కృష్ణా జిల్లాలో ఘోర సంఘటన చోటు చేసుకుంది. విద్యా బుద్ధులు నేర్పించాల్సిన ఉపాధ్యాయుడే.. విద్యార్థినిపై లైంగిక దాడికి పాల్పడ్డాడు. దీంతో విద్యార్థిని తల్లి ఫిర్యాదుతో ఉపాధ్యాయుడిపై పోక్సో కేసు నమోదు చేశారు. పోక్సో న్యాయమూర్తి ఆదేశాల మేరకు ఉపాధ్యాయుడిని రిమాండ్‌కు పంపారు.
కృష్ణా జిల్లా గుడివాడ మండలంలో దారుణం జరిగింది. చిన్నారులకు విద్యాబుద్ధులు నేర్పాల్సిన ఉపాధ్యాయుడు.. ఓ బాలిక పట్ల అసభ్యంగా ప్రవర్తించాడు. గుడివాడ మండలం చౌటపల్లి జడ్పీ స్కూల్‌లో నాలుగో తరగతి విద్యార్థిని పట్ల.. అదే పాఠశాలలో వ్యాయామ ఉపాధ్యాయుడిగా పని చేస్తున్న ఎం.చంద్రశేఖర్ (42) ఎక్కడెక్కడో తాకుతూ అసభ్యంగా ప్రవర్తిస్తున్నాడు. ఉపాధ్యాయుడి చేష్టలను ఇంట్లో చెప్పలేక.. ఇంట్లోనే ఓ మూలన కూర్చొని బాలిక రోధించింది.
“మాస్టారు రోజూ బ్యాడ్ టచ్ చేస్తున్నారు. ఎక్కడెక్కడో చేతులు వేస్తున్నారు. నేను ఇంకా స్కూలుకి వెళ్లను” అంటూ ఆ చిన్నారి చెప్పడంతో ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. ఉపాధ్యాయుడు వికృత చేష్టలకు ఆ చిన్నారి కొంతకాలంగా వేదనకు గురవుతోంది. బడికి వెళ్లాంటేనేర భయపడుతోంది. తల్లిదండ్రులు బతిమాలి, బెదిరించి స్కూల్‌కు పంపిస్తున్నారు. అయితే.. గురువారం ఇంట్లో కూర్చోని దిగాలుగా ఉన్న చిన్నారి.. స్కూల్‌కు వెళ్లనని మారం చేసింది. దీంతో ఎందుకు బడికి వెళ్లనంటున్నావని తల్లి ప్రశ్నించింది.
ఆ చిన్నారి ఏడుస్తూ తల్లికి అసలు విషయం చెప్పింది. డ్రిల్ మాస్టార్ తన పట్ల అసభ్యంగా ప్రవర్తిస్తున్నాడని, ఎక్కడెక్కడో చేతులు చేసి టచ్ చేస్తున్నాడని, అందుకే తాను స్కూల్‌కు పోనని ఆ చిన్నారి ఏడుస్తూ.. తల్లికి తన బాధను చెప్పింది. దీంతో తల్లి గుడివాడ తాలుకా పోలీస్‌స్టేషన్‌కు వెళ్లి తన బిడ్డను డ్రిల్ మాస్టార్ ఎ.చంద్రశేఖర్ కొంత కాలంగా అసభ్యంగా తాకుతున్నాడని.. దీంతో బడికి వెళ్లాలంటే భయపడుతోందని ఫిర్యాదు చేసింది. ఎస్ఐ ఎన్.చంటిబాబు నిందితుడిపై పోక్సో కేసు నమోదు చేశారు. న్యాయమూర్తి ఆదేశాల మేరకు రిమాండ్‌కు తరలించారు.
విజయనగరం జిల్లాలోనూ..
విజయనగరం జిల్లాలోనూ ఓ ఉపాధ్యాయుడు కామాంధుడిగా మారాడు. అక్కడ పదో తరగతి చదువుతున్న బాలికపై కన్నేసిన ఉపాధ్యాయుడు.. లైంగిక వేధింపులకు పాల్పడ్డాడు. బొబ్బిలి పట్టణంలోని ఓ ఉన్నత పాఠశాలకు చెందిన ఉపాధ్యాయుడు.. పదో తరగతి బాలికను లైంగికంగా వేధిస్తున్నాడు. ఈ విషయంపై ఉపాధ్యాయులు, విద్యార్థులు ఆ ఉపాధ్యాయుడిని ప్రశ్నించారు. ఉపాధ్యాయుడు ఎదురుతిరిగి, తనను ప్రశ్నిస్తే యాసిడ్ పోస్తానని, లారీతో గుద్ది చంపేస్తానని బెదిరింపులకు దిగాడు.
ఈ ఘటన ఆలస్యంగా బయటకు వచ్చింది. విషయం తెలుసుకున్న పోలీసులు నేరుగా స్కూల్‌కు వెళ్లి విచారణ చేపట్టారు. బొబ్బిలి డీఎస్పీ పీ.శ్రీనివాసరావు పాఠశాలలో ఉపాధ్యాయులు, విద్యార్థులతో కలిసి మాట్లాడారు. దీనిపై ఎవరూ ఫిర్యాదు చేయలేదని, ఉపాధ్యాయుడికి కౌన్సెలింగ్ ఇస్తామని పోలీసులు చెప్పారు.