తంగలాన్ రివ్యూ: విక్రమ్ ప్రాణం పెట్టేశాడు… అతని కష్టానికి తగ్గ ఫలితం దక్కుతుందా?

www.mannamweb.com


కథలు, క్యారెక్టర్లు, లుక్స్ పరంగా ప్రయోగాలకు ఎప్పుడూ ఒక అడుగు ముందు ఉండే కథానాయకుడు విక్రమ్. ఆయన తాజా సినిమా ‘తంగలాన్’. కార్తీ ‘మద్రాస్’, రజనీకాంత్ ‘కబాలి’, ‘కాలా’ సినిమాలతో తెలుగు ప్రేక్షకులకు సైతం దగ్గరైన తమిళ దర్శకుడు పా రంజిత్ తెరకెక్కించారు. పార్వతి తిరువొతు, మాళవికా మోహనన్, పశుపతి తదితరులు నటించిన చిత్రమిది. టీజర్, ట్రైలర్ కొత్తగా కనిపించాయి. మరి, సినిమా (Thangalaan Review Telugu)? కథ? రివ్యూలో తెలుసుకోండి.

కథ (Thangalaan Movie Story): తంగలాన్ (విక్రమ్), గంగమ్మ (పార్వతి తిరువొతు) దంపతులు తమకు ఉన్న కొద్దిపాటి వ్యవసాయ భూమిని సాగు చేసుకుంటూ పిల్లలతో సంతోషంగా జీవిస్తున్నారు. పంట చేతికి వచ్చిన సమయంలో ఎవరో తగలబెడతారు. పన్నులు కట్టలేదని ఊరి జమీందారు పంట పొలం స్వాధీనం చేసుకుని, కుటుంబం అంతటినీ వెట్టి చాకిరీ చేయాలని ఆదేశిస్తాడు. సరిగ్గా ఆ సమయంలో క్లెమెంట్ దొర వస్తాడు. బంగారు గనులు తవ్వడానికి తనతో వస్తే ఎక్కువ డబ్బులు ఇస్తానని చెబుతాడు.

‘తంగలాన్’కు తరచూ కల వస్తుంది. అందులో అతని తాతను ఆరతి (మాళవికా మోహనన్) వెంటాడుతూ ఉంటుంది. ఆమె ఎవరు? బ్రిటీషర్లతో కలిసి బంగారం తవ్వడానికి వెళ్లిన తంగలాన్, అతని సమూహానికి ఎటువంటి పరిస్థితులు ఎదురు అయ్యాయి? అరణ్య (విక్రమ్) ఎవరు? చివరకు తంగలాన్ ఏం తెలుసుకున్నాడు? బంగారం దొరికిందా? లేదా? అనేది సినిమా.

విశ్లేషణ (Thangalaan Telugu Review): తంగలాన్… ప్రచార చిత్రాలు చూశాక పా రంజిత్ సరికొత్త ప్రపంచంలోకి ప్రేక్షకులను తీసుకు వెళ్ళబోతున్నారని అర్థం అయ్యింది. తన సినిమాల్లో దళితవాదం ఎక్కువగా వినిపిస్తారని ఆయన మీద ముద్ర ఉంది. దేశానికి స్వాతంత్య్రం రాకముందు, అదీ బ్రిటీషర్లు పాలించే సమయంలో ఎలా చూపిస్తారని కుతూహలం ప్రేక్షకులు కొందరిలో నెలకొంది. ఈ సినిమాలో దళితవాదం తక్కువ. ప్రకృతి వనరుల గురించి పరోక్షంగా ఇచ్చిన సందేశం ఎక్కువ.

‘తంగలాన్’ ప్రారంభమే ప్రేక్షకులను సరికొత్త ప్రపంచంలోకి తీసుకు వెళుతుంది. రవికలు లేని మహిళలు, కుటుంబమంతా కలిసి వ్యవసాయం చేసే తీరు, గూడెం ప్రజలు సరదాగా కబుర్లు చెప్పుకోవడం వంటివి కొత్తగా కనిపించాయి. జమీందార్ వ్యవస్థ మీద, బ్రిటిషర్లు కూడా వచ్చిన కన్నడిగ చర్యల్లో వర్ణ వివక్షను వదల్లేదు పా రంజిత్. సన్నివేశాలను సైతం మాసీగా తీశారు.

