ఛాతీలో పేరుకుపోయిన కఫాన్ని తగ్గించి దగ్గు నుంచి రిలీఫ్ అందించే టీ, తయారీ విధానం

www.mannamweb.com


చలికాలంలో రోజు రోజుకి ఉష్ణోగ్రతలు పడిపోతున్నాయి. చల్లని వాతావరణం, చలి గాలుల కారణంగా జలుబు, దగ్గు సమస్యలతో సాధారణంగా మారాయి. చాలా మంది ఈ సమస్యలతో బాధపడుతున్నారు.

వింటర్ సీజన్‌లో వైరస్‌లు, బ్యాక్టీరియాల ఎఫెక్ట్ ఎక్కువగా ఉంటుంది. దీంతో పొడి దగ్గు, జలుబు, గొంతు నొప్పి వంటి సాధారణ లక్షణాలు చాలా మందిలో కనిపిస్తాయి. అంతేకాకుండా ఛాతీలో శ్లేష్మం లేదా కూడా పేరుకుపోతుంది. ఇది శ్వాసకోస వ్యవస్థకు అడ్డంకిగా మారుతుంది.

దీంతో.. శ్వాస తీసుకోవడం, గొంతులో ఇబ్బందికర పరిస్థితులు ఉంటాయి. కఫం ఎక్కువగా పెరగడం వల్ల ఇన్ఫెక్షన్ లేదా వాపు రావచ్చు. ఇది శ్వాసకోస సమస్యలకు దారితీయవచ్చు. అయితే, కఫాన్ని తగ్గించడానికి కొన్ని ఇంటి చిట్కాలు ప్రభావవంతంగా పనిచేస్తాయి. వంటింట్లో దొరికే కొన్ని మసాలాలతో టీ చేసుకుని తాగడం వల్ల కఫాన్ని తగ్గించుకోవచ్చు. ఆ మసాలాలు ఏంటి? టీని ఎలా తయారు చేయాలో ఇక్కడ తెలుసుకుందాం.

అల్లం

​అల్లంలో సహజసిద్ధమైన యాంటీ ఇన్‌ఫ్లమేటరీ, యాంటీ ఆక్సిడెంట్ లక్షణాలు ఉంటాయి. ఇవి కఫాన్ని బయటకు పంపడంలో సాయపడతాయి. అల్లం తీసుకోవడం వల్ల ఇమ్యూనిటీ పవర్ పెరుగుతుంది. దీంతో చలికాలంలో వచ్చే సీజనల్ వ్యాధుల్ని తట్టుకునే శక్తి వస్తుంది. అల్లం టీకి తాజాదనాన్ని ఇవ్వడంతో పాటు గొంతు, ఛాతీలో పేరుకుపోయిన శ్లేష్మాన్ని బయటకు పంపుతుంది. అల్లం తీసుకోవడం వల్ల గొంతు నొప్పి తగ్గడమే కాకుండా.. శ్వాసకోశ వ్యవస్థ శుభ్రంగా ఉంటుంది.

పసుపు

కర్కుమిన్ అనే శక్తివంతమైన యాంటీ ఆక్సిడెంట్ పసుపులో ఉంటుంది. ఇది శక్తివంతమైన యాంటీ ఇన్ఫ్లమేటరీ, యాంటీ బాక్టీరియల్ ఏజెంట్. పసుపు తీసుకోవడం వల్ల శరీరంలో పేరుకుపోయిన బ్యాక్టీరియా, టాక్సిన్స్ బయటకు పోతాయి. టీలో పసుపు కలిపి తాగడం వల్ల కఫం బయటకు రావడంతో పాటు గొంతు నొప్పి, దగ్గు నుంచి ఉపశమనం లభిస్తుందని ఆయుర్వేద నిపుణులు చెబుతున్నారు.

పుదీనా

​పుదీనాలో యాంటీ ఆక్సిడెంట్ లక్షణాలు, విటమిన్ సి ఉన్నాయి. ఇవి రోగనిరోధక శక్తిని పెంచుతాయి. పుదీనా తీసుకోవడం వల్ల శ్వాసకోశ వ్యవస్థకు ఉపశమనం లభిస్తుంది. ఇందులో మెంథాల్ అనే మూలకం ఉంటుంది. ఇది గొంతు, ఛాతీలో మంటను తగ్గిస్తుంది. దీంతో శ్వాస తీసుకోవడంలో ఉపశమనం లభిస్తుంది. టీలో పుదీనా కలిపి తాగడం వల్ల ఛాతీలో పేరుకుపోయిన కఫం బయటకు వచ్చేస్తుంది. దీంతో శ్వాసకోశ వ్యవస్థ క్లీన్ అవుతుంది.

సోంపు

​జీర్ణవ్యవస్థకు ఎంతో మేలు చేసే సోంపు గింజల్లో యాంటీ సెప్టిక్, యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు ఉంటాయి. ఇవి కఫాన్ని బయటకు పంపడంలో సాయపడతాయి. సోంపు గింజల్ని టీ కలిపి తాగడం వల్ల గొంతు, ఛాతీలో పేరుకుపోయిన కఫం క్లియర్ అవుతుంది. దీంతో శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు తొలగిపోతాయి. దగ్గు నుంచి ఉపశమనం లభిస్తుంది. గొంతు నొప్పి కూడా తగ్గుతుంది.

టీ తయారు చేసే విధానం

టీ తయారు చేయడానికి ముందుగా ఒక కప్పు నీరు తీసుకోండి. ఇందులో అల్లం, పసుపు, పుదీనా, సోంపు గింజల్ని వేసి మరిగించాలి. బాగా మరిగిన తర్వాత ఫిల్టర్ చేయండి. ఇంకేముంది కఫాన్ని తొలగించే టీ సిద్ధం. ఈ టీని రోజూ ఉదయం, సాయంత్రం తాగితే మంచిది. ఇలా తాగడం వల్ల కఫం నుంచి ఉపశమనం లభిస్తుందని ఆయుర్వేద నిపుణులు చెబుతున్నారు. దీంతో శ్వాసకోస వ్యవస్థ ఆరోగ్యంగా ఉంటుంది.