరిక సురక్ష సంహిత ప్రకారం నిందితులకు పోలీసులు ఇవ్వవలసిన నోటీసులను వాట్సాప్, ఈ-మెయిల్ లేదా ఇతర ఎలక్ట్రానిక్ పద్ధతుల్లో పంపించరాదని సుప్రీంకోర్టు చెప్పింది.
సీఆర్‌పీసీ, 1973లోని సెక్షన్ 41-ఏ లేదా బీఎన్‌ఎస్‌ఎస్, 2023లోని సెక్షన్ 35 ప్రకారం జారీ చేసే నోటీసులను చట్టం అనుమతించినట్లుగానే నిందితులకు అందజేయాలని పోలీసులను ఆదేశించాలని అన్ని రాష్ర్టాలు, కేంద్ర పాలిత ప్రాంతాలను ఆదేశించింది. సతేందర్ కుమార్ అంటిల్ కేసులో జస్టిస్ ఎంఎం సుందరేశ్, జస్టిస్ రాజేశ్ బిందల్ ధర్మాసనం ఈ నెల 21న ఈ ఆదేశాలను జారీ చేసింది.
సీఆర్‌పీసీ, 1973లోని సెక్షన్ 41-ఏ ప్రకారం నిందితులకు నోటీసులను వాట్సాప్ ద్వారా పంపించినపుడు, ఆ నిందితులు దర్యాప్తు అధికారి సమక్షంలో హాజరుకాని సందర్భాలు ఉన్నాయని అమికస్ క్యూరీ సిద్ధార్థ లూథ్రా కోర్టుకు తెలిపారు. సాధారణ పద్ధతిలో నోటీసులను అందజేయడానికి బదులుగా, సీఆర్‌పీసీ సెక్షన్ 41-ఏ లేదా బీఎన్‌ఎస్‌ఎస్ సెక్షన్ 35 నిర్దేశించిన విధానాన్ని పోలీసులు దాటవేయరాదని చెప్పారు. దీంతో ధర్మాసనం స్పందిస్తూ, నిందితులకు నోటీసులను అందజేయడానికి సీఆర్‌పీసీ/బీఎన్‌ఎస్‌ఎస్ నిర్దేశించిన, గుర్తించిన విధానం ఉందని, వాట్సాప్ లేదా ఇతర ఎలక్ట్రానిక్ పద్ధతుల్లో నోటీసులను పంపించడం ఆ విధానానికి ప్రత్యామ్నాయం కాదని స్పష్టం చేసింది.
మూడు వారాల్లోగా అమలుచేయాలి..
అన్ని హైకోర్టులు సంబంధిత కమిటీల సమావేశాలను నిర్వహించాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. తన అన్ని ఆదేశాలు, అన్ని స్థాయిల్లోనూ అమలయ్యేలా నెలవారీ ప్రాతిపదికపై చర్యలు తీసుకోవాలని తెలిపింది. ఈ ఆదేశాలను పాటించినట్లు తెలిపే నివేదికలను నెలవారీ సమర్పించాలని తెలిపింది. ఈ ఆదేశాలు మూడు వారాల్లోగా అమలయ్యేలా చర్యలు తీసుకోవాలని అన్ని రాష్ర్టాలు, యూటీల హైకోర్టుల రిజిస్ట్రార్ జనరల్స్, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులను ఆదేశించింది.