టాటా మోటార్స్ తన ప్రీమియం హ్యాచ్‌బ్యాక్ ఆల్ట్రోజ్ (Tata Altroz) ఫేస్‌లిఫ్ట్ భారత్ ఎన్‌సీఏపీ (Bharat NCAP) క్రాష్ టెస్టులో 5 స్టార్ రేటింగ్ సాధించింది. ఆల్ట్రోజ్ ఫేస్‌లిఫ్ట్ వెర్షన్‌ను రూ.6.89 లక్షల (ఎక్క్-షోరూమ్) ప్రారంభ ధరతో ఇటీవల మార్కెట్‌లోకి తీసుకొచ్చిన సంగతి తెలిసిందే. రీఫ్రెష్డ్ లుక్‌తో పాటు మరికొన్ని కొత్త ఫీచర్లతో దీన్ని లాంచ్ చేశారు. ఈ క్రమంలోనే భారత్ ఎన్‌క్యాప్ నిర్వహించిన టెస్టులో ఆల్ట్రోజ్ 5-స్టార్ రేటింగ్ సాధించింది. ఈ మేరకు భారత్ ఎన్‌క్యాప్ తన అధికారిక వెబ్‌సైట్‌లో వెల్లడించింది.
అడల్ట్ ఆక్యుపెంట్ ప్రొటెక్షన్‌లో ఆల్ట్రోజ్ 32 పాయింటక్లకు గానూ 29.65 పాయింట్లు సాధించిందని భారత్ ఎన్‌క్యాప్ తెలిపింది. ఫ్రంటల్ ఆఫ్‌సెట్ డిఫార్మబుల్ బ్యారియర్ టెస్టులో 16 పాయింట్లకు గానూ 15.55 పాయింట్లు సాధించిందని పేర్కొంది. దీని ద్వారా డ్రైవర్, ప్యాసింజర్ ఛాతీ, తొడల వద్ద సరైన రక్షణ లభిస్తుంది. సైడ్ మూవబుల్ డిఫార్మబుల్ బ్యారియర్ టెస్టులో 16 పాయింట్లకు గానూ 14.11 పాయింట్లు సాధించింది. చైల్డ్ ఆక్యుపెంట్ ప్రొటెక్షన్ విభాగంలో ఆల్ట్రోజ్ 49 పాయింట్లకు 44.90 పాయింట్లు సాధించింది.
ఈ క్రాష్ టెస్ట్ ఫలితాలు అందుబాటులో ఉన్న స్మార్ట్, ప్యూర్, ప్యూర్ ఎస్, క్రియేటివ్, క్రియేటివ్ ఎస్, ఎకాంప్లిష్‌డ్, ఎకాంప్లిష్‌డ్+ ఎస్ వంటి అన్ని వేరియంట్లకు వర్తిస్తాయని భారత్ ఎన్‌క్యాప్ పేర్కొంది. సేఫ్టీ ఫీచర్ల విషయానికొస్తే.. ఆల్ట్రోజ్‌లో స్టాండర్డ్‌గా ఆరు ఎయిర్‌బ్యాగ్స్, ABS with EBD, ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ కంట్రోల్ (ESC), టైర్ ప్రెజర్ మానిటరింగ్ సిస్టమ్ (TPMS), హిల్ హోల్డ్ అసిస్ట్, రియర్ పార్కింగ్ సెన్సార్స్, 360 డిగ్రీ కెమెరా వంటి ఫీచర్లు అందుబాటులో ఉన్నాయి.
































