టీడీపీని టెన్షన్ పెడుతున్న పులివెందుల పరిణామాలు

ఏపీ రాజకీయాల్లో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. కూటమి అధికారంలోకి వచ్చిన తరువాత వైసీపీ లక్ష్యంగా రాజకీయ వ్యూహాలు అమలు చేస్తోంది. అందులో భాగంగా ఈ సారి టీడీపీ మహానాడు కడప లో నిర్వహించాలని నిర్ణయించారు.


ప్రతిష్ఠాత్మకంగా ఏర్పాటు చేస్తున్న వేళ టీడీపీ లో పులివెందుల కేంద్రంగా ఊహంచని పరిణామాలు ఇప్పుడు పార్టీకి టెన్షన్ గా మారుతున్నాయి. సొంత పార్టీ నేతల వార్ ఉద్రిక్తతకు దారి తీస్తోంది.

నువ్వా – నేనా

పులివెందుల టీడీపీలో ఇరువర్గాల మధ్య విభేదాలు తారాస్థాయికి చేరాయి. జిల్లా ఇన్చార్జి మంత్రి సవిత సమక్షంలో బీటెక్‌ రవి వర్గీయులు, శాసనమండలి సభ్యుడు భూమిరెడ్డి రాంగోపాల్‌ రెడ్డి పై దాడికి దిగారు. సమావేశానికి రాంగోపాల్‌ రెడ్డి కూడా హాజరు కావడంతో సమావేశానికి రాకూడ దంటూ … వేముల టిడిపి ఇన్చార్జి పార్థసారథి రెడ్డి వర్గీయులు రాంగోపాల్‌ రెడ్డి పై దాడికి దిగారు. వైసీపీకి అనుకూలంగా వ్యవహరిస్తున్నారని, టిడిపి నాయకులు చేస్తున్న పనుల్లో అడ్డు తగులుతున్నారని పార్థసారధి రెడ్డి వర్గీయులు ఆరోపించారు. మైనింగ్‌, ఇడుపులపాయలోని త్రిబుల్‌ ఐటీ ఉద్యోగాలలో, క్యాంటింగ్‌ విషయంలో రాంగోపాల్‌ రెడ్డి జోక్యం చేసుకుంటున్నారని ఆరోపించారు. మంత్రి సవిత, టిడిపి పోలిట్‌ బ్యూరో సభ్యుడు శ్రీనివాసులు రెడ్డి జోక్యం చేసుకోవడంతో గొడవ సద్దుమణిగింది.

తారా స్థాయికి

గత పది రోజుల క్రితం వేముల మండలంలో కాంట్రాక్ట్‌ విషయంలో పార్థసారధి రెడ్డి, ఎమ్మెల్సీ రాంగోపాల్‌ రెడ్డి వర్గీయుల మధ్య ఘర్షణ జరిగింది. కూటమి అధికారంలోకి వచ్చిన తరువాత పులి వెందుల టీడీపీలో నేతల మధ్య వర్గపోరు తారాస్థాయికి చేరుకుంది. టీడీపీ ఎమ్మెల్సీ భూమిరెడ్డి రాంగోపాల్ రెడ్డి, టీడీపీ ఇన్‌ఛార్జ్‌ బీటెక్ రవి వర్గాల మధ్య గత కొద్ది నెలలుగా ఆధిపత్య పోరు జరుగుతోంది. ఇసుక టెండర్లు, రేషన్ డీలర్ల పోస్టుల విషయంలో విభేదాలు బయటపడ్డాయి. ఇసుక టెండర్ల తమ వారికే దక్కాలని, మరెవ్వరికీ ఇసుక టెండర్లు రావొద్దని బీటెక్ రవి వర్గీయులు కలక్టరేట్‌లో హడావుడి చేశారు. అది మరకముందే, రేషన్ డీలర్ల పోస్టులు తమ వర్గీయులకే దక్కాలని, మరెవ్వరినీ పరీక్షకు అనుమతించొద్దని బీటెక్ రవి వర్గం రాద్దాంతం చేసింది.

వరుస పరిణామాలతో రాంగోపాల్ రెడ్డి, బీటెక్ రవి వర్గాల మధ్య పోరు తారా స్థాయికి చేరింది. ఇదే సమయంలో కడపలో టీడీపీ మహానాడు నిర్వహణకు నిర్ణయించింది. ఇందు కోసం భారీ స్థాయిలో ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఈ సమయంలో పులివెందులలోనే మహానాడు నిర్వహించాలంటూ కొన్ని ప్రతిపాదనలు వచ్చాయి. అయితే, ఇప్పుడు పులివెందులలో సొంత పార్టీకి చెందిన నేతలే ఇలా బాహా బాహీకి దిగటం హైకమాండ్ కు సమస్యగా మారుతోంది. తాజాగా చోటు చేసుకున్న ఈ పరిణామాల పైన పార్టీ నాయకత్వం ఎలాంటి చర్యలు తీసుకుంటుందనేది కీలకంగా మారుతోంది.