‘తంగలాన్’కు వచ్చే కలలు సినిమా ప్రారంభం నుంచి కథపై ఆసక్తి కలిగిస్తాయి. ఓ దశలో అతనికి వచ్చేది కల మాత్రమేనా? లేదంటే నిజంగా ఆ విధంగా జరిగిందా? అని ప్రేక్షకులు ఆలోచించడం మొదలు పెడతారు. గోల్డ్ మైనింగ్ కథ (యాక్షన్ అడ్వెంచర్)కు ఫాంటసీ టచ్ ఇవ్వడంలో దర్శకుడు పా రంజిత్ సక్సెస్ అయ్యారు. కానీ, నిడివి విషయంలో ఆయన తడబడ్డారు. కొత్త ప్రపంచంలోకి తీసుకు వెళ్లడం కోసం మొదట్లో పాత్రల పరిచయానికి సమయం తీసుకున్నారని అనుకున్నా… కథ ఓ కొలిక్కి వచ్చాక, కాన్‌ఫ్లిక్ట్ క్రియేట్ అయిన తర్వాత కూడా కొన్ని సన్నివేశాల కోసం ఎక్కువ సమయం తీసుకున్నారు. బ్రిటీషర్లు మనల్ని ముందు నమ్మించి, తర్వాత ఎలా మోసం చేశారు? అనేది కొత్త కాదు. అందువల్ల, ఆయా సీన్లు సాదాసీదాగా అనిపించాయి. సహజత్వం పేరుతో తీసిన భార్యభర్తల సన్నివేశాలు వెగటు పుట్టించాయి. కుటుంబంతో చూసేలా లేవు.

‘తంగలాన్’కు మెయిన్ ప్రాబ్లమ్ సెకండాఫ్. బంగారం కోసం వెళ్లిన ప్రజలను ఆ బంగారానికి కాపలాగా ఉంటున్న అరణ్య ఏం చేస్తుందో మొదట్లో చూపించారు. ఆ సన్నివేశాలు థ్రిల్ ఇచ్చాయి. ఇంటర్వెల్ తర్వాత మరొకసారి ఆ సన్నివేశాలు రావడం రిపీట్ అయిన ఫీలింగ్ కలుగుతుంది. బంగారం తవ్వడం కోసం ఊరు ఊరంతా రావడం, ఆయా సన్నివేశాలు సాగదీత వ్యవహారమే. అయితే, క్లైమాక్స్ థ్రిల్ ఇస్తుంది. కెమెరా వర్క్, మ్యూజిక్ బావున్నాయి. ఆ పాటలు కథలో భాగంగా వెళ్లాయి. వినడానికి బావున్నాయి. స్టూడియో గ్రీన్ అధినేత జ్ఞానవేల్ రాజా ఖర్చుకు వెనుకాడలేదు. టెక్నికల్ పరంగా, విజువుల్‌గా సినిమా బావుంది.

విక్రమ్ ప్రాణం పెట్టి సినిమా చేశారు. తంగలాన్, అతని తాత, అరణ్య… మూడు పాత్రల్లో కనిపించారు. అరణ్యతో పోలిస్తే మిగతా రెండు పాత్రలు లుక్ పరంగా ఇంచు మించు ఒకేలా ఉంటాయి. అరణ్యగా వేరియేషన్ చూపించారు. గెటప్స్ సంగతి పక్కన పెడితే… నటుడిగా తనలో కొత్త కోణాన్ని చూపించారు. పార్వతి తిరువొతు సైతం గంగమ్మ పాత్రలో ఒదిగిపోయారు. మాళవికా మోహనన్ (Malavika Mohanan)ను గుర్తు పట్టడం కష్టం. గ్లామర్ పక్కనపెట్టి… ఆ పాత్ర మాత్రమే కనిపించేలా మేకప్ వేశారు. నటిగా ఆ పాత్ర పరిధి మేరకు నటించారు. పశుపతి, మిగతా పాత్రధారులు ఓకే.

‘తంగలాన్’ కథ, ఆ క్యారెక్టర్లు సరికొత్త ప్రపంచంలోకి తీసుకు వెళ్లడం గ్యారంటీ. మరీ ముఖ్యంగా విక్రమ్, మాళవిక, పార్వతిల నటన పూర్వీకుల కాలాన్ని కళ్ల ముందు ఆవిష్కరించింది. డిఫరెంట్ థియేట్రికల్ ఎక్స్‌పీరియన్స్ కోరుకునే ప్రేక్షకులను ఈ సినిమా మెప్పిస్తుంది. కమర్షియల్ సినిమాల మధ్య వైవిధంగా నిలబడుతుంది. కానీ, అందరూ హర్షించడం కష్టమే. విక్రమ్ కష్టానికి, నిర్మాత ఖర్చుకు తగ్గ సినిమా ఇవ్వడంలో పా రంజిత్ ఫెయిల్ అయ్యారు.