Andhra News: డ్వాక్రా మహిళలకు తీపికబురు

డ్వాక్రా మహిళలకు వెన్నుదన్నుగా నిలిచేలా కూటమి ప్రభుత్వం త్వరలో రెండు కొత్త పథకాలకు శ్రీకారం చుట్టనుంది. వారి పిల్లల చదువుకు అండగా నిలిచేందుకు ‘ఎన్టీఆర్‌ విద్యాలక్ష్మి’, ఆడబిడ్డల వివాహాలకు చేయూతనిచ్చేలా ‘ఎన్టీఆర్‌ కల్యాణలక్ష్మి’ పథకాలను అమల్లోకి తీసుకురానుంది. ఈ రెండు పథకాల కింద గ్రామీణ పేదరిక నిర్మూలన సొసైటీ (సెర్ప్‌) పరిధిలోని స్త్రీనిధి బ్యాంకు ద్వారా రూ.లక్ష వరకు పావలా వడ్డీకి రుణంగా ఇస్తారు. ఇప్పటికే ముఖ్యమంత్రి చంద్రబాబు వీటికి ఆమోదముద్ర వేశారు. గత వారంలోనే ఈ పథకాల్ని ప్రారంభించాల్సి ఉండగా, అనివార్య కారణాలతో వాయిదా పడింది. మరో పది రోజుల్లో అమల్లోకి తీసుకువచ్చేలా అధికారులు చర్యలు తీసుకుంటున్నారు.


పథకం ఎవరికి వర్తిస్తుందంటే..

  • డ్వాక్రా సంఘంలో నమోదై కనీసం ఆరు నెలలు గడిచిన సభ్యురాలికి..
  • ఇప్పటికే బ్యాంకు లింకేజీ, స్త్రీనిధి, ఇతర మార్గాల్లో తీసుకున్న అప్పును చెల్లించే వారికి.
  • బయోమెట్రిక్‌ ఆధారంగా అమలు చేస్తారు.

ఎన్టీఆర్‌ విద్యాలక్ష్మి పథకం అమలు ఇలా..

  • గరిష్ఠంగా ఇద్దరు పిల్లల చదువులకు.
  • రూ.10 వేల నుంచి రూ.లక్ష వరకు (గరిష్ఠంగా) రుణసాయం అందిస్తారు.
  • పాఠశాలలు, కళాశాలల్లో పిల్లల ఫీజుకు అనుగుణంగా అవసరమైన మొత్తాన్ని తీసుకోవచ్చు.
  • 4% వడ్డీ (పావలా వడ్డీ)కి ఇస్తారు.
  • తీసుకున్న మొత్తానికి అనుగుణంగా చెల్లింపు వాయిదాల సంఖ్య ఉంటుంది. గరిష్ఠంగా 48 వాయిదాల్లో చెల్లించాలి.
  • అడ్మిషన్‌ లెటర్, ఫీజు చెల్లింపు విధానం, ఇన్‌స్టిట్యూట్‌ వివరాలు, రసీదును సమర్పించాలి.
  • దరఖాస్తు చేసుకున్న 48 గంటల్లో సభ్యురాలి బ్యాంకు ఖాతాలో నేరుగా నగదు జమ చేస్తారు.

ఎన్టీఆర్‌ కల్యాణలక్ష్మి అమలు ఇలా..

  • సభ్యురాలి కుమార్తె వివాహానికి ఈ పథకం వర్తిస్తుంది.
  • అవసరానికి అనుగుణంగా రూ.10 వేల నుంచి రూ.లక్ష వరకు (గరిష్ఠంగా) రుణంగా తీసుకునే వెసులుబాటు ఉంది.
  • 4% వడ్డీ (పావలా వడ్డీ)కి ఇస్తారు.
  • తీసుకున్న మొత్తానికి అనుగుణంగా చెల్లింపు వాయిదాల సంఖ్య ఉంటుంది. గరిష్ఠంగా 48 వాయిదాల్లో చెల్లించాలి.
  • లగ్న పత్రిక, ఈవెంట్‌ నిర్వహణకు సంబంధించిన పత్రం, పెళ్లి ఖర్చు అంచనా వ్యయం పత్రాలను సమర్పించాలి.
  • వివాహానికి సంబంధించిన వివరాల పరిశీలన అనంతరం నేరుగా సభ్యురాలి బ్యాంకు ఖాతాలో నగదు జమ చేస్తారు.

ఏడాదికి రూ.2000 కోట్ల వ్యయం..

ఈ రెండు పథకాల కింద ఏడాదికి రూ.1000 కోట్ల చొప్పున మొత్తం రూ.2 వేల కోట్లు ఖర్చు చేయనున్నారు.

  • ఈ పథకాల అమలు ద్వారా పావలా వడ్డీ కింద సమకూరే ఆదాయంలో 50 శాతాన్ని తిరిగి డ్వాక్రా సంఘాలకు ఊపిరిగా ఉన్న మండల సమాఖ్యలు, గ్రామ సమాఖ్యల బలోపేతానికి వినియోగించనున్నారు.
  • మిగతా 50% మొత్తాన్ని ‘స్త్రీనిధి’ ఉద్యోగుల ప్రయోజనాలకు ఉపయోగించనున్నారు.
  • ఈ పథకాల కింద రుణ సాయం పొందిన తర్వాత సదరు సభ్యురాలు ప్రమాదంలో చనిపోతే ఆ రుణ మొత్తాన్ని మాఫీ చేస్తారు.
👉 ఈ ఆర్టికల్ ని మీ వాట్సప్ / టెలిగ్రామ్ / పేస్ బుక్ / ట్విట్టర్ లలో షేర్ చేయండి .... థాంక్యూ.