గుడ్ న్యూస్ – మే నెలలో ఉపాధ్యాయుల బదిలీలు! మార్గదర్శకాలు ఇవే

ప్రభుత్వ ఉపాధ్యాయులకు వచ్చే మే నెలలో బదిలీలు చేపట్టేందుకు పాఠశాల విద్యాశాఖ కసరత్తు చేస్తోంది. వారి బదిలీలకు సంబంధించి కూటమి ప్రభుత్వం ప్రత్యేక చట్టం తీసుకొచ్చింది. మొదటిసారి ఈ చట్టం ప్రకారం బదిలీలు చేయబోతున్నారు. జీవో-117ను రద్దు చేసి, ప్రత్యామ్నాయంగా తీసుకునే చర్యలపై ఇప్పటికే క్షేత్రస్థాయిలో అధికారులు కసరత్తు చేస్తున్నారు.


వార్డు, గ్రామ పంచాయతీకో బడి: ఈసారి ఆదర్శ ప్రాథమిక పాఠశాలల విధానం తీసుకురాబోతున్నారు. అందుకు అనుగుణంగా ఉపాధ్యాయుల సర్దుబాటు చేపట్టనున్నారు. రాష్ట్రవ్యాప్తంగా 1-5 తరగతులకు ఐదుగురు ఉపాధ్యాయుల చొప్పున కేటాయిస్తూ ఈ విధానాన్ని తీసుకొస్తున్నారు. ఇప్పటివరకు ఈ ప్రక్రియ 95% పూర్తయింది. 430 బడులకు సంబంధించి నిర్ణయం తీసుకోవాల్సి ఉంది. 7,500పైగా ఆదర్శ ప్రాథమిక పాఠశాలలు ఏర్పాటయ్యే అవకాశం కనిపిస్తోంది. వార్డు, గ్రామ పంచాయతీకో బడి ఏర్పాటు చేసేలా ప్రణాళిక రూపొందించారు. ఈ ప్రక్రియ మొత్తం ఈ నెల 30 నాటికి ముగిసే అవకాశం ఉంది.

తుది జాబితాలను విడుదల: ఉపాధ్యాయుల సీనియారిటీ జాబితాలను ఈ నెల 20 నాటికి పూర్తి చేయనున్నారు. ఇప్పటికే పలుమార్లు వాటిని విడుదల చేసి, అభ్యంతరాలను కూడా స్వీకరించారు. మరోసారి సరిచూసుకొని చివరికి తుది జాబితాలను విడుదల చేస్తారు. మరోపక్క ఆదర్శ ప్రాథమిక పాఠశాలల ఏర్పాటు, ఉపాధ్యాయ పోస్టుల హేతుబద్ధీకరణ ప్రక్రియ పూర్తి చేయనున్నారు. ఆదర్శ పాఠశాలలకు పోస్టుల సర్దుబాటు, విద్యార్థుల సంఖ్య ఆధారంగా అవసరమయ్యే బడులకు పోస్టులను మార్పు చేస్తారు. దీనికి ఆర్థిక శాఖ అనుమతి తీసుకున్న అనంతరం పాఠశాలల్లో పోస్టులపై స్పష్టత వస్తుంది. దీనిప్రకారం బదిలీలు చేపడతారు.

బదిలీలు ఈ విధంగా: మే మొదటి వారంలో బదిలీలకు ప్రకటన విడుదల చేస్తారు. ప్రక్రియ ఆన్‌లైన్‌లో నిర్వహిస్తారు. ఖాళీల ఆధారంగా ఎంపికలను నమోదు చేసుకోవాలి. ఒక టీచర్‌ ఎన్ని ఖాళీలకైనా ఆప్షన్స్​ పెట్టుకోవచ్చు. వారి సీనియారిటీ, రిజర్వేషన్‌ రోస్టర్‌ ప్రకారం పోస్టులు కేటాయిస్తారు. తప్పనిసరిగా బదిలీ అయ్యే టీచర్లు తాము పనిచేస్తున్న పాఠశాలను ఎంపిక చేసుకోకూడదు. రెండేళ్లు సర్వీసు పూర్తిచేసుకున్న వారు తమకు నచ్చిన వాటితోపాటు తమ పాఠశాలను కూడా ఎంపిక చేసుకోవచ్చు.

మొదట ప్రధానోపాధ్యాయులకు బదిలీలు చేపడతారు. ఆ తర్వాత స్కూల్‌ అసిస్టెంట్లకు పదోన్నతులు కల్పిస్తారు. స్కూల్‌ అసిస్టెంట్లకు బదిలీలు నిర్వహించి, ఎస్జీటీలకు పదోన్నతులు కల్పిస్తారు. చివరిగా ఎస్జీటీలకు బదిలీలు నిర్వహిస్తారు. ఆ తర్వాత మిగిలే ఖాళీలు డీఎస్సీలో వచ్చే కొత్తవారితో భర్తీ చేసే అవకాశం ఉంది. బదిలీలను మే 30 లోపు పూర్తి చేయాలని నిర్ణయించారు.